స్టాఫ్‌నర్సుల నిర్లక్ష్యంతో శిశువు మృతి

ABN , First Publish Date - 2020-11-26T08:16:11+05:30 IST

ఓ నవజాత శిశువు మృతికి ఇద్దరు స్టాఫ్‌ నర్సుల నిర్లక్ష్యం పరోక్ష కారణమైంది. సకాలంలో ప్రసవం చేయకపోవడం, 108కి ఫోన్‌ చేసినా స్పందించకపోవడం,

స్టాఫ్‌నర్సుల నిర్లక్ష్యంతో శిశువు మృతి

 పురుడు పోయడంలో ఆలస్యం.. 

కల్హేర్‌ పీహెచ్‌లో ఘటన

కల్హేర్‌, నవంబరు 25: ఓ నవజాత శిశువు మృతికి ఇద్దరు స్టాఫ్‌ నర్సుల నిర్లక్ష్యం పరోక్ష కారణమైంది. సకాలంలో ప్రసవం చేయకపోవడం, 108కి ఫోన్‌ చేసినా స్పందించకపోవడం, ఆక్సిజన్‌ అందకపోవడం వెరసి శిశువుకు నిమిషాల్లోనే నూరేళ్లు నిండిపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన కల్హేర్‌ నివాసి కొశ్చరి అనిత పురిటినొప్పులతో మంగళవారం స్థానిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది.


ప్రసవానికి స్టాఫ్‌ నర్సు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో మరో నర్సు వచ్చి.. ‘నీ డ్యూటీ అయిపోయింది. ఇంకా ఇక్కడెందుకున్నావ్‌?’ అని అనడంతో ఆమె వెంటనే వెళ్లిపోయింది. పోనీ ఆ తర్వాత వచ్చిన నర్సు అయినా పట్టించుకున్నదా అంటే అదీ లేదు. ఆలస్యమైతే ఏమవుతుందోనన్న భయంతో అనిత తల్లిదండ్రులు అప్పుడే డ్యూటీకి వచ్చిన స్టాఫ్‌నర్సును కాళ్లావేళ్లా బతిమిలాడారు. అయినా ఆమె పట్టించుకోలేదు. పురుడు పోసేందుకు ప్రయత్నించలేదు. కొంత సేపటికి ఏఎన్‌ఎం బాలమణి వచ్చి అనితకు పురుడు పోశారు. పండంటి మగపిల్లాడు జన్మించాడు.


అయితే ప్రసవం ఆలస్యం కావడంతో శిశువుకు శ్వాస సమస్య వచ్చిందని, వెంటనే మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యసిబ్బంది సూచించారు. ఆక్సిజన్‌ అందుబాటులో ఉంటుందనే తలంపుతో 108 వాహనం కోసం ఫోన్‌ చేస్తే ఎవరూ ఫోన్‌ తీయలేదు. చాలా సేపు ప్రయత్నించిన అనంతరం ప్రైవేటు వాహనంలో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికి ఆక్సిజన్‌ సక్రమంగా అందకపోవడంతో మంగళవారం రాత్రి శిశువు మరణించాడు. దీంతో కుటుంబసభ్యులు పెద్దపెట్టున రోదించారు. శి


శువు మరణానికి కారణంకల్హేర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాఫ్‌నర్సు ఆలస్యం చేయడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గ్రామస్థులతో కలిసి వైద్యసిబ్బందిని నిలదీశారు. ఆందోళన చేశారు. స్టాఫ్‌ నర్సులు డ్యూటీ మారే సమయం కావడంతో ఇబ్బంది తలెత్తిందని కల్హేర్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి నరేందర్‌ తెలిపారు. గర్భంలో ఉండగానే శిశువుకు శ్వాస సమస్య ఉన్నట్టు సిబ్బంది తెలిపారని వివరించారు. 


Updated Date - 2020-11-26T08:16:11+05:30 IST