సార్వత్రిక సమ్మె ప్రశాంతం

ABN , First Publish Date - 2020-11-27T07:52:20+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు గురువారం నిర్వహించిన

సార్వత్రిక సమ్మె ప్రశాంతం

 రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగుల నిరసనలు

 నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు

 సమ్మెకు టీఆర్‌ఎస్‌ మద్దతు.. నిరసనల్లో వినోద్‌ 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు గురువారం నిర్వహించిన సమ్మె రాష్ట్రంలో ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా కార్మిక సంఘాల నేతలు, కార్మికులు, ఉద్యోగులు ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కొన్ని కార్యాలయాల ముందు ఉదయమే నిరసన కార్యక్రమాలు చేపట్టగా.. మరికొన్ని కార్యాలయాల్లో భోజన విరామ సమయాల్లో నిరసనకు దిగారు.


ఈ సమ్మెకు టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది. బీఎ్‌సఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ, రైల్వే, బ్యాంకింగ్‌, తదితర కార్మిక యూనియన్లు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌, రాజ్యసభ ఎంపీ బండా ప్రకాశ్‌ పాల్గొన్నారు. ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌లో నిర్వహించిన మహధర్నాకు వారు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా భోజన విరామ సమయంలో నిరనస ప్రదర్శనలు చేసినట్లు తెలంగాణ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ తెలిపింది.


తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయిస్‌ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్‌ ఉద్యోగులు రాష్ట్రంలోని అన్ని విద్యుత్‌ సంస్థల కార్పొరేషన్‌, జిల్లా సర్కిల్‌, జనరేటింగ్‌ స్టేషన్లలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బీమా కంపెనీల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఆస్పత్రుల్లో వైద్య ఉద్యోగులందరూ సమ్మెకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు చేసినట్లు తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ తెలిపింది. హైదరాబాద్‌లో తమ జోనల్‌ కార్యాలయంలో ఎల్‌ఐసీ ఉద్యోగులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.


కేంద్ర ప్రభుత్వ ధోరణికి నిరసనగా శుక్రవారం దేశవ్యాప్తంగా కేంద్ర కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి తెలిపింది. సమ్మె ప్రభావం దాదాపు అన్ని జిల్లాలోనూ కనిపించింది. కొన్ని జిల్లాల్లో బస్సులు నడవక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు జిల్లాల్లో టీఎన్‌జీవోస్‌ నేతలు కలెక్టరేట్ల వద్ద నిరసన చేపట్టారు. కార్మిక సంఘాలు, వామపక్ష నాయకులు ర్యాలీలు, ప్రదర్శనల్లో పాల్గొన్నారు. సింగరేణి వ్యాప్తంగా సమ్మె ప్రభావం కనిపించింది. బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడింది.  


Read more