వ్యవసాయ చట్టాలను..సమర్థించడం వెనుక కుట్ర
ABN , First Publish Date - 2020-12-29T07:35:41+05:30 IST
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను ఇన్నాళ్లూ వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు సమర్థించడం వెనుక కుట్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నిస్వార్థంగా సమర్థించినట్లయితే, గ్రామాల్లో
కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాలని
ఏ చట్టంలో ఉందో చెప్పండి
కేసీఆర్ యూ టర్న్ సీఎం..
ఆయన మళ్లీ పాస్‌పోర్టు బ్రోకర్ కావడం పక్కా: బండి సంజయ్
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను ఇన్నాళ్లూ వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు సమర్థించడం వెనుక కుట్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నిస్వార్థంగా సమర్థించినట్లయితే, గ్రామాల్లో అధికారికంగా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘‘లేదంటే రైతులతో కలిసి లక్ష నాగళ్లతో ఫాంహౌ్‌సలో కొండ్రవెట్టి దున్నుతం.. ఆ అవకాశం మాకివ్వొద్దు. కేంద్రాన్ని బద్‌నాం చేయాలని ప్రయత్నిస్తే అడ్డుకుని తీరుతం’’ అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకంలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, మాజీ ఎంపీ వివేక్ తదితరులతో కలిసి సంజయ్ సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో యాప్‌ను ఆవిష్కరించారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయాలని ఏ కేంద్ర చట్టంలో ఉందో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర సంస్థలైన ఎఫ్‌సీఐ, సీసీఐలే బస్తాలు, రవాణా వంటివి సమకూరుస్తున్నాయని, మరి ప్రభుత్వానికి రూ.7500 కోట్ల నష్టం ఎలా వచ్చిందో చెప్పాలన్నారు.
కేసీఆర్ ఓ సైకో..
సీఎం కేసీఆర్ ఓ సైకో, యూ టర్న్ సీఎం అని సంజయ్ మండిపడ్డారు. పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే చాలంటూ ప్రకటించి, ఆయనే మాస్క్ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. సీఎం మాటలు నమ్మి నియంత్రిత సాగు చేసిన రైతులు బికారులయ్యారన్నారు. ‘‘రిజిస్ట్రేషన్‌లో కొత్త విధానం ఎందుకు ప్రవేశపెట్టిండో.. ఎందుకు యూ టర్న్ తీసుకున్నడో ఎవరికీ అర్థం కాలే.. చివరకు కేసీఆర్ బతుకే యూ టర్న్ అవుతది. మళ్లీ ఆయన పాస్‌పోర్టు బ్రోకర్ కావడం పక్కా’’ అని సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సందర్భంగా వంగివంగి దండాలు పెట్టినా తమ పార్టీ నాయకత్వం పట్టించుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా సంజయ్ చెప్పారు. వ్యవసాయ చట్టాలపై బీజేపీ అవగాహన కార్యక్రమాలకు వస్తున్న స్పందనకు భయపడే సీఎం సమర్థిస్తున్నారని చెప్పారు.
సంజయ్ చొరవతో స్వదేశానికి రానున్న నిజామాబాద్ వాసి
కువైట్‌లో చిక్కుకుపోయిన నిజామాబాద్ జిల్లాకు చెందిన గంగాధర్ అనే యువకుడిని బండి సంజయ్ చొరవతో స్వదేశానికి రానున్నారు. బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన గంగాధర్.. ఏజెంటు మోసం చేయడంతో అక్రమ కేసులో ఇరుక్కుపోయాడు. దీనిని గంగాధర్ సోషల్ మీడియా ద్వారా సంజయ్ దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి మురళీధరన్‌కు లేఖ రాశారు. మురళీధరన్.. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఆదేశాలు జారీచేశారు. అక్కడి అధికారుల జోక్యంతో గంగాధర్‌పై నమోదు చేసిన అక్రమ కేసును కువైట్ పోలీసులు ఉపసంహరించుకున్నారు. దీంతో గంగాధర్ స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది.