కరోనా కట్టడిలో సర్కారు విఫలం

ABN , First Publish Date - 2020-06-21T08:37:42+05:30 IST

కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు.

కరోనా కట్టడిలో సర్కారు విఫలం

  • ఏ దశలోనూ నియంత్రించలేకపోయింది
  • తెలంగాణ మరణాల రేటు 
  • జాతీయ సగటు కంటే ఎక్కువే
  • చిన్న రాష్ట్రాల కంటే తక్కువ పరీక్షలు
  • ఆక్సిజన్‌ కొరతతో జర్నలిస్టు మరణం
  • ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ధ్వజం
  • కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే వ్యాప్తి: కిషన్‌రెడ్డి 
  • సీఎం చివరి మజిలీ జైలే: సంజయ్‌


హైదరాబాద్‌, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ దశలోనూ కరోనాను నియంత్రించలేకపోయిందని ధ్వజమెత్తారు. హిమాచల్‌ప్రదేశ్‌ లాంటి చిన్న రాష్ట్రం కంటే కూడా తక్కువ కరోనా పరీక్షలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కరోనా మరణాల సగటు 3.8 కాగా, ఇది జాతీయ సగటు(1.5) కంటే ఎక్కువ అని తెలిపారు. ప్రపంచంలోనే పేదలకు అత్యుత్తమ ఆరోగ్య బీమా అందించే ఆయుష్మాన్‌ భారత్‌ను కేసీఆర్‌ ప్రభుత్వం అమలుచేయకపోవడం వల్ల లక్షలాది మంది పేదలు నష్టపోతున్నారని చెప్పారు. ఒక యువ జర్నలిస్టు ఆక్సిజన్‌ కొరతతో మరణించడం కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి ఉదాహరణ అన్నారు.


తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం ప్రాజెక్టులు కట్టడం లేదని, ఏ ప్రాజెక్టులో అవినీతికి అవకాశం ఉంటుందో వాటినే చేపడుతోందని ఆరోపించారు. ప్రతీ పనిలోనూ అవినీతే, తెలంగాణ ఒక్క అవినీతిలోనే ముందుందని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును రూ.45వేల కోట్ల అంచనాతో చేపట్టి, ఇప్పుడు రూ.85 వేల కోట్లకు పెంచారని అన్నారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం ద్వారా దక్షిణ తెలంగాణకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. శనివారం బీజేపీ రాష్ట్ర శాఖ నిర్వహించిన జన సంవాద్‌ వర్చువల్‌ ర్యాలీలో నడ్డా ఢిల్లీ నుంచి పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన తర్వాత నడ్డా తొలిసారిగా రాష్ట్ర పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. చైనా సరిహద్దులో అమరులైన సైనికులకు, కరోనాతో మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు.


ప్రధాని మోదీ ప్రభుత్వం గడిచిన ఏడాదిలో సాధించిన విజయాలను వివరించిన నడ్డా, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపైన, సీఎం కేసీఆర్‌పైన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 7 లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇస్తామని ఆరేళ్ల కిందట వాగ్దానం చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ఇప్పటి వరకు 50వేల ఇళ్లు కూడా పూర్తిచేయలేకపోయిందని విమర్శించారు. హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటూ హిందూ సమాజాన్ని విమర్శించడం వెనుక ఆంతర్యమేంటని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. అది హిందూ సమాజాన్ని కించపరచడమేనని, సీఎం అహంకారానికి నిదర్శనమని నడ్డా మండిపడ్డారు. లాక్‌డౌన్‌ ఎందుకంటూ కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ ప్రశ్నించారని, అసలు కేంద్రాని కంటే ముందే కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం గుర్తించాలని హితవు పలికారు. రాహుల్‌ వ్యాఖ్యలు చూస్తుంటే వారి ముఖ్యమంత్రులే ఆయన మాట వినడం లేదని ఎద్దేవా చేశారు. చైనా సరిహద్దులో జరిగిన ఘటనపై కాంగ్రెస్‌ నాయకుల వ్యాఖ్యలు సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని నడ్డా మండిపడ్డారు. పెట్రోలు ధరలు తగ్గించాలంటూ సోనియా కేంద్రాన్ని కోరడంపై స్పందిస్తూ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కూడా ధరలు పెంచిన విషయం తెలియదా? అని ప్రశ్నించారు.


ప్రమాదకరంగా హైదరాబాద్‌: కిషన్‌రెడ్డి 

కరోనా నియంత్రణలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్‌ నగరం ప్రమాదకరంగా మారిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మర్కజ్‌ వెళ్లివచ్చిన వారి వల్ల కరోనా వ్యాప్తి జరిగిందని తాము పేర్కొంటే, సీఎం కేసీఆర్‌ హేళన చేశారని అన్నారు. ఇప్పుడు కరోనా కేసులు ఈ స్థాయిలో పెరగడానికి ప్రభుత్వమే కారణమని విమర్శించారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం, ఒవైసీ కుటుంబం పాలిస్తున్నాయని ఆరోపించారు. వీరి నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరముందని చెప్పారు. ఒక వ్యక్తి కోసమో, కుటుంబం కోసమో తెలంగాణ యువత త్యాగాలు చేయలేదన్నారు. రైల్వే, ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పూర్తిస్థాయిలో నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.


ఎంఐఎం కబంధ హస్తాల్లో రాష్ట్రం: సంజయ్‌ 

సీఎం, మంత్రులు జోకర్లుగా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌కు చివరి మజిలీ జైలే అని తేల్చిచెప్పారు. సీఎంతో పాటు మంత్రుల అవినీతిని బయటపెడతామని ప్రకటించారు. కరోనా బాధితులను పరామర్శించేందుకు గవర్నర్‌ నిమ్స్‌కు వెళ్లినా సీఎం మాత్రం ఫాంహౌస్‌ నుంచి బయటకు రాలేదని విమర్శించారు. దళిత యువతిపై ఎంఐఎం నాయకుడు అత్యాచారం చేస్తే, సీఎం స్పందించలేదని సంజయ్‌ ఆరోపించారు. ఎంఐఎం కబంధ హస్తాల్లో తెలంగాణ చిక్కుకుందని అన్నారు. రాష్ట్రంలో ఫాంహౌ‌స్‌ల లొల్లి తప్ప పేదల ఇళ్లను పట్టించుకునేవారు కరువయ్యారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ స్వార్థపూరిత పాలనకు వ్యతిరేకంగా మలిదశ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2020-06-21T08:37:42+05:30 IST