వేతనాల్లో కోతపై కన్నెర్ర!
ABN , First Publish Date - 2020-04-01T08:46:14+05:30 IST
కరోనా వైరస్ కల్లోలంతో ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు మండిపడ్డాయి. తమతో చర్చించకుండా,

- ధనిక రాష్ట్రంలో కోతలు దారుణం
- ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం సరికాదు
- 15 రోజుల లాక్‌డౌన్‌కే రాష్ట్రం దివాలా తీసిందా?
- వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది జీతాల్లో కోత ఏంటీ?
- ఉద్యోగ, టీచర్ల, పెన్షనర్ల సంఘాల మండిపాటు
- వేతనాల్లో కోతపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయం
హైదరాబాద్, మార్చి 31(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ కల్లోలంతో ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు మండిపడ్డాయి. తమతో చర్చించకుండా, కనీసం సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణమని వేర్వేరు పత్రికా ప్రకటనల్లో పేర్కొన్నాయి. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ‘15 రోజుల లాక్‌డౌన్‌కే ప్రభుత్వ ఖజానా దివాలా తీయడం హాస్యాస్పదంగా ఉంది. ఇనాళ్లు ధనిక రాష్ట్రమని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఉద్యోగులకు వేతనాల్లో కోత పెట్టడం ఏమిటి’ అని ప్రశ్నించారు. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మాత్రమే ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వం, ప్రజలు ఆపదలో ఉంటే తమ వంతు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే పలు సంఘాల తరఫున ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారని గుర్తు చేశారు. అవసరమైతే ప్రభుత్వం తమను సంప్రదిస్తే మరిన్ని రోజుల వేతనం ఇవ్వడానికి తాము సిద్ధమేనని, కానీ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఉద్యోగ, ఉపాధ్యాయులను అవమానించడమేనని అన్నారు. ఇప్పటికే పీఆర్సీ, ఐఆర్‌కు, చివరికి డీఏలకూ దిక్కులేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు. ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని సంఘాలు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించాయి.
ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు వేయనున్నటు తెలంగాణ పెన్షనర్ల జేఏసీ చైర్మన్ కె.లక్ష్మయ్య తెలిపారు. ఆయనతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక, వివిధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందగౌడ్, పర్వతరెడ్డి(ఎస్టీయూ ), జంగయ్య, చావ రవి(యూటీఎఫ్), సంపత్ కుమార్ స్వామి(తెలంగాణ ఉద్యోగుల సంఘం), రమణ, మైస శ్రీనివాసులు(టీపీటీఎఫ్), అంజిరెడ్డి, చెన్నయ్య(పీఆర్టీయూ-తెలంగాణ), హన్మంతరావు, నవాతు సురేశ్(టీపీయూఎస్), అబ్దుల్లా, రాజిరెడ్డి(టీఎస్టీయూ), సంజీవయ్య, సురేందర్‌రెడ్డి(డిగ్రీ అధ్యాపక సంఘం), రాజభాను, చంద్రప్రకాశ్(గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం), జగదీశ్, నర్సింలు(ఉపాధ్యాయ పండిత పరిషత్), లక్ష్మణ్ నాయక్(టీఎ్సటీటీఎఫ్), ఖమ్రొద్దీన్(ఎస్జీటీ ఫోరం), మహ్మద్ అబ్దుల్లా(పండిత పరిషత్), కమలాకర్(సీపీఎస్ ఉద్యోగుల సంఘం), షౌకత్ అలీ(టీఎ్‌సపీటీఏ), మల్లారెడ్డి(టీయూటీఎఫ్), మహిపాల్‌రెడ్డి(ఎస్టీయూ యూనియన్), హరికిషన్(టీటీఏ), భిక్షం(అనుబంధ కాలేజీ టీచర్ల సంఘం), ఫారూఖ్ హుస్సేన్(మైనారిటీ ఉద్యోగుల సంఘం) ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
పూర్తి వేతనాలు ఇవ్వండి: ఉద్యోగ జేఏసీ
వేతనాల్లో కోత విధించే జీవో-27ను పెండింగ్‌లో పెట్టాలని ఉద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఇక కరోనా వైరస్ కట్టడిలో నిరంతర సేవలు అందిస్తున్న ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలని విన్నవించింది. ఈ మేరకు మంగళవారం ఉద్యోగ జేఏసీ సమావేశమైందని చైర్మన్ కె.రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ వి.మమత తెలిపారు. పెన్షనర్లకూ కోతల్లేకుండా చెల్లించాలని కోరారు. ట్రెసా అధ్యక్షుడు వి.రవీందర్‌రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగ సంఘం అధ్యక్షుడు జి.జ్ఞానేశ్వర్, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి, టీటీయూ అధ్యక్షుడు ఎం.మణిపాల్ రెడ్డి, టీయూటీఎఫ్ అధ్యక్షుడు మల్లారెడ్డి, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు గోల్కొండ సతీశ్, డిగ్రీ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు సంజీవ, పబ్లిక్ సెక్టార్ అధ్యక్షుడు రాజేశం, యూనివర్సిటీ ఉద్యోగులు జేఏసీ మధుకర్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మార్చి నెలలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లించాలని కోరారు.
కాగా, గ్రామ పంచాయతీ, మునిసిపల్ కార్మికులకు వేతనాల్లో కోత విధించడంపై పునరాలోచించాలని తెలంగాణ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. కష్టకాలంలో సేవలందిస్తున్న మునిసిపల్ కార్మికులు, గ్రామపంచాయతీ సిబ్బందికి అదనంగా ఒక నెల వేతనం చెల్లించాలని కోరింది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు యూనియన్ అధ్యక్షుడు ఖమర్ అలీ, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఓ లేఖ రాశారు.