పది, ఇంటర్‌ సంగతేంటి?

ABN , First Publish Date - 2020-12-13T07:31:45+05:30 IST

ఏటా పదోతరగతి సిలబస్‌ డిసెంబరులో పూర్తవుతుంది.. ఈసారి ఆన్‌లైన్‌ తరగతుల్లో మాత్రం సగం కూడా పూర్తవలేదు.. ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరాల సిలబస్‌ జనవరి ప్రారంభంలో పూర్తవుతుంది.

పది, ఇంటర్‌ సంగతేంటి?

ఆన్‌లైన్‌ విద్యపై విద్యార్థుల అనాసక్తి ..

తరగతుల ప్రారంభంపై అస్పష్టత..వార్షిక పరీక్షలపైన కూడా

 ఇంతవరకు ఒక్క పరీక్ష కూడా నిర్వహించలేదు 

 విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన 

హైదరాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఏటా పదోతరగతి సిలబస్‌ డిసెంబరులో పూర్తవుతుంది.. ఈసారి ఆన్‌లైన్‌ తరగతుల్లో మాత్రం సగం కూడా పూర్తవలేదు.. ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరాల సిలబస్‌ జనవరి ప్రారంభంలో పూర్తవుతుంది. ద్వితీయ సంవత్సరం సిలబ్‌సలో 30 శాతం తొలగిస్తామని చేసిన ప్రకటనపై ఇంతవరకు స్పష్టత లేకపోగా.. మొదటి సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ ఇంకా ముగియనేలేదు.. ఇలాంటి పరిస్థితుల్లో మార్చిలో వార్షిక పరీక్షలు ఉంటాయా..? వాయిదా వేస్తారా..? అన్న అనుమానాలు నెలకొన్నాయి.


ఒకవేళ పరీక్షలు నిర్వహించినా... విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని ఎలా అంచనా వేస్తారన్న అంశంపైనా ఇంతవరకు స్పష్టత లేకుండాపోయింది. ఈ పరిణామాలు విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.  ఏటా విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే అకడమిక్‌ క్యాలెండరును విడుదల చేస్తారు. ఎస్‌ఏ, ఎఫ్‌ఏ పరీక్షలతోపాటు సిలబస్‌ పూర్తిచేసే గడువు, ప్రీఫైనల్‌, ఫైనల్‌ పరీక్షల తేదీలను ముందే ప్రకటిస్తారు. పాఠశాలల్లో దీని ప్రకారం తరగతులు నిర్వహిస్తారు.


కానీ ఈసారి డిసెంబరు వచ్చినా ఇంతవరకు ఎఫ్‌ఏ, ఎస్‌ఏ పరీక్షలు కనీసం ఒక్కటి కూడా జరగలేదు.  ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమై నాలుగు నెలలు కావస్తున్నా.. వాటిపై విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. తరగతి గదిలోనే అంతంతమాత్రంగా నేర్చుకునే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు.. ఆన్‌లైన్‌ పాఠాలు అర్ధం కావడం లేదంటున్నారు. 


ఈసారి ప్రత్యేక తరగతులు దూరం.. 

పాఠశాల విద్యలో పదోతరగతి అత్యంత కీలకం. 9వ తరగతి వరకు చదువులు ఎలా ఉన్నా.. దీనిపై విద్యాశాఖ ఏటా ప్రత్యేక దృష్టి సారిస్తుంది. దసరా సెలవుల తర్వాత నుంచి ఫిబ్రవరిలో జరిగే ప్రీఫైనల్‌ పరీక్షల వరకు ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక కార్యచరణను అమలుచేస్తారు.

ప్రతిరోజు రెగ్యులర్‌ తరగతులతోపాటు ఉదయం, సాయంత్రం, ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తారు. చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి ఉపాధ్యాయులు వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఈ విధానంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతంతోపాటు 10/10 గ్రేడ్‌ సాఽధించే విద్యార్థుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. కానీ, ఈసారి ప్రత్యేక తరగతుల ఊసే లేకుండా పోయింది.


30% కోత ఉన్నట్టా.. లేనట్టా..? 

పాఠశాల విద్యతోపాటు ఇంటర్‌లోనూ అనేక అనుమానాలు నెలకొన్నాయి. 11, 12 తరగతుల  సిలబ్‌సను 30శాతం సీబీఎ్‌సఈ తగ్గించడంతో రాష్ట్రంలో ఇంటర్‌ బోర్డు కూడా అలాంటి నిర్ణయాన్నే ప్రకటించింది. అయితే తొలగించాల్సిన 30శాతం సిలబ్‌సపై నేటికీ స్పష్టత ఇవ్వలేకపోయింది.

ఈసారి వార్షిక పరీక్షలకు మొత్తం సిలబ్‌సను పరిగణనలోకి తీసుకుంటారా...లేదా 70 శాతం సిలబస్‌ ఉంటుందా..అన్న అంశంపై విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ముఖ్యంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జేఈఈ, నీట్‌ పరీక్షలకు హాజరవ్వాల్సి ఉండటంతో ఈ సమస్య వారికి మరింతగా ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, పది, ఇంటర్‌ వార్షిక పరీక్షల నిర్వహణపై ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు. కాగా, అన్‌లైన్‌ తరగతుల ఆధారంగా పరీక్షలు నిర్వహించడం సరికాదన్న అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2020-12-13T07:31:45+05:30 IST