ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-03-12T11:23:41+05:30 IST

కలెక్టర్‌ అబ్దుల్‌ అజీంఖాన్‌ బుధవారం ఉదయం మహదేవపూర్‌ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రిని సందర్శించి వైద్య సిబ్బంది పనితీరు పట్ల ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్‌

నలుగురు డాక్టర్లకు మెమోలు


మహదేవపూర్‌, మార్చి 11 : కలెక్టర్‌ అబ్దుల్‌ అజీంఖాన్‌ బుధవారం ఉదయం మహదేవపూర్‌ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రిని సందర్శించి వైద్య సిబ్బంది పనితీరు పట్ల ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్‌ పర్యటన ఒక రోజు ముందే ఖరారైనా నలుగురు డాక్టర్లు ప్రవీణ్‌, ప్రశాంతి, లావణ్య, రాజజ్‌కుమార్‌లు విధులకు గైర్హాజరు కావడం విశేషం. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నలుగురు డాక్టర్లకు మెమోలు జారీ చేయనున్నట్లు తెలిపారు. మరో వారం రోజుల్లో ఆస్పత్రికి వస్తానని, ఆస్పత్రిలో పరికరాలు పారిశుధ్యం విషయాల్లో స్పష్టమైన మార్పులు కనిపించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రుల నిర్వహణ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటే డాక్టర్లు విధులకు గైర్హాజరు కావడం ఆస్పత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 


మహదేవపూర్‌ పంచాయతీకి ప్రశంసలు 

 హైవే వెంబడి గ్రామ పంచాయతీ తీసుకున్న పరిశుభ్రత కార్యక్రమాలను కలెక్టర్‌ ప్రశంసించారు. మహదేవపూర్‌ సర్పంచ్‌, జీపీ సిబ్బంది ఆశించిన స్థాయిలో పనిచేస్తున్నారన్నారు. గ్రామంలోని అన్ని వాడల్లో ఇలాంటి ఫలితాలు సాధించాలని కోరారు. బొమ్మాపూర్‌ క్రాస్‌ నుంచి కాళేశ్వరం వరకు సుమారు 20 కిలోమీటర్లు రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్‌ పోయాలని అధికారులను ఆదేశించారు. బస్టాండ్‌ కూడలిలో హైవేపై ఉన్న శ్రీపాదరావు విగ్రహం గార్డెన్‌ స్థలాన్ని తగ్గించి వాహనాల రాకపోకలకు సులభతరం చేయాలని అధికారులను సూచించారు. హైవేకి ఇరువైపులా ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ శ్రీపతి బాపు కలెక్టర్‌ను సన్మానించారు. ఆయన వెంట ఉప సర్పంచ్‌ సల్మాన్‌, వార్డు సభ్యులున్నారు. 


కాళేశ్వరంలో.. 

కాళేశ్వరంలో కలెక్టర్‌ గ్రామ సర్పంచ్‌ వసంతతో గ్రామీణాభివృద్ధికి కావాల్సిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. సబ్‌ స్టేషన్‌ నుం చి బస్టాండ్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్‌ పోసి రోడ్డును సుందరంగా తీర్చి దిద్దాలన్నారు. రోడ్డుపై ఉన్న నిర్మాణాలను తొలగించాలన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ వసంత గ్రామంలోని సమస్యలను కలెక్టర్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో కాళేశ్వరం పంచాయతీకి సబంధించిన అభివృద్ధిపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్‌ సర్పంచ్‌కు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ కాళేశ్వరంలోని గిరిజన ఆశమ్ర పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా ? అని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు పౌష్టికాహారంతో పాటు మంచి విద్యను అందించాలని ఆయన సూచించారు. ఆయన వెం ట ఎంపీపీ రాణిబాయి జడ్పీటీసీ అరుణ, సర్పంచ్‌ శ్రీపతిబాపు, తహసీల్దార్‌ మల్లయ్య, ఎంపీడీవో సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-12T11:23:41+05:30 IST