పారిశుధ్యంపై జనతా కర్ఫ్యూ ప్రభావం
ABN , First Publish Date - 2020-03-23T10:02:18+05:30 IST
హైదరాబాద్ మహానగర పారిశుధ్యంపై జనతా కర్ఫ్యూ తీవ్ర ప్రభావం చూపింది. పారిశుధ్య నిర్వహణ యథావిధిగా కొనసాగుతుందని జీహెచ్‌ఎంసీ

70% కార్మికులు విధులకు గైర్హాజరు.. పేరుకుపోయిన చెత్త
హైదరాబాద్ సిటీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మహానగర పారిశుధ్యంపై జనతా కర్ఫ్యూ తీవ్ర ప్రభావం చూపింది. పారిశుధ్య నిర్వహణ యథావిధిగా కొనసాగుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్ ప్రకటించినా.. కార్మికుల గైర్హాజరుతో పలు ప్రాంతాల్లో పరిసరాలు, రహదారులు అపరిశుభ్రంగా కనిపించాయి. బస్సులు, ఆటోలు, ఇతరత్రా రవాణా సాధనాలు నిలిచిపోవడంతో 70 శాతానికి పైగా కార్మికులు విధులకు హాజరు కాలేదు. గ్రేటర్‌లో 18,550 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఆరువేల లోపు కార్మికులు మాత్రమే ఆదివారం విధులకు హాజరయ్యారని అధికారవర్గాలు తెలిపాయి. దీంతో చాలా ప్రాంతాల్లో చెత్తకుప్పలు పేరుకుపోయాయి. ఇంటింటి చెత్త సేకరణ కూడా బంద్ అయ్యింది.
ఈనెల 31 వరకు జనతా కర్ఫ్యూని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బస్సులు, మెట్రో రైళ్లతోపాటు ఆటోలు, క్యాబ్‌లు కూడా బంద్ కానున్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులు విధులకు హాజరవడం అసాధ్యం. జీహెచ్‌ఎంసీనే కార్మికులకు రవాణా సౌకర్యం కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేకపోతే నగరం మరింత దుర్భరంగా మారే అవకాశం ఉంది.
ఆస్పత్రులూ నిర్మానుష్యం
జనతా కర్ఫ్యూతో హైదరాబాద్‌లోని అన్ని ఆస్పత్రులూ నిర్మానుష్యంగా మారాయి. దవాఖానాల్లో రోగులు, వారి సహాయకులు వార్డుల్లోనే గడిపారు. మందుల దుకాణాలు మూతపడి కనిపించాయి. అత్యవసర మందుల కోసం ఫార్మసీలు అందుబాటులో ఉన్నా.. షట్టర్లు మూసి ఉంచారు. ఉస్మానియా, నిలోఫర్, ప్రసూతి ఆస్పత్రులు, నిమ్స్, ఈఎ్‌సఐ ఆస్పత్రుల్లో ఈ పరిస్థితి కనిపించింది. ఓపీలు కూడా చాలా స్వల్పంగా నమోదైనట్లు సమాచారం. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా రోగుల రద్దీ కనిపించలేదు.