పరీక్షలు.. కేసులు.. తగ్గాయ్‌

ABN , First Publish Date - 2020-09-01T08:42:15+05:30 IST

ఎప్పటిలానే.. రాష్ట్రంలో ఆదివారం కరోనా పరీక్షల సంఖ్య సగానికి తగ్గింది. వారం నుంచి రోజూ 60 వేల పైగా టెస్టులు

పరీక్షలు.. కేసులు.. తగ్గాయ్‌

  • మరో 1,873 కేసులు.. 9 మంది మృతి
  • ఖమ్మంలో కోలుకున్న వ్యక్తికి మళ్లీ పాజిటివ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ఎప్పటిలానే.. రాష్ట్రంలో ఆదివారం కరోనా పరీక్షల సంఖ్య సగానికి తగ్గింది. వారం నుంచి రోజూ 60 వేల పైగా టెస్టులు చేస్తుండగా, ఆదివారం 37,791 పరీక్షలతో సరిపెట్టారు. దీనికితగ్గట్లే కేసులు తగ్గాయి. క్రితం రోజు వరకు దాదాపు 3 వేలు నమోదైన పాజిటివ్‌లు.. తాజాగా 1,873కి తగ్గాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 360, కరీంనగర్‌లో 180, ఖమ్మంలో 103, రంగారెడ్డిలో 129, సిద్దిపేటలో 85, వరంగల్‌ అర్బన్‌, నిజామాబాద్‌లో 94 కేసులు నమోదయ్యాయి. వైర్‌సతో మరో 9 మంది మృతి చెందారు. కాగా.. రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,24,963కు చేరింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 92,837కు, మరణాలు 827కు చేరాయి.


రెండోసారి పాజిటివ్‌

ఖమ్మంలో కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ పాజిటివ్‌ వచ్చింది. ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఇతడు.. రెండు నెలల క్రితం వైర్‌సకు గురయ్యాడు. క్వారంటైన్‌ పూర్తిచేసుకుని నెగెటివ్‌ రావడంతో తిరిగి విధుల్లో చేరాడు. మూడు రోజులుగా జ్వరం వస్తుండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. పాజిటివ్‌ అని తేలింది. మొత్తం 39 రోజుల వ్యవధిలోనే  పాజిటివ్‌ రావడం వైద్యవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


అంత్యక్రియలకు అయినవారూ దూరం

జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రాఘవపేట గ్రామానికి చెందిన ఓ మహిళకు పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయం తెలిసి ఆమె భర్త గుండెపోటుకు గురయ్యాడు. అయితే, అతడికీ కరోనా సోకిందనే అనుమానంతో అంత్యక్రియలకు ఎవరూ ముందుకురాలేదు. కోరుట్లలోని ఆల్‌ ఇండియా మానవత్వ సందేశ సమితి సభ్యులు అంత్యక్రియలను నిర్వహించారు.


3 రోజులు మగ్గిపోయి

ఖమ్మం జిల్లా మధిర మండలం చిలుకూరు గ్రామంలో సోమవారం కరోనా లక్షణాలతో ఓ వృద్ధురాలు(81) మృతి చెందింది. ఈమె ఇద్దరు కుమారులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. గ్రామంలోని ఇంట్లో ఆమె ఒక్కరే నివసిస్తున్నారు. మూడు రోజుల క్రితం పాజిటివ్‌ అని తేలింది. ఊళ్లోనే ఉన్న మరో కూతురు, అల్లుడికి కరోనా సోకవడంతో ఇంటికి పరిమితమయ్యారు. దీంతో వృద్ధురాలిని ఎవరూ చూడలేదు. భోజనం కూడా అందలేదు. చివరకు సోమవారం మంచంలోనే ప్రాణాలొదిలింది. అన్నం ఫౌండేషన్‌ సభ్యులు, రూరల్‌ ఎస్‌ఐ లవణకుమార్‌ దహనసంస్కారాలు నిర్వహించారు.


హైదరాబాద్‌లో పెరిగి.. తగ్గి.. 

ఆగస్టు నెలలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 12,599 మందికి వైరస్‌ సోకింది. జూలై (26,082)తో పోలిస్తే ఇది సగానికి సగమే. మార్చిలో 74 మందికి, ఏప్రిల్‌లో 527, మేలో 1,105, జూన్‌లో 11,080 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఆగస్టు మొదటి వారంలో విజృంభించినప్పటికీ రెండు, మూడో వారానికి వచ్చేసరికి ఉధృతి తగ్గింది. నాలుగోవారం నుంచి కేసులు పెరగడం కలవరపెడుతోంది.

Updated Date - 2020-09-01T08:42:15+05:30 IST