ఇక మార్కెట్ కమిటీలే దిక్కు
ABN , First Publish Date - 2020-12-28T07:39:51+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలను టీఆర్‌ఎస్ సర్కారు తీవ్రంగా వ్యతిరేకించింది. పార్లమెంటులో బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేసింది. రైతుల ప్రయోజనాలకు వ్యవసాయ చట్టాలు తీవ్ర విఘాతం కలిగిస్తాయని తరచూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చింది

డ్వాక్రా, పౌర సరఫరాలు, సొసైటీల కొనుగోళ్లుండవ్
ఏఎంసీల్లో ట్రేడర్లదే ఇష్టారాజ్యం
ఒక శాతం సెస్‌తో.. సర్కారు
ఆదాయానికి ఢోకా లేనట్లే
హైదరాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలను టీఆర్‌ఎస్ సర్కారు తీవ్రంగా వ్యతిరేకించింది. పార్లమెంటులో బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేసింది. రైతుల ప్రయోజనాలకు వ్యవసాయ చట్టాలు తీవ్ర విఘాతం కలిగిస్తాయని తరచూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చింది. ఇటీవల కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన భారత్ బంద్ కార్యక్రమంలోనూ మంత్రి కేటీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి ఆందోళనలు నిర్వహించారు కూడా. సాగు చట్టాలను ఇంతలా వ్యతిరేకించిన కేసీఆర్ సర్కారు, మరి.. తన వైఖరిని మార్చుకుందా? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయచట్టాలను అమలుచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోందా? పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి!! తాము ఉత్పత్తి చేసిన పంటలను రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని.. పంటల కొనుగోలు, అమ్మకాలు సర్కారు బాధ్యత కాదంటూ ప్రగతిభవన్ సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించడమే దీనికి బలాన్నిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా పంట ఉత్పత్తుల కోసం ఇక నుంచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండవని ఆయన స్పష్టం చేయడం ద్వారా ధాన్యం, ఇతర ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ నుంచి సర్కారు వైదొలిగినట్లు స్పష్టమైంది. పౌరసరఫరాల సంస్థ, మార్క్‌ఫెడ్, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా ఏర్పాటుచేస్తున్న కొనుగోలు కేంద్రాలు ఇకనుంచి గ్రామాల్లో కనిపించవు. ఈ పరిస్థితుల్లో అన్నదాతలకు వ్యవసాయ మార్కెట్ కమిటీలే పెద్ద దిక్కుగా మారనున్నాయి. అక్కడ లైసెన్సు ఉన్న వ్యాపారులే తప్ప.. ప్రభుత్వం కొనుగోలుచేసే పరిస్థితి ఉండదు.
రైతు సంఘాల్లో ఆందోళన!
ఉమ్మడి రాష్ట్రంలో కూడా ధాన్యం కొనుగోలు జరిగేది. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరకు పౌరసరఫరాల సంస్థ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎ్‌సలు), స్వయం సహాయక సంఘాలను నోడల్ ఏజెన్సీలుగా నియమించి ధాన్యాన్ని సేకరించేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కొనుగోలు విధానంపై మరింత శ్రద్ధ పెట్టారు. కరోనా సమయంలో కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కొనుగోలు కేంద్రాల సంఖ్యను 6వేల పైచిలుకు పెంచి గ్రామగ్రామనా ధాన్యం సేకరించారు. రైతుల ముంగిట్లో కొనుగోలు కేంద్రాలు ఉండటంతో వారికి పంట అమ్ముకునేందుకు సౌకర్యవంతంగా ఉండేది. రైస్‌మిల్లర్లు, దళారులను నియంత్రించటానికి, మార్కెటింగ్ బ్యాలెన్స్ కోసం ఇవి దోహదపడేవి. మరోవైపు ఆరుతడి పంటలైన కందులు, మొక్కజొన్న, శనగలు, పొద్దుతిరుగుడు, సోయాబీన్, జొన్నలు, ఎర్రజ్నొలు, పెసర్లు, మినుములు... తదితర పంట ఉత్పత్తులను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేవారు.
