ఆ భూమి విలువ రూ.3 కోట్లపైనే!

ABN , First Publish Date - 2020-12-26T08:12:49+05:30 IST

తీవ్ర వివాదానికి కారణమై.. అధికారులపై దాడుల దాకా వెళ్లిన మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌లోని సర్వే నంబర్‌ 432లో ఉన్న 1,500 గజాల భూమి విలువ రూ.3 కోట్లపైనే ఉంది. ప్రధాన రోడ్డుకు ఆనుకుని

ఆ భూమి విలువ రూ.3 కోట్లపైనే!

జవహర్‌నగర్‌ భూ ఆక్రమణ కేసు

గతంలోనే నిర్మాణాలు.. కూల్చివేత

సీఐకి 45 శాతం కాలిన గాయాలు

కార్పొరేట్‌ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స


జవహర్‌నగర్‌, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): తీవ్ర వివాదానికి కారణమై.. అధికారులపై దాడుల దాకా వెళ్లిన మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌లోని సర్వే నంబర్‌ 432లో ఉన్న 1,500 గజాల భూమి విలువ రూ.3 కోట్లపైనే ఉంది. ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉండటంతో దీనిపై ఎప్పటినుంచో ఆక్రమణదారుల కన్నుంది. కేసీఆర్‌ కూరగాయల మార్కెట్‌కు ఎదురుగా ఉన్న ఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టగా కాప్రా తహసిల్దార్‌ కూల్చివేయించారు. నాటి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ఇదే స్థలాన్ని షీ టాయిలెట్‌ నిర్మాణానికి కేటాయించారు. అయితే, ప్రజాపత్రినిధులు జోక్యం చేసుకుని.. షీ టాయిలెట్‌లను కూరగాయల మార్కెట్‌లో నిర్మింపజేశారు. అనంతరం మున్సిపల్‌ అధికారులు మినీ డంపింగ్‌ యార్డ్‌గా ఉపయోగించుకున్నారు.


అక్రమార్కులు తిరిగి నిర్మాణాలు ప్రారంభించగా వాటిని కూల్చివేసేందుకు వెళ్లిన క్రమంలో గురువారం జవహర్‌నగర్‌ సీఐ భిక్షపతిరావుపై పెట్రోల్‌ చల్లి నిప్పంటించిన సంగతి తెలిసిందే. ఆయనకు 45 శాతం శరీరం కాలింది. ప్రైవేటు అస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐను పరామర్శించిన రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ మెరుగైన చికిత్సకు సికింద్రాబాద్‌ అపోలోకు తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఉద్రిక్తతలకు కారణమైన పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తును ఉప్పల్‌ సీఐ రంగస్వామికి అప్పగించారు.

Updated Date - 2020-12-26T08:12:49+05:30 IST