అత్యంత ధనవంతుడు కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-10-03T09:12:03+05:30 IST

తెలంగాణ ఏర్పడక ముందు ఎలాంటి ఆస్తులు లేని కేసీఆర్‌.. ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలోనే అత్యధిక ధనవంతుడయ్యాడని, ఐదేళ్ల కాలంలో దేశంలోనే ముఖేష్‌ అంబానీని ఆయన మించిపోతారని కాంగ్రెస్‌ రాష్ట్ర

అత్యంత ధనవంతుడు కేసీఆర్‌

ఐదేళ్లలో అంబానీని మించిపోతారు..

కాళేశ్వరం, భగీరథ పనులతో వేల కోట్ల సంపాదన

వ్యవసాయ చట్టాలతో  రైతులకు నష్టమే

పంట ధరలను అదానీ, అంబానీలే నిర్ణయిస్తారు: మణిక్కం ఠాగూర్‌

టీఆర్‌ఎ్‌సది ముదనష్టపు పాలన: ఉత్తమ్‌ 

గాంధీ బాటకు భిన్నంగా బీజేపీ పాలన: భట్టి


సంగారెడ్డి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఏర్పడక ముందు ఎలాంటి ఆస్తులు లేని కేసీఆర్‌.. ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలోనే అత్యధిక ధనవంతుడయ్యాడని, ఐదేళ్ల కాలంలో దేశంలోనే ముఖేష్‌ అంబానీని ఆయన మించిపోతారని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌ అన్నారు.  కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ.. శుక్రవారం సంగారెడ్డి గంజ్‌ మైదాన్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్‌ బచావో దివ్‌సలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పనుల్లో ధరలు పెంచిన కేసీఆర్‌..  వేలకోట్లు సంపాదించారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా మిషన్‌-2023 ని నిర్ణయించుకున్నామని తెలిపారు. 79 ఎమ్మెల్యే సీట్లు గెలవాలని, ఇందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీ చేతుల్లో దేశాన్ని తాకట్టు పెట్టేందుకు కేంద్రం 3 రకాల రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని, వీటితో అన్నదాతలకు నష్టమేనని  మండిపడ్డారు.


ఇకనుంచి రైతు పండించిన పంటకు మద్దతు ధరను అదానీ, అంబానీలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు.  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ముదనష్టపు పాలన సాగిస్తున్నదని విమర్శించారు.  సీఎం కేసీఆర్‌కు దమ్మూ, ధైర్యం ఉంటే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, బోసురాజు, కుసుమకుమార్‌, పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


మోదీ, కేసీఆర్‌లది డబ్బా: పొన్నాల

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. రైతుల సంక్షేమం కోసం ఎంతో పాటుపడుతున్నామని గొప్పలు చెప్పుకొంటున్న ప్రధా ని మోదీ, సీఎం కేసీఆర్‌.. డబ్బాలు కొట్టుకోవడం తప్ప చేస్తున్నదేమీ లేదని పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. సిరిసిల్లలో ఆయన మాట్లాడుతూ.. రైతులను నష్టపరిచే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. గాంధీ చూపిన బాటకు భిన్నంగా కేంద్రం లో బీజేపీ పాలన సాగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టమే తప్ప ఎలాంటి మేలు జరగదని ఖమ్మంలో ఆయన అన్నారు. కొత్త చట్టాలతో రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని నల్లగొండలో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత ఉన్నట్లు సీఎం కేసీఆర్‌ నటిస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ జనగామలో విమర్శించారు. పంటలకు పూర్తి స్థాయిలో మద్దతు ధర కల్పిస్తే  వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలుపుతామని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి జగిత్యాలలో అన్నారు. కామారెడ్డిలో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, కొత్తగూడెంలో వి. హన్మంతరావు, హన్మకొండలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్‌ కృష్ణన్‌ ఆందోళనల్లో పాల్గొన్నారు. 


2023 ఎన్నికల్లో కేసీఆర్‌కు దిమ్మదిరగాలి: జగ్గారెడ్డి

రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు దిమ్మతిరగాలని సంగారెడ్డి ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి  అన్నారు. కిసాన్‌ బచావో దివస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ చెంప పగులగొట్టేలా ఫలితాలు రావాలని, ఇందుకు ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిస్తే ఆ 10 మందీ మంత్రులవుతారని అన్నారు. ఇంతలో జోక్యం చేసుకున్న పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌.. 10 మందిని గెలిపిస్తే ఐదుగురు మంత్రులవుతారని చెప్పారు. ఈ సందర్భంగా  మణిక్కం ఠాగూర్‌ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి శాలువా కప్పి, వినాయక విగ్రహాన్ని అందజేసి సన్మానించారు. 

Updated Date - 2020-10-03T09:12:03+05:30 IST