విప్లవ కవి పెద్ది కృష్ణ కన్నుమూత

ABN , First Publish Date - 2020-10-24T09:09:51+05:30 IST

విప్లవ రచయితల సంఘం (విరసం) సీనియర్‌ సభ్యుడు, ప్రజాకవి పెద్ది కృష్ణ (58) ఇకలేరు. విజయవాడ కృష్ణలంకలోని తన ఇంట్లో ఆయన తుదిశ్వాస విడిచారు.

విప్లవ కవి పెద్ది కృష్ణ కన్నుమూత

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు23 (ఆంధ్రజ్యోతి): విప్లవ రచయితల సంఘం (విరసం) సీనియర్‌ సభ్యుడు, ప్రజాకవి పెద్ది కృష్ణ (58) ఇకలేరు. విజయవాడ కృష్ణలంకలోని తన ఇంట్లో ఆయన తుదిశ్వాస విడిచారు. అవివాహితుడైన ఆయన.. ఇంట్లో ఒంటరిగా ఉండేవారు. గురువారం ఆయన ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో.. పక్కింటి వాళ్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ఆయన విగతజీవిగా కనిపించారు. ఆయన మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు.. ఆయన బుధవారమే మరణించి ఉంటారని అభిప్రాయపడ్డారు. కొంతకాలంగా ఆయన కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. విరసంతో కృష్ణ అనుబంధం దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. గతంలో ఆయన కృష్ణాజిల్లా విరసం కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1990లో టాడా యాక్టుకింద అరెస్టయి, నెలరోజులు జైలు జీవితం గడిపారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ ఆంధ్రా ప్రాంతంలో ప్రచారం చేశారు. కుటుంబ సభ్యులు, ఉద్యమ మిత్రుల సమక్షంలో కృష్ణలంకలోని స్వర్గపురి శ్మశానవాటికలో కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. 

Updated Date - 2020-10-24T09:09:51+05:30 IST