21 ఏళ్లుగా ఏం చేస్తున్నారు?
ABN , First Publish Date - 2020-07-27T08:33:35+05:30 IST
కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ విజయ్‌బాబు కుటుంబానికి పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మానవ హక్కుల

- ఆ అమరుడి కుటుంబానికి పరిహారం ఇవ్వండి: హెచ్‌ఆర్సీ
- జీఏడీ ముఖ్య కార్యదర్శికి, సంగారెడ్డి కలెక్టర్‌కు నోటీసులు
- ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని సుమోటోగా స్వీకరణ
హైదరాబాద్, జూలై 26(ఆంధ్రజ్యోతి): కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ విజయ్‌బాబు కుటుంబానికి పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్సీ) ఆదేశించింది. 21 ఏళ్లుగా అమరుడి కుటుంబానికి పరిహారం ఇవ్వకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ ఘటనపై సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు సంగారెడ్డి కలెక్టర్‌కు హెచ్‌ఆర్సీ ఆదివారం నోటీసులు జారీ చేసింది. విజయ్‌బాబు కుటుంబానికి పరిహారం ఎందుకివ్వలేదో ఆగస్టు 27లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ‘‘అమరుడి కుటుంబానికేదీ సాయం? కార్గిల్‌లో తెలంగాణ బిడ్డ వీరమరణం’’ శీర్షికన ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాన్ని హెచ్‌ఆర్సీ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది.
కార్గిల్ యుద్ధంలో ప్రత్యర్థి సేనలను తుదముట్టించి చివరి క్షణంలో వీరమరణం పొందిన విజయ్‌బాబు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం ఇస్తామని నాటి ప్రభుత్వం ప్రకటించిందని కథనం ప్రస్తావించింది. 21 ఏళ్లయినా ఆ వాగ్దానం నెరవేర్చలేదని పేర్కొంది. పరిహారం కోసం తాము తిరగని కార్యాలయం, సంప్రదించని అధికారి లేరంటూ విజయ్‌బాబు తల్లి అనసూయమ్మ ఆవేదన వ్యక్తం చేశారని వివరించింది. ఇటీవల చైనా సైన్యంతో ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతో్‌షబాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని, అలాగే తమ కుటుంబానికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆమె విన్నవించినట్లు పేర్కొన్నది.