ఆ విద్యార్థికి సీటు ఇవ్వాల్సిందే!
ABN , First Publish Date - 2020-12-29T07:29:18+05:30 IST
విద్యార్థి పోరాటం ఫలించింది. నీట్ పరీక్ష ద్వారా విక్రమ్ సాధించుకున్న మెడికల్ సీటును కళాశాల యాజమాన్యం అకారణంగా తిరస్కరించిందని అటు హైకోర్టు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏకాభిప్రాయానికి వచ్చాయి.
ప్రభుత్వ కళాశాల తప్పునకు విద్యార్థిని బలి చేస్తారా?
ప్రతిమ వైద్య కళాశాల తీరుపై హైకోర్టు అభ్యంతరం
విద్యార్థికి న్యాయం చేయాలని సర్కారు నిర్ణయం
ఆంధ్రజ్యోతి కథనంతో ప్రభుత్వంలో కదలిక
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి పోరాటం ఫలించింది. నీట్ పరీక్ష ద్వారా విక్రమ్ సాధించుకున్న మెడికల్ సీటును కళాశాల యాజమాన్యం అకారణంగా తిరస్కరించిందని అటు హైకోర్టు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏకాభిప్రాయానికి వచ్చాయి. అతని సీటును అతనికి కేటాయించాల్సిందేనని హైకోర్టు ఆదేశించగా, దాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒరిజినల్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌కు ఇవ్వలేదనే కారణంతో ఎంబీబీఎ్‌సలో కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థికి అడ్మిషన్ నిరాకరించడాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ తప్పుపట్టింది.
ఆ విద్యార్థికి కన్వీనర్ కోటాలోనే సీటు ఇవ్వాలని ప్రతిమ వైద్య కళాశాలను ఆదేశించింది. నిర్దేశించిన ఫీజులు చెల్లించి, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చి మంగళవారమే అడ్మిషన్ పొందాలని సూచించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎ్‌స.రామచంద్రరావు, జస్టిస్ టి.అమరనాథ్ గౌడ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. గద్వాల్ జిల్లా, చిన్నతాండ్రపాడుకు చెందిన విక్రమ్‌కు నీట్, ఎంసెట్‌లలో మంచి ర్యాంకులు వచ్చాయి. తొలి విడతలో మెడికల్ సీటు రాకపోవడంతో జగిత్యాలలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలలో ఏజీ బీఎస్సీలో చేరాడు. అయితే... నీట్ రెండో కౌన్సెలింగ్‌లో సీటు వచ్చినట్లు కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కళాశాల నుంచి 22న అర్ధరాత్రి సమాచారం వచ్చింది. 26 లోపు సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని తెలిపారు.
దీంతో డిసెంబరు 23నవిక్రమ్ అగ్రికల్చర్ కళాశాలకు వెళ్లి, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరాడు. సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వలేమంటూ కస్టోడియన్ సర్టిఫికెట్ మాత్రమే ఇచ్చారు. ఆ సర్టిఫికెట్‌నే తీసుకుని విక్రమ్ కరీంనగర్‌లోని ప్రతిమ కళాశాలలో కౌన్సెలింగ్‌కు వెళ్లాడు. కానీ వాళ్లు ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పనిసరి అనిచెప్పి అడ్మిషన్ నిరాకరించారు. దీంతో ఆ విద్యార్థి తండ్రి చిన్నరాజు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదించారు. ఏజీ బీఎస్సీలో అడ్మిషన్ పొందిన విక్రమ్ ఒరిజినల్ సర్టిఫికెట్లకు సంబంధించి కస్టోడియన్ సర్టిఫికెట్ తీసుకెళ్లినా సీటు నిరాకరించడం సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమని హైకోర్టుకు విన్నవించారు. హెల్త్ వర్సిటీ తరపు న్యాయవాది వాదిస్తూ... సకాలంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వని కారణంగా అడ్మిషన్ తిరస్కరించినట్లు తెలిపారు. కన్వీనర్ కోటా సీటును మరో ప్రభుత్వ కాలేజీ నిర్లక్ష్యం వల్ల నిరాకరించడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
మంత్రి ఈటలను కలిసిన విద్యార్థి
కోల్పోయిన సీటునే తిరిగి విక్రమ్‌కు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పేద విద్యార్థి విక్రమ్‌కు జరిగిన అన్యాయంపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. సోమవారం బీఆర్కే భవన్‌లో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డితో మంత్రి ఈటల భేటీఅయ్యారు. ఆ విద్యార్థి కూడా మంత్రిని కలిశారు. యూనివర్సిటీ నోటిఫై చేసిన సీటును పక్కన పెట్టి తదుపరి సీట్లకు కౌన్సెలింగ్ చేపట్టారు. రాష్ట్ర హైకోర్టు కూడా సానుకూల ఆదేశాలు ఇచ్చినందున సీటును విక్రమ్‌కు ఇవ్వడానికి న్యాయపరమైన చిక్కులు ఎదురుకావని అధికారులు చెబుతున్నారు.