సచివాలయంలో మసీదు, మందిరం గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలోనే!

ABN , First Publish Date - 2020-09-06T08:59:06+05:30 IST

సచివాలయంలో మసీదు, మందిరం గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలోనే!

సచివాలయంలో మసీదు, మందిరం  గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలోనే!

చర్చి కూడా నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్‌

అన్ని వర్గాలను సంతృప్తిపరచడమే లక్ష్యం

సీఎం నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ


హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): నూతన సచివాలయ సముదాయంలో మసీదు, మందిరం, చర్చిని ప్రభుత్వ ఖర్చులతోనే నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడానికి కారణం జీహెచ్‌ఎంసీ ఎన్నికలేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం ముస్లిం మతపెద్దలతో సమావేశమైన సీఎం.. ప్రార్థనా మందిరాల నిర్మాణంతోపాటు పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ముస్లింలు ఎక్కువగా ఉండటం, పాతబస్తీలో విస్తృత ప్రాబల్యం ఉన్న ఎంఐఎం తమకు మిత్రపక్షంగా వ్యవహరిస్తుండటం వల్లే ఆయన ఈ నిర్ణయాలు తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. పాత సచివాలయ భవనాలను కూల్చివేస్తున్న సందర్భంగా అక్కడున్న ప్రార్థనా మందిరాలకు నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్‌ తక్షణమే స్పందించి, వాటిని ప్రభుత్వమే నిర్మిస్తుందని ప్రకటించారు. దీంతో వివాదం సద్దుమణుగుతుందని సీఎంతోపాటు టీఆర్‌ఎస్‌ వర్గాలు భావించాయి. కానీ, పలు మతాల సంస్థలు, సంఘాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయ పార్టీలు కూడా విమర్శల దాడి చేశాయి. బీజేపీ, కాంగ్రెస్‌ ఆందోళనలు కూడా నిర్వహించాయి. అయితే ప్రభుత్వం వ్యూహాత్మకంగా మౌనం పాటించింది. కానీ, సోషల్‌ మీడియాలో పార్టీలు, సంఘాలు దీనిపై విస్తృతంగా ప్రచారం చేశాయి. శనివారం కూడా మందిరం విషయంలో సీఎం కేసీఆర్‌కు విశ్వహిందూ పరిషత్‌ లేఖ రాసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సీఎం కేసీఆర్‌ భావించారని, అందుకే నష్టనివారణ కోసం మందిరం, మసీదు నిర్మాణంపై కీలక నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీటితోపాటు చర్చిని కూడా నిర్మిస్తామని ప్రకటించడం ద్వారా అన్ని మతాల వారిని సీఎం సంతృప్తి పరిచారని అంటున్నారు. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీకి అన్ని వర్గాల మద్దతు లభించేందుకు ఇది దోహదపడుతుందని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. 

Updated Date - 2020-09-06T08:59:06+05:30 IST