వ్యతిరేక వార్తలొస్తే భౌతిక దాడులే!
ABN , First Publish Date - 2020-12-11T08:26:00+05:30 IST
జర్నలిస్టులకు టీఆర్‌ఎస్ నేతల బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇటీవల ఓ
విలేకరికి దుబ్బాక టీఆర్‌ఎస్ అధ్యక్షుడి బెదిరింపులు
దుబ్బాక, డిసెంబరు 10: జర్నలిస్టులకు టీఆర్‌ఎస్ నేతల బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇటీవల ఓ విలేకరిపై అనుచితంగా మాట్లాడిన ఘటన మరువక ముందే మరో టీఆర్‌ఎస్ నేత ఓ విలేకరిని బెదిరించారు. ‘‘మా ప్రభుత్వం ఇంకా మూడేళ్లు ఉంటది. మా ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలొస్తే భౌతిక దాడులు తప్పవు. మా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే చంపేస్తాం’’ అని సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మునిసిపల్ కో-ఆప్షన్ సభ్యుడు ఆస స్వామి ఓ స్థానిక విలేకరిని ఫోన్‌లో బెదిరించారు.
‘‘మంత్రి మావోడే ఉన్నాడు. మేము కన్నెర్ర చేస్తే మీరెక్కడుంటారు’’ అని విరుచుకుపడ్డారు. ఆ ఆడియో రికార్డులను ఓ వాట్సాప్ గ్రూపులో బాధితుడు షేర్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు నాయకుడు వెంటనే విలేకరికి ఫోన్ చేశారు.
‘‘మేం కన్నెర్ర చేస్తే మీరేక్కడుంటారో ఆలోచించుకోవాలి. పటాన్‌చెరు ఎమ్మెల్యే వ్యాఖ్యలను రికార్డు చేసినట్లుగానే నాది కూడా రికార్డు చేసుకోండి. వ్యతిరేక వార్తలు రాస్తే గు.. పగులకొడతాం’’ అని స్వామి హెచ్చరించారు. దీనిపై జిల్లా జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా స్పందించాయి. డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాయి.