కాళేశ్వరం వెనక కన్నీరు!

ABN , First Publish Date - 2020-02-16T09:32:20+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టుకు అతి కీలకమైనది లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ. ఇప్పుడు ఇది పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం

కాళేశ్వరం వెనక కన్నీరు!

తెలంగాణలో 800, మహారాష్ట్రలో 200 ఎకరాల మునక

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వస్తున్న గోదావరి నీటితో రాష్ట్రంలో వేల ఎకరాలు 

సస్యశ్యామలమవుతున్నాయి! ప్రాజెక్టు పూర్తయితే.. లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది! ప్రాజెక్టు నుంచి వందల కిలోమీటర్ల దూరంలోని సూర్యాపేట జిల్లాలోనూ రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కానీ, తెలంగాణ వరప్రదాయిని కొందరికి భారీ నష్టం మిగుల్చుతోంది. ప్రాజెక్టు వెనక ఉన్న రైతుల్లో కన్నీరు నింపుతోంది. 

చేతికొచ్చిన కోట్లాది రూపాయల పంట నీటిపాలైంది! ఇందుకు కారణం.. బ్యాక్‌ వాటర్‌ ముంపుపై అధికారులకు అవగాహన, ముందు చూపు కొరవడడమే!


మేడిగడ్డలో 16.02 టీఎంసీల నీటి నిల్వ, బ్యాక్‌ వాటర్‌తో 1,000 ఎకరాల మునక

  • చేతికొచ్చిన మిర్చి పంట నీటి పాలు రైతులకు రూ.45 కోట్ల వరకూ భారీ నష్టం ముంపు ప్రాంతాలపై అధికారుల సర్వే
  • భూ సేకరణ, పంట నష్టంపై స్పష్టత కరువు
  • ఆందోళనలో కాళేశ్వరం పరిసర రైతులు
  • ఎకరానికి 3 లక్షల పరిహారానికి డిమాండ్‌
  • 11 మోటార్లతో ఎత్తిపోతలు

    రోజుకు 2 టీఎంసీల చొప్పున

    8 రోజుల్లో మేడిగడ్డ ఖాళీ

భూపాలపల్లి(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుకు అతి కీలకమైనది లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ. ఇప్పుడు ఇది పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా.. శనివారం సాయంత్రానికి 16.02 టీఎంసీల నీరు చేరింది. బ్యారేజీలో 100 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసే అవకాశం ఉండగా, 99.95 మీటర్లుగా నీటి లెవల్‌ నమోదైంది. బ్యారేజీని ప్రారంభించిన తర్వాత ఈ స్థాయిలో నీటిని నిల్వ చేయడం ఇదే 


మొదటిసారి! దీపం వెనక చీకటి ఉంటుందన్నట్లు.. ఈ పరిణామంతో బ్యాక్‌ వాటర్‌ భారీగా పెరిగిపోతోంది. తెలంగాణ వైపు ఉన్న మహదేవపూర్‌ మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన 800 ఎకరాలకుపైగా నీట మునిగాయి. మహారాష్ట్ర వైపు మరో 200 ఎకరాలకుపైగా ముంపునకు గురయ్యాయి. శనివారం వరకూ అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం మహదేవపూర్‌ శివారులోని 184 ఎకరాలు, ఎడపల్లి శివారులోని 59 ఎకరాలు, కుదురుపల్లి శివారులోని 66 ఎకరాలు, బెగ్లూర్‌  శివారులోని 42 ఎకరాలు, సూరారం శివారులోని 36ఎకరాలు, బొమ్మాపూర్‌ శివారులోని 106 ఎకరాలు, బ్రాహ్మణపల్లి శివారులోని 104 ఎకరాలు.. మొత్తం 597 ఎకరాలు నీట మునిగాయి. అధికారుల సర్వే ఇంకా కొనసాగుతోంది. బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌ కారణంగా మరో 200 ఎకరాల పంట మునిగే అవకాశం ఉంది. ఇక, మహారాష్ట్ర వైపు ఇప్పటివరకు 160 ఎకరాల వరకు పంట నీట మునిగింది. మరో 50 ఎకరాలకుపైగా మునిగే అవకాశం ఉంది.

లక్షల్లో పెట్టుబడి.. కన్నీరే దిగుబడి

మేడిగడ్డ బ్యారేజీ సమీపంలో రైతులు ఎక్కువగా మిర్చి పంటను సాగు చేస్తారు. ఇప్పటి వరకు ఒక్కొక్క రైతు ఎకరాకు లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాడు. పంట చేతికంది వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా మిర్చికి రూ.14-15 వేల  ధర పలుకుతోంది. ఎకరాకు 30 క్వింటాళ్ల చొప్పున లెక్కేసినా వెయ్యి ఎకరాలకు 30,000 క్వింటాళ్ల మిర్చి రైతులకు చేరేది. తద్వారా, రూ.45 కోట్ల ఆదాయం రైతులకు సమకూరేది. లక్షల్లో పెట్టుబడి పెట్టిన పంట నీట మునిగి ఇప్పుడు కన్నీరే మిగిలిందని ఆవేదన చెందుతున్నారు.

ముందు చూపు లేని అధికారులు

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని. కానీ, అధికారులకు ముందు చూపు లేకపోవడంతో కొంతమందికి నష్టదాయకంగా మారింది. ముంపు ప్రాంతాన్ని అంచనా వేస్తూ ఇప్పుడు హద్దులు పాతుతున్నారు. అధికారుల అంచనా ప్రకారం.. 1000 నుంచి 1200 ఎకరాల వరకు కాళేశ్వరం ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో నీట మునిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, మేడిగడ్డ బ్యారేజీ ఫుల్‌ రిజర్వాయర్‌ లెవల్‌కు నీరు చేరితే బ్యాక్‌ వాటర్‌ ఎక్కడి వరకూ వెళుతుందో అధికారులు ముందే ఎందుకు అంచనా వేయలేకపోయారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు హడావిడిగా ముంపు ప్రాంతాలను గుర్తించేందుకు సర్వే చేపట్టడం ఏమిటని నిలదీస్తున్నారు. నీటి నిల్వ ఇలాగే కొనసాగితే ఏటా తమ పంటలు నీట మునగడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మాకు న్యాయం చేయండి..!

ముంపునకు గురవుతున్న తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. నిజానికి, ఇప్పటి వరకూ బ్యారేజీ నిర్మాణం, కన్నెపల్లి పంప్‌హౌజ్‌ నిర్మాణం కోసమే అధికారులు భూసేకరణ చేశారు. అప్పట్లో ఎకరాకు రూ.10.50 లక్షలు చెల్లించారు. కానీ, మేడిగడ్డ బ్యారేజీతో ముంపునకు గురవుతున్న భూములను మాత్రం సేకరించలేదు. దాంతో, ఏటా తాము భూములతోపాటు అందులో వేసిన పంటలను కూడా కోల్పోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. భూ సేకరణలో భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి సంతోషాన్ని ఇస్తే తాము మాత్రం ఉన్న భూమి, జాగా వదులుకొని త్యాగాలు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. పంట నష్టపోయినందుకు ఎకరాకు రూ.3లక్షల పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-02-16T09:32:20+05:30 IST