గుడి కూలింది... సర్కారూ కూలబోతోంది : బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్ రావు

ABN , First Publish Date - 2020-07-11T03:53:05+05:30 IST

సచివాలయాన్ని కూలగొట్టే క్రమంలో నల్లపోచమ్మ గుడిని కూడా కూలగొట్టారని, అలా కూలగొట్టారంటే కేసీఆర్ ప్రభుత్వానికి దినం దగ్గరపడినట్లేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు హెచ్చరించారు. తొందర్లోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్ సర్కారుకు దినాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గుడిని కావాలనే కూలగొట్టి, పొరపాటుగా కూలిపోయిందంటూ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. నల్లగొండ, మహబూబునగర్ జిల్లాల వర్చువల్ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గుడి కూలింది... సర్కారూ కూలబోతోంది : బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్ రావు

మహబూబ్‌నగర్ : సచివాలయాన్ని కూలగొట్టే క్రమంలో నల్లపోచమ్మ గుడిని కూడా కూలగొట్టారని, అలా కూలగొట్టారంటే కేసీఆర్ ప్రభుత్వానికి దినం దగ్గరపడినట్లేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు హెచ్చరించారు. తొందర్లోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్ సర్కారుకు దినాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గుడిని కావాలనే కూలగొట్టి, పొరపాటుగా కూలిపోయిందంటూ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. నల్లగొండ, మహబూబునగర్ జిల్లాల వర్చువల్ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


నల్ల పోచమ్మ గుడి కూలిపోయిందంటే.. టీఆర్‌ఎస్ సర్కార్ కూడా కూలిపోబోతోందని మురళీధర్ రావు ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను ఎన్నుకున్నది గుడిని కూలగొట్ట‌డానికి కాదని వ్యాఖ్యానించారు. అసలుసిసలైన హిందువు తానేనంటూ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రకటించుకున్నారని, కానీ నేడు.. ఆయన గుడి మనిషి కాదని తేటతెల్లమైపోయిందని మురళీధర్ రావు స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణలో కరోనా బాధితులకు సరైన సౌకర్యాలు కూడా లభించడం లేదని ఆరోపించారు. రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ దొరకడం లేదని విమర్శించారు. 


ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే చాలామంది ప్రాణాలను కోల్పోయారని విమర్శించారు.హైదరాబాద్ ఓ ఐటీ హబ్‌గా వెలుగొందుతోందని, అయినా సరే... ఇంటిగ్రేటెడ్ డ్యాష్ బోర్డ్ లేదని, ఏ ఆస్పత్రిల్లోనూ బెడ్స్‌ లేవని విమర్శించారు.  ఇవన్నీ ముందుండి సమీక్షించే, ముందుండి నడిపించే వ్యక్తి తెలంగాణకు కావాలని, కేవలం తుపాకీ దెబ్బలు కొట్టినట్లు మాట్లాడిపోయే ముఖ్యమంత్రితో తెలంగాణ పైకి రాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రచారంతో పని కాదని, ముందుండి పనిచేయాల్సిన అవసరముందని టీఆర్‌ఎస్ సర్కార్‌పై మండిపడ్డారు. ఇలాంటి వాతావరణం లేని కారణంగానే తెలంగాణ ప్రజలు భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడుతున్నారన్నారు. 


ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో 24 గంటలూ ప్రజలతో ఉండాల్సిన ముఖ్యమంత్రి ఉన్నట్టుండి గాయబ్ అయ్యారని దుయ్యబట్టారు. గాయబ్ గురించి అడిగితే అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. రూ. 20 లక్షల కోట్లు ప్రధాని మోదీ ప్రకటిస్తే... దాన్ని కూడా కేసీఆర్ విమర్శించారని మండిపడ్డారు. తొందర్లోనే కేసీఆర్ నిజ స్వరూపాన్ని ప్రజలముందుంచుతామని ఆయన హెచ్చరించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలను కూడా టీఆర్‌ఎస్ సర్కార్ తుంగలో తొక్కిందని ఫైరయ్యారు. బీజేపీ కాంట్రాక్టర్ల పార్టీ కాదని, కమిషన్ల పార్టీ అంతకంటే కాదని, కేసీఆర్‌ను 24 గంటలూ అగ్గిమీద నిలబెడతామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. 


రానురాను... కరోనా ముందు, కరోనా తర్వాత అన్నదిగా ప్రపంచం మారిపోతుందని ప్రధాని పేర్కొన్నారని, ఈ విషయం సీఎం కేసీఆర్‌కు అర్థం కాలేదేమోనని ఎద్దేవా చేశారు. కరోనా ప్రభావాన్ని ముందే పసిగట్టిన మోదీ... అత్యంత సాహసోపేతంగా లాక్‌డౌన్‌ను విధించారన్నారు. నరేంద్ర మోదీ ఏ పిలుపు ఇచ్చినా... అందరూ స్పందించారని తెలిపారు. దేశం సరిగ్గా ఉంటేనే పార్టీలకు భవిష్యత్తు ఉంటుందని, దేశమే లేకపోతే పార్టీలూ, రాజకీయాలు, ప్రభుత్వాలుం ఉండవని మురళీధర్ రావు స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో బండి సంజయ్,అరవింద్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, రామచంద్రరావు,తదితరులు పాల్గొన్నారు..

Updated Date - 2020-07-11T03:53:05+05:30 IST