ఫలించిన బండి వ్యూహం
ABN , First Publish Date - 2020-12-05T09:41:20+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన వ్యూహంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కమలాన్ని కొత్తపుంతలు తొక్కించారు. పదునైన అస్ర్తాలను సమయానుకూలంగా బయటకు తీశారు.

‘సర్జికల్’ వ్యాఖ్యలతో కారు స్పీడ్‌కి బ్రేక్.. టీఆర్ఎస్ ఎత్తులకు పైఎత్తులు
వరద బాధితులను ఆకట్టుకోవడంలో సక్సెస్
కేంద్రమిచ్చిన నిధులపైనా అధికారపార్టీకి సవాల్
పార్టీని విజయపథంలో నడిపించిన సంజయ్
హైదరాబాద్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన వ్యూహంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కమలాన్ని కొత్తపుంతలు తొక్కించారు. పదునైన అస్ర్తాలను సమయానుకూలంగా బయటకు తీశారు. వాటిని విపక్షంపై గురిపెట్టి విజయం సాధించారు. ప్రధాన ప్రత్యర్థులను బెంబేలెత్తించారు. సున్నితమైన అంశాలపై మెరుపువేగంతో స్పందించి ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేశారు. దుబ్బాక ఉప ఎన్నికతో తన సత్తా చాటుకున్న సంజయ్, గ్రేటర్ ప్రచార హోరులో ఎప్పటికప్పుడు ప్రజానాడికి అనుగుణంగా స్పందిస్తూ సంచలన నేతగా ఎదిగారు.
ఏ వ్యాఖ్యలు చేసిన పార్టీ ప్రయోజనం కోసమే
టీఆర్ఎస్ వ్యతిరేకవర్గాలకు బీజేపీయే వేదిక అన్న స్థాయికి సంజయ్ పార్టీని తీసుకెళ్లారు. ‘‘నిన్నమొన్నటి వరకు టీఆర్ఎస్ ఎజెండా నిర్దేశించేది. ఇప్పుడు సంజయ్ నిర్దేశిస్తున్నారు’’ అని బీజేపీ ముఖ్యనేతలు కొందరు విశ్లేషిస్తున్నారు.
పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్, రోహింగ్యాల తరలింపు, వరద బాధితులకు రూ.10 వేల సాయం లాంటి అంశాలతో టీఆర్‌ఎ్‌సకు ఊహించనిరీతిలో దెబ్బకొట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన రెండు రోజులకే ఈ సాయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. సంజయ్ లేఖ రాయడంతోనే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని టీఆర్ఎస్ ఆరోపించింది. వరద సాయం అడ్డుకోలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేయడంతోపాటు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని ముఖ్యమంత్రికి సవాల్ చేయడం సంచలనం సృష్టించింది.
మజ్లి్‌సతో పొత్తుపై...
కేసీఆర్, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీల మైత్రిని పదేపదే ప్రస్తావించి, తమకు ఎంఐఎంతో పొత్తులేదంటూ మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనను సంజయ్ ఎండగట్టడంలో సఫలమయ్యారని పేర్కొన్నారు. ఆక్రమణల అంశంపై మాట్లాడిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఎన్టీఆర్, పీవీ ఘాట్లను కూల్చివేయాలంటూ చేసిన వ్యాఖ్యపైనా సంజయ్ మెరుపు వేగంతో స్పందించారు. రెండుగంటల్లో దారుస్సలాంను కూల్చివేస్తామని చేసిన హెచ్చరిక పెను సంచలనానికి దారితీసింది.
రోహింగ్యాలే మిగతాపార్టీలకు ప్రచారాస్త్రం!
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో సంజయ్ చేసిన పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. మేయర్ పీఠం దక్కించుకున్న 24 గంటల్లో రోహింగ్యాలను తరిమివేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్య కేంద్రంగా మిగతాపార్టీలు ప్రచారం కొనసాగడం గమనార్హమని బీజేపీ నేత ఒకరు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులు, టీఆర్ఎస్ వెచ్చించిన రూ. 67వేల కోట్లపై సంజయ్ అధికార పార్టీకి విసిరిన సవాల్ కూడా ఓటరును బీజేపీకి మరింత చేరువచేసిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతుందన్న విపక్షాల వ్యాఖ్యలను కూడా సంజయ్ సమర్థంగా తిప్పికొట్టారు. భైంసాలో, కరీంనగర్లో మత విద్వేషాల కారణంగా కర్ఫ్యూ విధించలేదా? అంటూ టీఆర్‌ఎ్‌సను నిలదీయడమేకాదు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ మతవిద్వేషాలు జరిగాయో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. ఇలాంటివి బీజేపీ పట్ల యువత ఆకర్షితులవ్వడానికి కారణయ్యాయని చెబుతున్నారు.
స్టార్ క్యాంపెయినర్లు సక్సెస్!
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 4 (ఆంధ్ర జ్యోతి): టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా.. అన్నట్టు పోటీ పడిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లు సత్తా చాటారు. మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ తరఫున అన్నీ తానే అయి ప్రచారం నిర్వహించగా.. బీజేపీ మాత్రం అతిరథ మహారథులైన పలువురు రంగంలోకి దింపి అందుకు తగినట్టుగా లబ్ధి పొందింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. గ్రేటర్ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల ప్రభావం స్పష్టంగా కనపడిందంటే అతిశయోక్తి కాదు.
ఆ పార్టీ తరఫున.. రాష్ట్రానికి చెందిన నేతలైన కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, డీకే అరుణతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రకాశ్ జావడేకర్, స్మృతి ఇరాని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ప్రచారంలో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
వారు నిర్వహించిన రోడ్‌షోలు ప్రజలను ఆకర్షించాయి. దీంతో.. 2016 గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 4 సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ.. ఈసారి తన బలాన్ని 48కి పెంచుకుంది. కేంద్రమంత్రుల రాక, రోడ్‌షోలతో గ్రేటర్ ప్రజల దృష్టిని ఆకర్షించడంలో బీజేపీ విజయం సాధించింది.
