తొందరొద్దు

ABN , First Publish Date - 2020-09-14T08:36:12+05:30 IST

మహిమాన్వితమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సన్నిధిని ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. గొప్ప కట్టడంగా చరిత్రలో

తొందరొద్దు

  • ఆగమశాస్త్ర ప్రకారమే నిర్మాణాలు
  • ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడాలి
  • స్వామివారికి సేవలు, పూజలు..
  • భక్తులకు సదుపాయాలకు పెద్దపీట 
  • ఒకేసారి 4 వేల మంది వ్రతాలు 
  • చేసుకునేలా ఏర్పాట్లు ఉండాలి
  • 5 వేల కార్లు, 10 వేల బైక్‌లకు పార్కింగ్‌
  • టెంపుల్‌సిటీలో 365 కాటేజీల నిర్మాణం
  • 3 వారాల్లో 75 కోట్లు విడుదలకు ఆదేశం
  • యాదాద్రి ఆలయ సందర్శనలో కేసీఆర్‌ 
  • ఆరు గంటలపాటు పనుల పరిశీలన 
  • కోతులకు అరటిపండ్లు అందించిన సీఎం


యాదాద్రి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మహిమాన్వితమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సన్నిధిని ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. గొప్ప కట్టడంగా చరిత్రలో నిలిచిపోనున్న ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా తొందర, తొట్రుపాటు వద్దని తెలిపారు. ఆగమ శాస్త్ర నియమాలు, సంప్రదాయాలను పాటిస్తూ నిర్మాణాలు చేపట్టాలని స్పష్టం చేశారు. స్వామివారికి సేవలు, పూజలు; భక్తులకు వసతి, సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలయ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లను తొలగించాలన్నారు. అభివృద్ధి పనులకు మూడు వారాల్లో రూ.75 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శిని ఆదేశించారు. అంతర్జాతీయ ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ ఆదివారం సందర్శించారు.


బాలాలయంలో ఆయనకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం చతుర్వేద మహదాశీర్వచనం చేశారు. స్వామివారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన యాదాద్రి కొండపై ప్రధానాలయాన్ని సందర్శించి దాదాపు గంటన్నర పాటు ప్రతి అంశాన్ని పరిశీలించారు. ప్రధానాలయ మండపంలోని క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం, ఉప ఆలయాలను పరిశీలించిన అనంతరం గర్భాలయ ద్వారంపై అమర్చిన ప్రహ్లాద చరితం, పంచనరసింహులను తిలకించారు. గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా మండపంలో క్యూలైన్ల ఏర్పాటును పరిశీలించి, మూడు వరుసలను రెండుకు కుదించాలని సూచించారు. అనంతరం ఆలయ నిర్మాణ పూర్తి స్వరూపంపై రూపొందించిన యానిమేషన్‌ లఘుచిత్రాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా అధికారులు సీఎంకు వివరించారు. ఆలయ మెట్లను పరిశీలించిన సీఎం.. ఈశాన్య దిశగా మెట్ల ఎత్తుపై అధికారులను అడిగి తెలుసుకుని ఆగమ శాస్త్ర ప్రకారమే నిర్మాణాలు ఉండాలని సూచించారు.


కొండపై శివాలయ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసినందుకు అధికారులు, స్తపతులను అభినందించారు. అదేవిధంగా యాదాద్రి ప్రధానాలయ రాతి శిలా నిర్మాణాలను తాను అనుకున్నవిధంగా అద్భుతంగా పూర్తి చేస్తున్నందుకు శిల్పులను అభినందించడమే కాకుండా వారిని పిలిపించుకుని ప్రత్యేకంగా ఫొటోలు సైతం దిగారు. యాదాద్రి సన్నిధి సత్యనారాయణ స్వామి వ్రతాలకు ప్రసిద్ధమైనందున ఒకేసారి నాలుగు వేల మంది వ్రతాలు చేసుకునేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అనంతరం కొండ కింద రింగురోడ్డు, గండిచెరువు, ప్రెసిడెన్షియల్‌ సూట్‌ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. యాదాద్రి ఆలయానికి రింగు రోడ్డును మణిహారంలా తీర్చిదిద్దాలన్నారు. పచ్చని చెట్లు, సెంట్రల్‌ లైటింగ్‌, వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌లతో రింగ్‌ రోడ్డు యాత్రికులకు ఆహ్లాదం కలిగించేలా అత్యంత సుందరంగా నిర్మించాలని సూచించారు. ఆలయానికి ఎంత మంది భక్తులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు. గండిచెరువును రెండు నెలలకోసారి కాళేశ్వరం జలాలతో నింపాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు వసతి సదుపాయాల కల్పనకు టెంపుల్‌ సిటీలో 365 కాటేజీల నిర్మాణాలను వెంటనే చేపట్టి వేగంగా పూర్తి చేయాలని కోరారు. మరో 200 ఎకరాల్లో లేఅవుట్‌ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కల్యాణ కట్ట, బస్టాండ్‌, పుష్కరిణి, రహదారుల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. 


మండపాల్లో తంజావూరు చిత్రాలు

అపురూప చిత్రకళా నైపుణ్యానికి ప్రసిద్ధిగాంచిన తంజావూరు చిత్రాలను యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. యాదాద్రి ప్రధానాలయ ముఖ మండపంలో తంజావూరు చిత్ర కళాకారులు రూపొందించిన లక్ష్మీనరసింహుల పరిణయ ఘట్టం చిత్రాన్ని చూసి కేసీఆర్‌ మంత్రముగ్ధులయ్యారు. ఇలాంటి చిత్రాలతో లక్ష్మీనరసింహుడి అవతార ఘట్టాలను ఆలయ ప్రాకార మండపాల్లో ఏర్పాటు చేయాలని అధికారులకు  సూచించారు.


బస్టాండ్‌ నుంచి గుడి వరకు ఉచిత బస్సు

భక్తులకు బస్టాండ్‌ నుంచి గుడి వరకు ఉచిత బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ అధికారులకు సూచించారు. 5వేల కార్లు, 10వేల బైక్‌లు నిలపడానికి పార్కింగ్‌ స్థలం సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆలయ రాజగోపురం, ద్వారాలకు బంగారుతాపడం పనులకు పెంబర్తి స్వర్ణ కళాకారులను పిలిపించాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రిలో దాదాపు ఆరు గంటల పాటు పర్యటించిన కేసీఆర్‌.. కొండపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎంపీ సంతో్‌షకుమార్‌, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, యాదాద్రి జడ్పీ చైర్మన్‌ సందీ్‌పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



కోతులకు అరటిపండ్లు ఇచ్చిన ముఖ్యమంత్రి

యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్‌ ఆదివారం అత్యంత విశిష్ట తిఽథి, షడ్గ్రహ కూటమి కావడంతో స్వయంగా కోతులకు అరటి పండ్లను ఇచ్చారు. యాదాద్రి కొండ ఘాట్‌రోడ్డు దిగుతుండగా కనిపించిన కోతుల సమూహం వద్ద ఆగి అరటి పండ్లను అందించారు.

Updated Date - 2020-09-14T08:36:12+05:30 IST