ఇంట్లోనే ఇండియా!
ABN , First Publish Date - 2020-03-23T09:52:53+05:30 IST
కరోనాను ఖతం చేసేందుకు దేశ ప్రజలు నడుంబిగించారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును గౌరవిస్తూ ఆదివారం రోజంతా ఇళ్లకు పరిమితమయ్యారు.

జనతా కర్ఫ్యూ విజయవంతం
హైదరాబాద్/న్యూఢిల్లీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కరోనాను ఖతం చేసేందుకు దేశ ప్రజలు నడుంబిగించారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును గౌరవిస్తూ ఆదివారం రోజంతా ఇళ్లకు పరిమితమయ్యారు. సరిగ్గా సాయంత్రం గడియారం 5గంటలు కొట్టగానే కరోనా రక్కసి గుండెల్లో వణుకు పుట్టేలా చప్పట్లు కొట్టారు. ఆదివారం ఇండియా ఇంటికే పరిమితమైంది. తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా 14గంటల ‘జనతా కర్ఫ్యూ’ విజయవంతమైంది. పట్టణాల నుంచి గ్రామాల దాకా ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొన్నారు. వ్యాపార సముదాయాలు, దుకాణాలు, హోటళ్లు.. ఏవీ తెరుచుకోలేదు. చివరికి తోపుడుబండ్లూ కనిపించలేదు. ఆటోలు, క్యాబ్‌లు, బస్సులు, రైళ్లు, మెట్రోరైళ్లు, అంతర్జాతీయ విమానాలు తిరగలేదు. దేశవ్యాప్తంగా బస్తీలు, కాలనీలు, వీధులు, రోడ్లు, చౌరస్తాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆస్పత్రులు, పోలీసు, ప్రింట్/ఎలకా్ట్రనిక్ మీడియా వంటి అత్యవసర విభాగాలు మాత్రం పనిచేశాయి. దేశవ్యాప్తంగా 14 గంటలపాటు జనతా కర్ఫ్యూకు ప్రధాని మోదీ పిలుపునివ్వగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిని 24 గంటలపాటు పాటించాలని కోరడం తెలిసిందే. దాంతో రాష్ట్రంలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచే బంద్ ప్రారంభమైంది. షాపులు మూత పడ్డాయి. టోల్ ప్లాజాలతోపాటు సరిహద్దులను మూసివేశారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. ఆస్పత్రులు మినహా మరే ఇతర వాటినీ తెరవలేదు. గ్రామాల్లోనూ పరిస్థితి పట్టణాల మాదిరిగానే కనిపించింది.
ఇళ్లకే పరిమితమైన ప్రజాప్రతినిధులు
రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ఇతర ప్రజా ప్రతినిధులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మంత్రి హరీశ్‌రావు తన కుటుంబ సభ్యులతో ఇంట్లోనే గడిపారు. ప్రజలంతా బంద్‌లో పాల్గొని, కరోనా వైర్‌సను తరిమి కొట్టాలని ఆయన ఒక వీడియోలో పిలుపునిచ్చారు. ఏపీ, తెలంగాణ సరిహద్దులోని పుల్లూరు టోల్ ప్లాజా నుంచి ఎవరినీ లోపలికి రానివ్వలేదు. దీంతో రెండు వైపులా ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటిలో దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల చేతులపై పోలీసులు క్వారంటైన్ ముద్రలను గుర్తించి వైద్యులకు సమాచారమిచ్చారు. కాగా వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లి గ్రామానికి చెందిన రవికుమార్.. దుబాయ్ నుంచి ఆదివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాగా కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్లారు. కానీ, ఆయనకు జ్వరం, దగ్గు రావడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
శంషాబాద్.. గప్‌చుప్
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం శంషాబాద్ విమానాశ్రయ ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సింగపూర్, షార్జా, దుబాయ్, కొలంబొ, అబుదాబి నుంచి రావాల్సిన 8 విమాన సర్వీసులు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్, సింగపూర్, కొలంబొ వెళ్లాల్సిన 10 విమాన సర్వీసులు బంద్ అయ్యాయి. డొమెస్టిక్‌లో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 160 విమాన సర్వీసులు రద్దు కాగా, వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 115 విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ఢిల్లీలో పువ్వులిచ్చి అడ్డుకున్న పోలీసులు
దేశవ్యాప్తంగా తెల్లవారుజామున 4గంటల నుంచి రాత్రి పదింటిదాకా రైళ్లు తిరగలేదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూలో భాగస్వాములయ్యారు. జన సమూహాన్ని నిరోధించేందుకు గోవా చర్చిలో ఆదివారం ఉదయం ప్రార్థనలను రద్దు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రోడ్లమీద జనం గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు. ఢిల్లీలో రోడ్ల మీద కనిపించిన వాహనదారులకు పోలీసులు పువ్వులిస్తూ ఇళ్లలోకి వెళ్లాలని సూచించారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలో సబర్బన్, మెట్రో రైళ్లను కుదించారు. గో ఎయిర్, ఇండిగో, విస్తారా వంటి ప్రైవేటు ఎయిర్‌లెన్స్ సంస్థల దేశీయ సర్వీసులు రోజంతా నిలిచిపోయాయి. తెలంగాణ మాదిరి తమిళనాడులోనూ జనతా కర్ఫ్యూను సోమవారం ఉదయం వరకు నిర్వహించారు.