రైతులకు ఎమ్మెస్పీ చెల్లించటం, రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేయటంతోపాటు కొనుగోలు ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అయితే కొనుగోలు కేంద్రాలు ఇక నుంచి ఉండవంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన.. రైతులు, రైతుసంఘాల్లో చర్చనీయాంశంగా మారింది. పంట ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలిగితే రైతులు పరిస్థిత ఏమిటనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 189 వ్యవసాయ మార్కెట్ కమిటీలు, 94 సబ్ మార్కెట్ యార్డులు ఉన్నాయి. గతంలో మాదిరిగానే వీటిలో పంట ఉత్పత్తుల కొనుగోలు జరుగుతుంది. మార్కెట్ ప్రాంగణంలో జరిగే క్రయవిక్రయాలపై ఒక శాతం సెస్‌ను వసూలు చేస్తారు. ఉదాహరణకు రూ.1లక్ష విలువైన పంట ఉత్పత్తులను కొంటే, సెస్ రూపంలో రూ.1000 మార్కెటింగ్ శాఖకు వెళుతుంది.
ట్రేడర్ల చేతుల్లో రైతుల భవితవ్యం
పంట ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ నుంచి ప్రభుత్వం వైదొలిగితే... రైతుల భవితవ్యం అంతా ట్రేడర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఎమ్మెస్పీకి చట్టబద్ధత లేకపోవటంతో... వ్యాపారులు చెప్పిన ధరకే ఉత్పత్తులు అమ్మాల్సి వస్తుందనే ఆందోళన రైతుల్లో నెలకొంది. ఎమ్మెస్పీ కంటే ఎక్కువ ధర వస్తే పరవాలేదు... తక్కువ ఇస్తే ఏమిటనే ప్రశ్నకు రైతులకు సమాధానం దొరకటంలేదు.
ఎక్కడైనా అమ్ముకోవచ్చు
కొత్త వ్యవసాయచట్టం నిబంధనల ప్రకారం... వ్యవసాయ మార్కెట్ కమిటీలతో సంబంధంలేకుండా వ్యాపారులు పంట ఉత్పత్తుల కొనుగోళ్లు చేయవచ్చు. రైతులు కూడా ఎక్కడైనా ఉత్పత్తులు అమ్ముకోవచ్చు. ఇప్పటి వరకు వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో (ఏఎంసీ) అయినా, మార్కెట్ బయట లావాదేవీలు జరిగినా ‘మార్కెట్ సెస్’ కింద 1ు ఫీజు వసూలుచేసేవారు. మార్కెటింగ్ శాఖ నుంచి లైసెన్సులు పొందిన ట్రేడర్లు మాత్రమే పంట ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాలనే నిబంధన ఉండేది.
దళారుల సమస్యలు ఉన్నప్పటికీ.. లైసెన్సింగ్ విధానం, ప్రత్యేక మార్గదర్శకాలు ఉండటంతో.. ట్రేడర్ల వ్యవస్థ పూర్తిగా మార్కెటింగ్ శాఖ నియంత్రణలో ఉండేది. కేంద్రం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం.. ఏఎంసీల వెలుపల జరిగే అమ్మకాలు, కొనుగోలుపై మార్కెటింగ్ శాఖకు నియంత్రణ ఉండదు. కొత్త చట్టంలో ‘సెస్’ వసూలు విధానం లేదు. దీంతో ఏఎంసీల ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను యథాతథంగా నిర్వహించాలని, గతంలో మాదిరిగానే సెస్ వసూలు చేయాలని నిర్ణయించింది. అయితే మార్కెట్ల బయట జరిగే క్రయవిక్రయాలను ప్రభుత్వం పట్టించుకోదు.