రాముడి దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2020-10-27T09:37:09+05:30 IST

దసరా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి సిద్దిపేట జిల్లా నంగునూరులో కొందరు యువకులు శ్రీరాముడి దిష్టిబొమ్మను దహనం చేయడం ఉద్రిక్తతకు

రాముడి దిష్టిబొమ్మ దహనం

సిద్దిపేట జిల్లా నంగునూరులో ఉద్రిక్తత.. కేసు నమోదు


నంగునూరు, అక్టోబరు 26: దసరా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి సిద్దిపేట జిల్లా నంగునూరులో కొందరు యువకులు శ్రీరాముడి దిష్టిబొమ్మను దహనం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో నిందితులను అరెస్టు చేయాలంటూ హిందూ సంఘాల నాయకులు సోమవారం ఆందోళన కు దిగారు. దుకాణాలను మూసివేసి అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట ధర్నా చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సంఘీభావం తెలిపేందుకు వస్తున్నవారిని అడ్డుకునేందుకు శివార్లలో బందోబస్తు ఏర్పాటు చేశారు.


అప్పటికీ దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు అమరప్రసాద్‌, హిందూ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లలిత్‌కుమార్‌, బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు డి. శ్రీకాంత్‌రెడ్డి, వీహెచ్‌పీ జిల్లా నాయకులు అల్లం దుర్గాప్రసాద్‌, విద్యాసాగర్‌రెడ్డి తదితరులు ధర్నాకు హాజరయ్యారు. రోడ్డుపై బైఠాయించారు. మరో వైపు సిద్దిపేట రూరల్‌, టూటౌన్‌ సీఐలు సురేందర్‌రెడ్డి, పరశురాం ఆందోళనకారులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. 14 మందిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని సీఐ తెలిపారు. అనంతరం హిందూ సంఘాల నాయకులు అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూల మాలలు వేశారు. దిష్టిబొమ్మను దహనం చేసిన స్థలంలోనే శ్రీరాముడి చిత్రపటానికి అభిషేకం చేశారు.

Updated Date - 2020-10-27T09:37:09+05:30 IST