కేంద్రం నిధులివ్వడం లేదు
ABN , First Publish Date - 2020-06-23T09:34:34+05:30 IST
రాష్ట్రంలో కరోనా కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం శ్రమిస్తున్నదని, కానీ కొన్ని పార్టీల నేతలు చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఆ శాఖ మంత్రి ఈటెల

- చప్పట్లు, దీపాల వెలుగులకే పరిమితమైంది
- మన పరీక్షల యంత్రాన్ని కోల్‌కతాకిచ్చారు
- కరోనాపై బీజేపీవి కంపు రాజకీయాలు: ఈటల
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం శ్రమిస్తున్నదని, కానీ కొన్ని పార్టీల నేతలు చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఆ శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ధర్నాల పేరుతో ఆస్పత్రుల ఎదుట ఆందోళన చేయడం సరికాదని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీపాలు వెలిగించాలంటూ, చప్పట్లు కొట్టాలంటూ మాటలకే పరిమితమైన కేంద్రం.. కరోనా కట్టడికి నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి కేవలం రూ. 214 కోట్లే ఇచ్చి చేతులు దులుపుకొందన్నారు. కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు.. వారి ప్రభుత్వం చేసిన ఘనకార్యాన్ని తెలుసుకోవా లన్నారు. తెలంగాణ కోసం తెప్పించిన రోజుకు 4వేల పరీక్షలు చేసే సామర్థ్యం ఉన్న కోబాస్ యంత్రాన్ని కోల్‌కతాకు పంపిన కేంద్ర వైఖరిని మంత్రి తప్పుబట్టారు. తన తప్పులను పక్కనపెట్టిన బీజేపీ.. రాష్ట్రంలో పరీక్షలు తక్కువ చేస్తున్నారంటూ విమర్శలు చేయడం వారి కుసంస్కారానికి నిదర్శనమన్నారు.
కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతాం
ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ల్యాబ్‌లలో ఇప్పటివరకు రోజుకు 2,290 పరీక్షలను చేస్తున్నట్లు మంత్రి ఈటల చెప్పారు. వారం రోజుల్లో మరో 4,310 పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకొని రోజుకు 6,600 పరీక్షలు చేయనున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కోల్‌కతాకు కోబాస్ యంత్రాన్ని తరలించకుండా ఉంటే.. మరో 4 వేల పరీక్షలు చేసే సామర్థ్యం తెలంగాణకు ఉండేదని చెప్పారు. ఇదే అంశంపై సోమవారం వెంగళరావు నగర్‌లోని కుటుంబ సంక్షేమ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నాతాధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. వారంలో గచ్చిబౌలి ఆస్పత్రిని ప్రారంభించాలని, దానికి ఇన్‌చార్జిగా ప్రొఫెసర్ విమలా థామ్‌సను నియమించాలని ఆదేశించారు. అందులో పనిచేస్తున్న సిబ్బందిని 50ు మంది ఒక వారం పాటు మరో 50 శాతం మందిని ఇంకో వారం పాటు పనిచేసే విధంగా విభజించాలని ఆదేశించారు. ఆస్పత్రులలో బెడ్ లేక ఇబ్బంది పడేవారు 104కి ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి పీహెచ్‌సీ స్థాయిలోనే పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. లక్షణాలు ఉన్నవారికి, పాజిటివ్ వచ్చిన కాంటాక్ట్ వ్యక్తులకు మాత్రమే పరీక్షలు నిర్వహించాలని, మిగిలిన వారికి పరీక్షలు చేయొద్దని ఆయన అన్నారు.