2కోట్ల సహాయానికి ధన్యవాదాలు

ABN , First Publish Date - 2020-09-14T09:31:00+05:30 IST

2కోట్ల సహాయానికి ధన్యవాదాలు

2కోట్ల సహాయానికి ధన్యవాదాలు

  • జర్నలిస్టులకూ 25కోట్లు విడుదల చేయాలి 
  • రూ.20లక్షల బీమా వర్తింపజేయాలి 
  • టీయూడబ్ల్యుజే రాష్ట్ర కార్యవర్గం తీర్మానం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కరోనా బారిన పడిన సుమారు వెయ్యి మంది జర్నలిస్టులను ఆదుకునేందుకు ఇప్పటికే దాదాపు రూ.2కోట్లు వెచ్చించినందుకు, కరోనా బారిన పడి ఆర్థికంగా చితికిపోయిన జర్నలిస్టులకు రూ.20వేలు అందిస్తున్నందుకు.. సీఎం కేసీఆర్‌కి, మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణకు తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలి్‌స్ట(టీయూడబ్ల్యుజే) రాష్ట్ర కార్యవర్గ సమావేశం కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించింది. జర్నలిస్టులను ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా గుర్తించి రూ.20లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరింది. తక్షణ సహాయం కింద న్యాయవాదులకు  కేటాయించినట్టుగా రూ.25 కోట్లను జర్నలిస్టుల సంక్షేమానికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆ సంఘ అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షతన ఆన్‌లైన్‌ ద్వారా ఆదివారం జరిగింది.


ఇప్పటికే జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడి అనేక ఇబ్బందులు పడుతున్నారని సమావేశంలో పాల్గొన్నవారు ఆవేదన చెందారు. రూ.20లక్షల బీమా సౌకర్యం ఉంటే మృత్యువాత పడిన జర్నలిస్టుల కుటుంబాలకు కొంత ఊరట కలుగుతుందని  అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిన సీఎం కేసీఆర్‌.. జర్నలిస్టు సమాజానికి ఇచ్చిన సొంత ఇంటి కల హామీని నెరవేర్చాలని సమావేశంలో తీర్మానించారు. జర్నలిస్టు హెల్త్‌ కార్డులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చెల్లుబాటయ్యే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు.  ఇటీవల మృతి చెందిన సీనియర్‌ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు రామలింగారెడ్డి, తెలంగాణ వీడియో జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్‌తో పాటు పలువురు జర్నలిస్టులకు నివాళులర్పిస్తూ సంతాప తీర్మానాన్ని ఆమోదించారు.  

Updated Date - 2020-09-14T09:31:00+05:30 IST