వరదలోనే నగరం

ABN , First Publish Date - 2020-08-22T10:14:21+05:30 IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో వర్షాలు కాస్త తెరిపినిచ్చాయి. అయితే ముసురుపడడం కొనసాగుతూనే ఉంది

వరదలోనే నగరం

తేరుకోని కాలనీలు.. జనజీవనం అస్తవ్యస్తం

మళ్ళీ కురుస్తున్న ముసురు


హన్మకొండ, ఆగస్టు 21, (ఆంధ్రజ్యోతి) : వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో వర్షాలు కాస్త తెరిపినిచ్చాయి. అయితే ముసురుపడడం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కూడా జిల్లాలో సరాసరి 42.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 295.2 మిమీ వర్షం పడింది. నగరంలో వరద పరిస్థితి మామూలు స్థితికి ఇంకా రాలేదు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు కురిసిన వర్షాలతో తోతట్టు ప్రాంతాల్లోకి మళ్లీ నీళ్ళు వచ్చాయి. వరంగల్‌లోని శివనగర్‌, మైసయ్యనగర్‌, చింతల్‌, చంద్రవదన కాలనీ, గాంధీనగర్‌ లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపునీరు వచ్చి చేరింది. ఖిలా వరంగల్‌ మధ్య కోట ప్రాంతంలోని ఇళ్లకు రెండోసారి నీళ్లు వచ్చాయి. ఇంకా దాదాపు 20 కాలనీల్లో వరదనీరు నిలిచే ఉంది. 


వరంగల్‌లోని ఏకశిలానగర్‌, డీకే నగర్‌, శాకరాసి కుంట, ఎస్‌ఆర్‌ఆర్‌ నగర్‌, బీఆర్‌ నగర్‌, రాజీవ్‌ గృహకల్ప కాలనీ ఇంకా నీట మునిగే  ఉన్నాయి. వర్షాలు కురవకపోతే నీరంతా పూర్తిగా  బయటకు వెళ్ళడానికి ఇంకా మరో రెండు, మూడు రోజులు పట్టేట్టు ఉంది. నగరంలోని కోటచెరువుకు గురువారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గండిపెట్టారు. దీంతో ఈ చెరువు నీరంతా దిగువకు ప్రవహిస్తోంది. ఈ చెరువు శిఖంలోనే చాకలి అయిలమ్మనగర్‌పేరుతో పేదలు గుడిసెలు వేసుకున్నారు. కోట చెరువు పూర్తిగా నిండడంతో గుడిసెలన్నీ వారం రోజులుగా నీటిలో నానుతున్నాయి. కార్పొరేషన్‌ అధికారులు కూలడానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.  


పర్యటనలు

నగరంలో ముంపునకు గురైన ప్రాంతాలను చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ సందర్శించారు. వర్షానికి దెబతిన్న రోడ్లు, కాలువలను పరిశీలించారు. మండలాల్లో జడ్పీ చైర్మన్‌ సుధీర్‌ కుమార్‌ పరిశీలించారు. దెబ్బ తిన్న రోడ్లు, కాలువల నష్టాన్ని వారం రోజుల్లో అంచనా వేసి నివేదికలు సమర్పించాల్సిందిగా కోరారు. కాజీపేటలోని పలు కల్వర్టులు, ఇటీవల కొత్తగా నిర్మిస్తున్న ఆర్‌వోబీ పనులను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు పరిశీలించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ 55వ డివిజన్‌ పరిధిలోని భీమారం చెరువును పరిశీలించారు. కార్పొరేషన్‌ కమిషనర్‌ పమేలా సత్పతి వెంటరాగా డివిజన్‌ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. భగత్‌ సింగ్‌ నగర్‌ ముంపు ప్రాంతంలో ప్రజలతో మాట్లాడారు. 22,8 డివిజన్లలో నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు పర్యటించారు.  


మండలాల్లో..

ఐనవోలు మండలంలోని కొండపర్తి చెరువు బుంగపడింది. దీనిని పూడ్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. డీసీసీ చ్మైన్‌ మార్నేని రవీందర్‌రావు పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ బుంగ ప్రాంతాన్ని సందర్శించారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భీమదేవరపల్లి, కమలాపూర్‌, ఎల్కతుర్తి, హసన్‌పర్తి, దర్మసాగర్‌, వేలేరు మండలాల్లో చెరువులు పెద్ద ఎత్తున మత్తడి పోస్తున్నాయి.

Updated Date - 2020-08-22T10:14:21+05:30 IST