పాఠ్య పుస్తకాల పంపిణీపై టెన్షన్‌!

ABN , First Publish Date - 2020-07-22T08:51:00+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాల పంపిణీపై ఉపాధ్యాయులు,

పాఠ్య పుస్తకాల పంపిణీపై టెన్షన్‌!

హైదరాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాల పంపిణీపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఈ నెల 22 నుంచి 25 వరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని విద్యాశాఖ కమిషనర్‌ ఈ నెల 17న ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. కరోనాతో పాఠశాలల మూత నేపథ్యంలో అక్కడ చదివే విద్యార్థులు ఇంటి వద్ద ఉండి పుస్తకాలు చదువుకుంటారని ప్రభుత్వం యోచించింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లేదా ఎమ్మెల్యే లేదా జడ్పీటీసీలను భాగస్వాములను చేయాలని, పాఠశాలల మేనేజ్‌మెంట్‌ కమిటీల సమక్షంలో అందించాలని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను జమ చేయడం, దానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం, ఫలితంగా వారి వెంట అనుచరగణం రావడం వైర్‌సను వ్యాప్తి చేయడమేనన్న ఆందోళనను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.


అందరి సమక్షంలో అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సైతం వ్యతిరేకిస్తున్నారు. ‘ఈ సమయంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్న నిబంధన సరి కాదు, స్థానిక విద్యాకమిటీ చైర్మన్‌ లేదా గ్రామ సర్పంచ్‌ను ఆహ్వానిస్తే సరిపోతుంది. వచ్చినవారు కూడా అనుచరగణం లేకుండా భౌతిక దూరం పాటించాలి. ఒక్కోరోజు ఒక్కో తరగతి చొప్పున పుస్తకాలు పంచితే కరోనా బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-22T08:51:00+05:30 IST