కాషాయం జెండానే మన ఆలోచన

ABN , First Publish Date - 2020-12-20T07:52:41+05:30 IST

ఇతర పార్టీల నుంచి వచ్చినవారు, బీజేపీలోనే మొదటి నుంచి ఉన్నవారూ.. జీవితం చివరి అంకం వరకూ కాషాయ జెండానే మన

కాషాయం జెండానే మన ఆలోచన

సమష్టిగా పనిచేస్తేనే ఫలితం: తరుణ్‌ఛుగ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఇతర పార్టీల నుంచి వచ్చినవారు, బీజేపీలోనే మొదటి నుంచి ఉన్నవారూ.. జీవితం చివరి  అంకం వరకూ కాషాయ జెండానే మన ఆలోచనగా ఉండాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌.. పార్టీ ముఖ్యనేతల నుద్దేశించి వ్యాఖ్యానించారు. నాయకులంతా సమష్టిగా పనిచేస్తే ఫలితం కూడా అలాగే వస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణపై పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యమని  చెప్పారు. శనివారం పార్టీ సీనియర్‌ నేతలతో ఆయన సమావేశమయ్యారు.


పార్టీ బలోపేతంపై సలహాలు, సూచనలు తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ పట్ల పెరిగిన వ్యతిరేకత, బీజేపీ పట్ల పెరిగిన సానుకూలతను అతివిశ్వాసంగా భావించవద్దని కొందరు నేతలు సూచించారు. తాము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు అనుగుణంగా స్వేచ్ఛ ఇవ్వాలని ఒకరిద్దరు నేతలు తరుణ్‌ఛుగ్‌ను కోరినట్లు సమాచారం.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు సీనియర్‌ నేతలు ఇంద్రసేనారెడ్డి, మురళీధర్‌రావు, విజయశాంతి, అరవింద్‌, గరికపాటి మోహన్‌రావు, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు, వివేక్‌, మోత్కుపల్లి నర్సింలు, యెండల లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-20T07:52:41+05:30 IST