వివాదాన్ని పరిష్కరిస్తానని.. భూమిని లాక్కున్నాడు

ABN , First Publish Date - 2020-10-07T08:23:29+05:30 IST

తన భూమి వివాదంలో ఉందని, పరిష్కారానికి సహాయం చేయాలని కోరిన వ్యక్తిని.. తుపాకీతో బెదిరించి మొత్తం భూమినీ తన

వివాదాన్ని పరిష్కరిస్తానని.. భూమిని లాక్కున్నాడు

 ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే కుమారుడి దౌర్జన్యం.. కేసు


బంజారాహిల్స్‌, అక్టోంబరు 6(ఆంధ్రజ్యోతి): తన భూమి వివాదంలో ఉందని, పరిష్కారానికి సహాయం చేయాలని కోరిన వ్యక్తిని.. తుపాకీతో బెదిరించి మొత్తం భూమినీ తన పేరిట రాయించుకున్నాడు ఏపీలోని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి కుమారుడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు.


బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌ కాలనీకి చెందిన వ్యాపారి శివగణే్‌షకు ప్రొద్దుటూరులో ఉన్న 2.5 ఎకరాల భూమి వివాదంలో చిక్కుకుంది. దీంతో వరదరాజులురెడ్డి సమీప బంధువు రామచంద్రారెడ్డి వద్దకు వెళ్లగా.. అతడు వరదరాజులురెడ్డి కుమారుడు కొండారెడ్డిని పరిచయం చేశాడు. వివాదం పరిష్కరించేందుకు తన పేరిట ఎకరం భూమి రాయాలని కొండారెడ్డి షరతు విధించగా శివగణేష్‌ అంగీకరించాడు. అయితే మొత్తం భూమిని తన పేరిటే రాయాలంటూ కొండారెడ్డి ఒత్తిడి తెస్తున్నాడు.


సెప్టెంబరు 26న అనుచరులతో శ్రీనగర్‌కాలనీకి వచ్చి.. శివగణే్‌షను తుపాకీతో బెదిరించి వెళ్లాడు. మంగళ వారం కొండారెడ్డి, రామచంద్రారెడ్డి అనుచరులతో కలిసి వచ్చి ఎకరం స్థలం రిజిస్టర్‌ చేస్తే చాలునంటూ నమ్మించి.. రెండున్నర ఎకరాలు రాయించుకున్నారు. దీంతో శివగణేష్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొండారెడ్డి, రామచంద్రారెడ్డితో పాటు 15 మందిపై కేసులు నమోదు చేశారు.


Read more