‘దిశ ఎన్‌కౌంటర్’ సినిమా నిలిపివేయాలి
ABN , First Publish Date - 2020-11-03T08:16:46+05:30 IST
దిశ కేసులో ఎన్‌కౌంటర్ ఆధారంగా నిర్మిస్తున్న ‘దిశ ఎన్‌కౌంటర్’ సినిమాను నిలిపివేయాలని ఆ కేసులో నిందితుల
వర్మ కార్యాలయం వద్ద నిందితుల కుటుంబ సభ్యుల ఆందోళన
బంజారాహిల్స్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): దిశ కేసులో ఎన్‌కౌంటర్ ఆధారంగా నిర్మిస్తున్న ‘దిశ ఎన్‌కౌంటర్’ సినిమాను నిలిపివేయాలని ఆ కేసులో నిందితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని దర్శకుడు రాంగోపాల్‌వర్మ కార్యాలయం వద్ద వారు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ కేసులో జోళ్లు శివ, జోళ్లు నవీన్, చెన్న కేశవులు, హైమద్ అరీఫ్ నిందితులన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నిలిపివేయాలని జ్యుడిషియల్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు నిందితుడు చెన్నకేశవులు భార్య చెప్పారు.
ఎన్‌కౌంటర్ అయ్యాక తమ కుటుంబాలు కోలుకోలేక పోతున్నాయన్నారు. ఈ క్రమంలో సినిమా ద్వారా మరోసారి తమ వారిని విలన్‌ల మాదిరి చూపించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఈ చిత్రం విడుదల చేస్తే తమ కుటుంబాలు కోర్టు సాక్షిగా ఆత్మహత్య చేసుకుంటాయని హెచ్చరించారు. రాంగోపాల్‌వర్మ వచ్చి తమ కుటుంబం నేపథ్యం అడిగినప్పుడు సినిమా గురించి చెప్పలేదన్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని ఆపాలని దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.