ప్రైవేటు ల్యాబుల్లో శక్తికి మించి పరీక్షలు

ABN , First Publish Date - 2020-07-05T07:19:58+05:30 IST

ప్రైవేటు ల్యాబులు తమ సామర్థ్యానికి మించి పరీక్షలు చేస్తున్నాయని, ఇదెలా సాధ్యం అవుతుందో తమకు అర్థం కావడం లేదని ప్రజారోగ్య

ప్రైవేటు ల్యాబుల్లో శక్తికి మించి పరీక్షలు

  • ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ఫలితాలు
  •  ఒక ల్యాబులో 72 శాతం పాజిటివ్‌లు 
  • తప్పు చేసే ల్యాబులపై ఇక కఠిన చర్యలు
  • ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు
  • మా ల్యాబ్‌లో పాజిటివ్‌లు 37 శాతం లోపే!
  • విజయా డయాగ్నస్టిక్‌ ఎండీ సుప్రితారెడ్డి
  • సేవలు అవసరమని నోటీ్‌సతో వదిలేశాం
  •  వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి 

హైదరాబాద్‌, జులై 4 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ల్యాబులు తమ సామర్థ్యానికి మించి పరీక్షలు చేస్తున్నాయని, ఇదెలా సాధ్యం అవుతుందో తమకు అర్థం కావడం లేదని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు అన్నారు. సామర్థ్యానికి మించి పరీక్షలు చేయడం వల్ల వైరస్‌ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ఫలితం వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. శనివారం కోఠిలోని కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయంలో వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు ల్యాబులు చాలా తప్పులు చేస్తున్నప్పటికీ క్లిష్టకాలంలో వాటి సేవలను ప్రజలకు దూరం చేయొద్దన్న ఉద్దేశంతోనే వాటిపై చర్యలు తీసుకోలేదని చెప్పారు. మొత్తం 13 ప్రైవేటు ల్యాబుల్లో అసాధారణంగా కొవిడ్‌ పరీక్షల ఫలితాలు వచ్చాయన్నారు.


హిమాయత్‌నగర్‌లోని ఓ ల్యాబులో టెస్టు చేసుకున్న వారిలో 72 శాతం మందికి పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. మరే ల్యాబులోనూ పాజిటివ్‌ రేటు ఇంత ఎక్కువగా లేదన్నారు. అందుకే ఆ ల్యాబులో వచ్చిన పాజిటివ్‌ వచ్చిన 2672 కేసుల ఫలితాలను ప్రకటించకుండా పక్కనబెట్టామని చెప్పారు. నిపుణుల కమిటీ వాటిని పరిశీలిస్తోందన్నారు. తప్పు చేసిన ల్యాబులకు నోటీసులు  ఇవ్వడంతో మిగతా ల్యాబులు అవసరమైన మార్పులు చేసుకున్నాయని తెలిపారు. ఇకపై తప్పులు కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా సేవల కోసం ఎన్ని పడకలను కేటాయించారో తమ వద్ద  సమాచారం లేదని శ్రీనివాసరావు తెలిపారు. రోగులు ఫోన్లు వాడేందుకు ప్రైవేటు ఆసుపత్రుల్లో అనుమతించడం లేదని, లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని అన్నారు. రోగులు ఒంటరిగా కుంగిపోకుండా ఉండేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫోన్లు అనుమతిస్తున్నామని చెప్పారు. ఒకరిద్దరు పంపించే వీడియోలను  సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి, ప్రజల్లో భయాందోళనలను సృష్టించొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వస్తే ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. ఎంత మందికైనా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులను సిద్ధం చేశామని చెప్పారు. ఏదైనా అవసరమైతే 104, 108 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


లాక్‌డౌన్‌ సడలింపుల వల్ల గత నెలలో 13,534 కేసులు నమోదయ్యాయని తెలిపారు. కేసులు ఇలాగే పెరుగుతాయని, అందుకు మనం సిద్ధంగా ఉండాలని చెప్పారు. కరోనాను ప్రభుత్వం సృష్టించలేదని, ప్రభుత్వం మాత్రమే దాన్ని నియంత్రించడం సాధ్యం కాదని అన్నారు. ప్రభుత్వం తన వంతు బాధ్యత నిర్వర్తిస్తోందని, ప్రజల్లోనే చాలామంది భౌతికదూరం పాటించడం లేదని, మాస్కులు ధరించడం లేదని వ్యాఖ్యానించారు. ఇకనైనా అందరూ జాగ్రత్తలు వహించడం ద్వారా మళ్లీ లాక్‌డౌన్‌ విధించే పరిస్థితిని తెచ్చుకోకుండా ఉండాలన్నారు. ప్రపంచంలో కరోనా కన్నా ఆకలితోనే ఎక్కువ మంది చనిపోతున్నారని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. కరోనా విషయంలో ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని, మరణాలు, కేసులు అన్నీ ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పరీక్షల సామర్థం కూడా రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు. కరోనా భయంకరమైనది కాదని, ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని డీహెచ్‌ అన్నారు.


ఢిల్లీ తర్వాత అత్యధిక హోమ్‌ ఐసోలేషన్‌ ఇక్కడే

దేశ రాజధాని ఢిల్లీ తర్వాత అత్యధిక మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నది మన రాష్ట్రంలోనేనని శ్రీనివాసరావు తెలిపారు. గత నెల రోజుల్లో 12 వేలమంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందారన్నారు. ప్రస్తుతం 6556 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని వెల్లడించారు. అవసరమైన వారికి టెలీమెడిసిన్‌, వీడియోకాల్‌ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.


పడకలు అందుబాటులో ఉన్నాయి

రాష్ట్రంలో కోవిడ్‌ ఆస్పత్రుల్లో 2501 పడకలు ఉండగా, అందులో ప్రస్తుతం 1034 పడకల మీద మాత్రమే రోగులు చికిత్స పొందుతున్నారని శ్రీనివాసరావు చెప్పారు. అన్‌లాక్‌ వల్ల కేసులు బాగా పెరుగుతున్నాయని, జూన్‌ మొదటివారంలో 938, రెండో వారంలో 1015, మూడో వారంలో 3481, నాల్గో వారంలో 7461 కేసులు వచ్చాయని వివరించారు. ఇతర వ్యాధుల ఉన్న వారిలోనే మరణాలు ఎక్కువగా ఉన్నాయని శ్రీనివాసరావు వివరించారు. ప్రస్తుతం రోజూ 13 ల్యాబ్‌ల ద్వారా 6,500 పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. మరో ఐదు ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.  


పాజిటివ్‌లు మాత్రమే గాంధీకి: డీఎంఈ రమేశ్‌ రెడ్డి

కరోనా పాజిటివ్‌ వ్యక్తులు మాత్రమే గాంధీ ఆసుపత్రికి రావాలని రావాలని డీఎంఈ రమేశ్‌రెడ్డి ప్రజలకు సూచించారు. ప్రస్తుతం గాంధీలో 812 మంది రోగులు చికిత్స పొందుతున్నారని, కేవలం ఏడుగురు మాత్రమే వెంటిలేటర్‌పై ఉన్నారని వివరించారు. వెయ్యి పడకలకు పైగా ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు కింగ్‌ కోఠిఆసుపత్రికి వెళ్లాలని, అక్కడ 350 బెడ్లు సిద్థం చేశామని వివరించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులు 24 గంటలూ తెరిచే ఉంటాయని, పడకలు లేవని వెనక్కి పంపించే ప్రసక్తే ఉండదని చెప్పారు. 

Updated Date - 2020-07-05T07:19:58+05:30 IST