అటవీ రక్షణ, పునరుద్ధరణే ధ్యేయం
ABN , First Publish Date - 2020-12-06T07:44:24+05:30 IST
కరోనా వల్ల ఆలస్యమైన అటవీ సంరక్షణ, అటవీ పునరుద్ధరణ పనుల్ని త్వరగా పూర్తి చేయాలని చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులను అటవీ సంరక్షణ

వన్య ప్రాణుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: పీసీసీఎఫ్
హైదరాబాద్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కరోనా వల్ల ఆలస్యమైన అటవీ సంరక్షణ, అటవీ పునరుద్ధరణ పనుల్ని త్వరగా పూర్తి చేయాలని చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ ఆదేశించారు. అదనపు పీసీసీఎ్‌ఫలు, చీఫ్ కన్సర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులతో పలు అంశాలకు సంబంధించి ఆమె అరణ్య భవన్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు.
వచ్చే సీజన్‌లో చేపట్టనున్న ‘తెలంగాణకు హరితహారం’ కోసం నర్సరీ పనులను వేగవంతం చేయాలన్నారు. అటవీ పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ (కంపా), అర్బన్ పార్కుల పనులను లక్ష్యం మేరకు త్వరగా పూర్తి చేయాలని, ప్రతి అధికారి క్షేత్ర స్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వాలని అదేశించారు. పనిలో నాణ్య త, కచ్చితత్వం ఉండాలని స్పష్టం చేశారు. అలా పనులు జరగని చోట్ల సంబంధిత అధికారులను బాధ్యులుగా చేసి, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వన్యప్రాణుల సంచారం విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని, అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు తగిన సూచనలు ఇస్తూ మనుషులు, జంతువుల మధ్య ఘర్షణను నివారించేలా అటవీ అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఆమె సూచించారు. కంపా నిధుల ఖర్చు, పనుల పురోగతిపై పీసీసీఎఫ్ లోకేష్ జైస్వాల్ జిల్లాల వారీగా అధికారులతో సమీక్షించారు. పీసీసీఎఫ్ ఆర్.ఎం. దోబ్రియెల్, పీసీసీఎఫ్ (అటవీ రక్షణ) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.