పుస్తకాలు చదివారు
జనతా కర్ఫ్యూ కారణంగా ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. కాలు కదపకుండా ఇంట్లోనే ఉండటం ఒకింత బోర్ అయినా నచ్చిన వ్యాపకంతో హాయిగా గడిపారు. చాలా రోజుల తర్వాత ర్యాక్ దుమ్ము దులిపి పుస్తకాలు తీసి చదివారు. ఇంకొందరు పెరడు, లాన్లలో పచ్చని ప్రకృతిని ఆస్వాదించారు. చాలామందైతే తమవారి కోసం ఇష్టమైన వంటకాలను వండారు. ఆ అనుభవాలను చాలా మంది ట్విటర్‌లో పంచుకున్నారు. ఫొటోలను పోస్ట్ చేశారు.
సలామ్ పోలీస్
రాష్ట్రంలో ప్రజలు రోజంతా ఇళ్లకు పరిమితమైతే, పోలీసులు రోడ్ల మీదకు వచ్చారు. ఎక్కడా జనం రోడ్ల మీదకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడక్కడా బయటకు వచ్చిన ప్రజలకు సర్దిచెప్పి ఇళ్లలోకి పంపించారు. బైక్‌లు వేసుకొని రోడ్ల మీదకు వచ్చిన యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వారికి కరోనా వ్యాప్తి స్వీయ నియంత్రణకు సంబంధించిన ప్లకార్డులు ఇచ్చి కాసేపు ప్రదర్శింపజేశారు. కొన్నిచోట్ల రోడ్ల మీదకు వచ్చిన లారీలను ఆపేశారు. బిచ్చమెత్తుకొని తినే అభాగ్యులకు పలుచోట్ల ఆహారాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. తమతో పాటు అత్యవసర సేవల్లో పాల్గొంటున్న వైద్య సిబ్బంది, సేవలకు అభినందనపూర్వకంగా చప్పట్లు కొట్టారు. కాగా రాష్ట్రంలో జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛంగా పాల్గొని విజయవంతం చేశారని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
దేశ ఐక్యతను చాటిన కర్ఫ్యూ
జనతా కర్ఫ్యూ.. దేశ ఐకమత్యాన్ని చాటిందని బాంబినో చైర్మన్ కిషన్‌రావు అన్నారు. ‘‘నా82ఏళ్ల జీవితంలో ఎన్నో కర్ఫ్యూలు, బంద్‌లు చూశాను. కానీ ప్రజాబలాన్ని చాటి చెప్పిన జనతాకర్ఫ్యూ మాత్రం దేశ ఐక్యతను ప్రతిబింబించింది. ప్రధాని పిలుపు మేరకు ప్రజలు కర్ఫ్యూలో పాల్గొనడం అభినందనీయం’’అని అన్నారు.
కేసీఆర్‌కు షా అభినందన
జనతా కర్ఫ్యూను రాష్ట్రంలో అద్భుతంగా అమలు చేశారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. ఈ మేరకు కేసీఆర్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ ప్రజల స్పూర్తిని, ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణను కొనియాడారు. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో నిలిచిందన్నారు.
చప్పట్ల మోత.. చెంచాలతో ప్లేట్ల బాజా
కరోనాను ఎదుర్కోవడంలో విశేష కృషిచేస్తున్న వైద్య, పోలీసు శాఖ సిబ్బంది, సైనికులు, అధికారులు, పారిశుధ్య కార్మికులు, ప్రింట్/ఎలకా్ట్రనిక్ మీడియాకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రజలంతా సాయంత్రం ఐదుగంటలకు తమ ఇంటి ముంగిళ్లలో నిల్చుని చప్పట్లు కొట్టాలని ప్రధాని మోదీ సూచించారు. ఉదయం నుంచి ఇళ్లలో ఉన్న ప్రజలు సరిగ్గా ఆ సమయానికి వాకిళ్లు, బాల్కానీలు, లాన్లలోకి గట్టిగా చప్పట్లు, చెంచాలతో స్టీల్ ప్లేట్లను, గంటలు కొట్టారు. ఏకబిగిన 5 నిమిషాల పాటు ప్రజలు దీన్ని కొనసాగించడంతో కాలనీలు, వీధులు మార్మోగాయి. ప్రముఖ ఆలయాల వద్ద వైద్యులు, పారిశుధ్య సిబ్బంది చప్పట్లు కొట్టారు. గంటలు మోగించారు.
ఆదివారమంతా గవర్నర్ తమిళిసై.. రాజ్‌భవన్‌కే పరిమితమయ్యారు. కరోనా కట్టడికి అత్యవసర సేవల్లో నిమగ్నమైన సిబ్బందికి కృతజ్ఞతాపూర్వకంగా భర్త, కుటుంబసభ్యులతో కలిసి ఆమె చప్పట్లు కొట్టారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ తన కుటుంబసభ్యులు, మంత్రులతో కలిసి చప్పట్లు కొట్టారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు.