కొండంత విజయం

ABN , First Publish Date - 2020-05-29T09:17:30+05:30 IST

వ్వున దూకే గోదావరమ్మ మేడిగడ్డ వద్ద ఆగింది! అక్కడి నుంచి ఎగురుతూ.. దుంకుతూ దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణించింది! దాదాపు అర కిలోమీటరు ఎత్తుకు పరవళ్లు తొక్కుతూ సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండల శివారులోని సర్జ్‌పూల్‌కు చేరింది! మరొక్క 400 మీటర్ల దూరం మాత్రమే! శుక్రవారం

కొండంత విజయం

  • భువి నుంచి దివికి గోదావరి జలాలు
  • ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
  • సర్జ్‌పూల్‌ నుంచి రిజర్వాయర్‌కు గోదారమ్మ
  • తెలంగాణలోనే అత్యంత ఎత్తుకు చేరిక
  • చండి, సుదర్శన యాగాలకు ఏర్పాట్లు
  • పాల్గొంటున్న చిన్నజీయర్‌ స్వామి
  • నిర్వాసితులతో సీఎం సహపంక్తి భోజనం
  • వెయ్యి మందికి మాత్రమే ఆహ్వానం
  • 1200 మంది పోలీసులతో భారీ బందోబస్తు


సిద్దిపేట, మే 28 (ఆంధ్రజ్యోతి): రివ్వున దూకే గోదావరమ్మ మేడిగడ్డ వద్ద ఆగింది! అక్కడి నుంచి ఎగురుతూ.. దుంకుతూ దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణించింది! దాదాపు అర కిలోమీటరు ఎత్తుకు పరవళ్లు తొక్కుతూ సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండల శివారులోని సర్జ్‌పూల్‌కు చేరింది! మరొక్క 400 మీటర్ల దూరం మాత్రమే! శుక్రవారం మీట నొక్కడమే తరువాయి! మహా జల ఘట్టం ఆవిష్కృతం కానుంది! మన కళ్ల ముందు అద్భుతం సాక్షాత్కరించనుంది! ముఖ్యమంత్రి కేసీఆర్‌ జల యజ్ఞం ఫలించనుంది! తెలంగాణ ప్రజలకు ‘కొండంత విజయం’ దక్కనుంది! తెలంగాణలోనే అత్యంత ఎత్తయిన కొండపోచమ్మ సాగర్‌కు గోదావరి జలాలు తరలనున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత సర్జ్‌పూల్‌లోని పంపులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభిస్తారు. ఆ వెంటనే నీళ్లు కొండపోచమ్మ సాగర్‌ను చేరనున్నాయి! అక్కడి నుంచి రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే డెలివరీ సిస్టర్న్‌ వద్దకు చినజీయర్‌ స్వామితో కలిసి సీఎం కేసీఆర్‌ చేరుకుంటారు. గోదావరి జలాలకు జల హారతి పట్టి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్‌ ద్వారా 2.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందనున్నది. హైదరాబాద్‌ మహానగరానికి తాగునీటి సరఫరా చేయడానికీ ఈ నీటిని వినియోగించనున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు కొండపోచమ్మ ఆలయ ఆవరణలో చండి, కొండపోచమ్మ సాగర్‌ పంప్‌హౌజ్‌ వద్ద సుదర్శన యాగాలను ప్రారంభిస్తారు. ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు కొండపోచమ్మ ఆలయంలో జరిగే చండి యాగంలో పాల్గొన్ని పూర్ణాహుతి సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకుని, పక్కనే ఉన్న ఎర్రవల్లి ఫాంహౌ్‌సకు వెళతారు. తిరిగి 10 గంటలకు కొండపోచమ్మసాగర్‌ పంప్‌హౌజ్‌కు చేరుకుంటారు. ఇక్కడ జరిగే సుదర్శన యాగంలో చినజీయర్‌ స్వామితో కలిసి పాల్గొంటారు. కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌లో ముంపునకు గురైన గ్రామాలకు చెందిన నిర్వాసితులతో సీఎం కేసీఆర్‌ సహపంక్తి భోజనం చేస్తారని సమాచారం. వీరితోపాటు అదనంగా మరో వెయ్యి మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 1200 మంది పోలీసులను రంగంలోకి దించారు. కొండపోచమ్మ ఆలయం, రిజర్వాయర్‌తోపాటు సహపంక్తి భోజనం జరిగే చోట పోలీసులు బందోబస్తు చేయనున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా సూచనలు చేశారు. పలుచోట్ల శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు.


