కన్న పేగు కిరాతకం !
ABN , First Publish Date - 2020-06-16T10:14:08+05:30 IST
కుటుంబ కలహాలతో ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. తన ఇద్దరు పిల్లలకు నిద్రమాత్రలిచ్చి.. చెరువులోకి తోసేసింది.

- పిల్లల్ని చెరువులోకి తోసేసిన తల్లి.. కుమారుడు, కుమార్తె మృతి
- తానూ దూకి ప్రాణభయంతో బయటికొచ్చిన తల్లి
సూర్యాపేట క్రైం, జూన్ 15 : కుటుంబ కలహాలతో ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. తన ఇద్దరు పిల్లలకు నిద్రమాత్రలిచ్చి.. చెరువులోకి తోసేసింది. ఆపై తానూ దూకి ప్రాణభయంతో బయటికి వచ్చి.. పిల్లల్ని రక్షించే యత్నం చేయగా అప్పటికే వారు విగతజీవులయ్యారు. ఈ విషాదకర ఘటన సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్‌లో సోమవారం జరిగింది. పెన్‌పహాడ్ మండలం సింగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన నాగమణికి హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌తో 2006లో ప్రేమ వివాహం జరిగింది. అప్పటి నుంచి విద్యానగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరికి కుమార్తె జ్యోతిమాధవి(10), కుమారుడు హర్షవర్ధన్(8) ఉన్నారు. ప్రశాంత్ కుమార్ పాత ఇనుప దుకాణంలో పని చేస్తున్నాడు. కొన్నాళ్లుగా భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో ప్రశాంత్ తరుచూ మద్యం మత్తులో గొడవ పడుతున్నాడు.
ఆదివారం రాత్రి కూడా ఇద్దరూ ఘర్షణ పడ్డారు. మనస్తాపం చెందిన నాగమణి పిల్లలిద్దరితో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. నిద్ర మాత్రలను తనతో పాటు కుమార్తె, కుమారుడికి వేసింది. అర్ధరాత్రి తర్వాత పిల్లలను సద్దుల చెర్వు వద్దకు తీసుకెళ్లి నీటిలోకి తోసేసింది. అనంతరం తానూ దూకింది. ఆ తర్వాత ప్రాణభయంతో ఆమె చెరువులో నుంచి బయటకు వచ్చింది. నీటిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కుమారుడిని రక్షించే యత్నం చేసినా అప్పటికే మృతి చెందాడు. కుమార్తె నీటిలో మునిగిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గజ ఈతగాళ్ల సాయంతో జ్యోతిమాధవి మృతదేహాన్ని వెలికి తీయించారు. పోలీసులు నాగమణి, ప్రశాంత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, సాయంత్రం పిల్లల మృతదేహాలను చూసేందుకు వచ్చిన నాగమణిపై బంధువులు దాడి చేశారు.