ఎల్‌ఆర్‌ఎస్ జీవోను ఎత్తివేయాలి
ABN , First Publish Date - 2020-09-14T09:15:24+05:30 IST
లే అవుట్ క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన 131 జీవోను రద్దు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. వీలు కాని పక్షంలో క్రమబద్ధీకరణ రుసుమును 50
- లేకపోతే రుసుమును సగానికి తగ్గించాలి
- సమయాన్ని ఏడాదికి పొడిగించాలి
- మంత్రి కేటీఆర్‌కు జగ్గారెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): లే అవుట్ క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన 131 జీవోను రద్దు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. వీలు కాని పక్షంలో క్రమబద్ధీకరణ రుసుమును 50 శాతం తగ్గించాలన్నారు. అలాగే క్రమబద్ధీకరణకు రుసుము చెల్లించే గడువును ఒక సంవత్సరానికి పొడిగించాలని కోరారు. ఎల్‌ఆర్‌ఎ్‌సపై ప్రస్తుతం ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇదేనని, దాన్ని మునిసిపల్ శాఖ మత్రి కేటీఆర్‌కు తెలియజేస్తున్నానని జగ్గారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 131 జీవో ప్రకారం 100-200 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి రూ.40-50 వేల వరకూ కట్టాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం త్వరితగతిన లే అవుట్లను మంజూరు చేయకపోవడం వల్లే అక్రమ లే అవుట్లు ఎక్కువయ్యాయని ఆరోపించారు.
ప్రస్తుతం ఎవరి దగ్గరా డబ్బులు లేవన్నారు. వీలైతే 131 జీవోను ఎత్తివేసి.. ఇప్పటిదాకా ఉన్న ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని సూచించారు. అది వీలు కాని పరిస్థితుల్లో క్రమబద్ధీకరణ రుసుమును 50 శాతం మేరకు తగ్గించాలన్నారు. ఉదాహరణకు ఓ మధ్యతరగతి వ్యక్తి ప్లాటు క్రమబద్ధీకరణకు రూ.40 వేలు కట్టాల్సి ఉంటే.. రూ.20 వేలు కట్టి క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. ప్రస్తుతం రూ.1000 చెల్లించి రిజిస్ట్రేషన్ పెట్టుకున్నా.. జనవరి కల్లా క్రమబద్ధీకరణ రుసుమును కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారని, ఈ నేపథ్యంలో ఏడాది సమయం ఇవ్వాలని కోరారు. ప్రజల ఆలోచననే తాను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొస్తున్నానన్నారు. దీనిపై శాసనసభలో ప్రశ్న అడుగుతానని చెప్పారు.