రెండో విడత గొర్రెల పంపిణీకి మోక్షమెప్పుడో?
ABN , First Publish Date - 2020-11-13T08:54:47+05:30 IST
గొల్ల, కురుమ, యాదవులను ఆర్థికంగా బలోపేతం చేయాలని, రాష్ట్రంలో గొర్రెల సంఖ్య, మాంసం ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో ప్రారంభించిన ‘
రెండేళ్లుగా నిలిచిన ‘సమీకృత గొర్రెల అభివృద్ధి పథకం’
కొనసాగిస్తామని కేసీఆర్, తలసాని ప్రకటనలు
డీడీలు తీసిన లబ్ధిదారుల ఎదురుచూపు
హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): గొల్ల, కురుమ, యాదవులను ఆర్థికంగా బలోపేతం చేయాలని, రాష్ట్రంలో గొర్రెల సంఖ్య, మాంసం ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో ప్రారంభించిన ‘సమీకృత గొర్రెల అభివృద్ధి పథకం’ అర్ధంతరంగా ఆగిపోయింది. 2017 జూన్ 20 తేదీన ఈ పథకం ప్రారంభమైంది. 2019 మే వరకు.. కేవలం రెండేళ్ల వ్యవధిలో రెండు విడతల్లో ఈ పథకాన్ని పూర్తిచేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. మధ్యలోనే కాడెత్తేసింది.
7,29,067 మంది అర్హులైన గొల్ల, కుర్మల్లో కేవలం 3,65,682 మందికి గొర్రెల యూనిట్లు(20+1) పంపిణీచేసి.. మిగిలిన 3,63,385 మందికి మొండిచేయి చూపింది. అర్హులైన గొల్ల, కురుమ, యాదవులు సర్కారు అందించే గొర్రెల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు.
2017 జూన్ నుంచి 2018 మే వరకు మొదటి విడతలో.. 3,67,020 మందికి, 2018 జూన్ నుంచి 2019 మే వరకు రెండో విడతలో 3,62,047 మందికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఒక్కో యూనిట్‌లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు(రామ్) ఉంటాయి.
ఒక యూనిట్ విలువ రూ. 1.25 లక్షలు కాగా.. ఇందులో లబ్ధిదారుడు 25ు (రూ. 31,250) వాటాధనం చెల్లించాలి. ప్రభుత్వం 75ు (రూ. 93,750) సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్రంలో ఉన్న గొర్రెలను రీసైక్లింగ్ చేయకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలు కొనుగోలుచేసి తెచ్చి ఇక్కడి లబ్ధిదారులకు పంపిణీ చేయాలనే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం విధించింది.
అక్రమాలు జరుగుతున్నాయనే ఆపారా?
తొలి విడత గొర్రెల పంపిణీలో భాగంగా.. పశువైద్య అధికారులను బృందాలుగా తయారుచేసి, లబ్ధిదారులను వారికి జతచేసి పొరుగు రాష్ట్రాలకు పంపించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిసా, రాజస్థాన్.. రాష్ట్రాల్లో గొర్రెలు కొనుగోలుచేసి తెలంగాణకు తీసుకొచ్చారు. పనిలోపనిగా స్థానికంగా ఉన్న గొర్రెలనూ రీ- సైక్లింగ్ చేశారు. తప్పుడు ధ్రువీకరణలు, అక్రమ రవాణా, అవినీతి- అక్రమాలు.. జరగకూడనివన్నీ జరిగాయి. పలువురు అధికారులు, దళారులపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు కూడా నమోదు చేసింది.
అక్రమాలు జరుగుతున్నాయని పథకానికి తాత్కాలికంగా బ్రేక్ వేశారా? లేక నిధుల కొరతతో నిలిపివేశారా? అనే అంశాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టతరాలేదు. రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. పలు సందర్భాల్లో రెండో విడత గొర్రెల పంపిణీని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఇటీవల జనగామ జిల్లా కొడకండ్ల సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. గొర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. గొర్రెలు పంపిణీ చేయాలని గొల్ల, కురుమలు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు.
కానీ ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. పథకానికి ఎంపికైన లబ్ధిదారులు యూనిట్ విలువలో 25ు మేరకు 28 వేల మంది లబ్ధిదారులు ఇప్పటికే డీడీలు తీశారు. రూ. 87.50 కోట్లు బ్యాంకుల ద్వారా రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఖాతాలోకి వెళ్లాయి. గొర్రెల పంపిణీ పథకం కోసం ఎన్‌సీడీసీ నుంచి తీసుకున్న రుణంలో రూ. 650 కోట్లు ప్రభుత్వం వద్ద మిగిలి ఉన్నాయని, ఆ నిఽధులతోనైనా డీడీలు తీసిన లబ్ధిదారులకు గొర్రెలు కొని పంపిణీ చేయాలని రెండేళ్లుగా బాధితులు డిమాండ్ చేస్తున్నారు.