కొత్త ఏడాదిలో కరోనా పీడ తొలగిపోవాలి
ABN , First Publish Date - 2020-12-28T08:35:57+05:30 IST
కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, కరోనా పీడ తొలగిపోవాలని ఆదివరాహస్వామిని వేడుకున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆదివారం పెద్దపల్లి జిల్లాలో ఆమె పర్యటించారు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
పెద్దపల్లి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, కరోనా పీడ తొలగిపోవాలని ఆదివరాహస్వామిని వేడుకున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆదివారం పెద్దపల్లి జిల్లాలో ఆమె పర్యటించారు. మొదట కమాన్‌పూర్ మండలంలోని ఆదివరాహస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామానికి చేరుకున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తల్లి ఇటీవల మృతి చెందగా, ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.
బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న పెద్దపల్లి పట్టణానికి చెందిన బాలుడు రెహమాన్ ఇంటికి వెళ్లారు. బాలుడికి ఆపరేషన్ చేయించేందుకు రూ.1.50 లక్షలు మంజూరు చేయించారు. కాగా, కమాన్‌పూర్ మండల కేంద్రంలోని ఆదివరాహస్వామి ఆలయంలో ఎమ్మె ల్సీ కవిత ప్రత్యేక పూజా కార్యక్రమంలో కాస్త వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యక్రమం అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగింది. తమకు కార్యక్రమం గురించి సమాచారం ఇవ్వలేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితను సన్మానించే సమయంలోనూ ఆలయ ఈవో తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా అగౌరవపరిచారని వాపోయారు.