ముఖ్యమంత్రి షెడ్యూల్‌ ఇదీ!

ఉదయం 7 గంటలకు కొండపోచమ్మ ఆలయంలో జరిగే చండి యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు.

9.35 గంటలకు కేసీఆర్‌ దత్తత గ్రామం ఎర్రవల్లిలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన

9.40కి మర్కుక్‌ మండల కేంద్రంలో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ

9.50 గంటలకు మర్కుక్‌ పంపుహౌస్‌ వద్దకు చేరుకుంటారు.

10.10కి సుదర్శన యాగ పూర్ణాహుతికి హాజరు.

11.30కు పంప్‌హౌ్‌సలో మోటార్లు ప్రారంభిస్తారు.

11.35 గంటలకు చినజీయర్‌ స్వామితో కలిసి కొండపోచమ్మ సాగర్‌లో చేరిన నీళ్లకు జలహారతి

12.00 గంటలకు వరదరాజపూర్‌లోని వరదరాజ స్వామి ఆలయంలో పూజలు

12.40 గంటలకు మర్కుక్‌ పంపుహౌస్‌ వద్ద ప్రజా ప్రతినిధులు, ఇంజనీరింగ్‌ అధికారులతో సమావేశం

1.30 గంటలకు సహపంక్తి భోజనం


త్యాగధనులకు వందనాలు

‘‘కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ భూసేకరణలో నీటిపారుదలశాఖ మంత్రిగా పాలుపంచుకున్నాను. దాదాపు 3లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు హైదరాబాద్‌ నగరానికి తాగునీరు అందించే బృహత్తరమైన రిజర్వాయర్‌ ఇది. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత ఎత్తుకు నీటిని ఎత్తిపోసే మహత్తర కార్యక్రమాన్ని  ప్రారంభించుకోవడం గర్వంగా ఉంది. కొండపోచమ్మ సాగర్‌ నిర్వాసితులకు సకల హంగులతో పునరావాసం కల్పించాం. స్వచ్ఛందంగా తమ భూములను, ఇళ్లను రైతుల కోసం త్యాగం చేశారు. వారందరికీ వందనాలు. సీఎం కేసీఆర్‌ లక్ష్యానికి అండగా నిలిచారు. అతి తక్కువ సమయంలో అత్యద్భుతంగా రిజర్వాయర్‌ నిర్మాణం కావడం వెనుక  సీఎం కేసీఆర్‌ ఆలోచన, అధికారుల కృషి ఎంతో ఉంది. ఈ రిజర్వాయర్‌తో మెతుకుసీమకు పూర్వ వైభవం రానుంది.

- రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు


కేసీఆర్‌కు ప్రజలు రుణపడి ఉంటారు

‘‘కేసీఆర్‌కు ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారు. ఎంతో దూరదృష్టితో 240 కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తెచ్చి, 618 మీటర్ల ఎత్తుకుపోయడం నిజంగా అద్భుతం. సిద్దిపేట జిల్లా పరిధిలో ఏకకాలంలో రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌లాంటి ప్రాజెక్టులు నా పాలనలో జరగడం సంతోషంగా ఉంది. నా జన్మ ధన్యమైంది.  ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా. కొండపోచమ్మసాగర్‌ ప్రాజెక్టు భూసేకరణ నుంచి మొదలుకుని ప్రాజెక్టులోకి నీళ్లే వచ్చే వరకు పనిచేయడం పూర్వజన్మ సుకృతం. సీఎం కేసీఆర్‌ సలహాలు, సూచనలు పాటిస్తూ ప్రాజెక్టున మూడేళ్లలోనే పూర్తి చేయడం గొప్ప అనుభూతినిస్తుంది.  వచ్చే మూడు, నాలుగు సంవత్సరాల్లో సిద్దిపేట జిల్లా అఽభివృద్ధిలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవడంతో పాటు తెలంగాణ కూడా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తుంది’’ - సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి

Updated Date - 2020-05-29T09:17:30+05:30 IST