రుణాల పేరుతో యువతులకు ఎర

ABN , First Publish Date - 2020-02-12T11:02:57+05:30 IST

సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికి కొందరు యువతులను లైంగికంగా వేధిస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకుడి బాగోతం బయటపడింది.

రుణాల పేరుతో యువతులకు ఎర

సోషల్‌మీడియా ద్వారా లైంగిక వేధింపులు

బయటపడిన టీఆర్‌ఎస్‌ నాయకుడి బాగోతం


లింగాలఘణపురం ఫిబ్రవరి 11: సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికి కొందరు యువతులను లైంగికంగా వేధిస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకుడి బాగోతం బయటపడింది. హైదరాబాద్‌ సైబర్‌ క్రైం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహిపాల్‌ తెలిపిన వివరాల ప్రకారం..  జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నేలపోగుల గ్రామానికి చెందిన కందగట్ల భాస్కర్‌ రెండేళ్లక్రితం బీసీ కార్పొరేషన్‌లో సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తనకు రుణం మంజూరు కాకపోవడంతో అధికారులను సంప్రదిం చగా జాబితాను రాష్ట్ర కార్యాలయానికి పంపడం వరకే తమ పని అని, వివరాలు కావాలంటే బీసీ కార్పొరేషన్‌ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌ పోర్టల్‌లో చెక్‌ చేసుకోవాలని సూచించారు. దీంతో సదరు వెబ్‌సైట్‌లో దరఖాస్తుదారుల వ్యక్తిగత డేటాను, ఫోన్‌నెంబర్లను సేకరించిన భాస్కర్‌ అమ్మాయిలకు ఫోన్‌ చేసి లైంగికంగా వేధించడం, సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తానని నమ్మబలకడంతో విసిగిపోయిన యువతులు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. వారు రంగంలోకి దిగి సోమవారం నేలపోగులలో భాస్కర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.


గతంలోనూ ఇదే తరహా కేసు..

భాస్కర్‌ గతంలోకూడా  ఇదే తరహా ఘటనలకు పాల్పడుతూ అమ్మాయిలను వేధిస్తుండటంతో 2007లో లింగాలఘణపురం పోలీసుల కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో 2010లో జనగామ మున్సిఫ్‌ కోర్టు రూ. 2వేల జరిమానాతో పాటుగా రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్‌ చేస్తూ భాస్కర్‌ జిల్లా కోర్టుకు అప్పీల్‌ చేయడంతో ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. అయినా తీరు మార్చుకోని భాస్కర్‌ మరోసారి యువతులకు సబ్సిడీ రుణాల పేరిట ఎర వేస్తూ సైబర్‌ క్రైం పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం ఆయన లింగాలఘణపురం మండలం నేలపోగుల గ్రామశాఖ అధ్యక్షుడిగా కొనసాగుతుండటం గమనార్హం.

Updated Date - 2020-02-12T11:02:57+05:30 IST