ప్రభుత్వం దగ్గర డబ్బులకు కొదవలేదు: సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-06-25T19:45:43+05:30 IST

తెలంగాణ వ్యాప్తంగా ఆరోవిడత హరితహారం గురువారం ప్రారంభమైంది.

ప్రభుత్వం దగ్గర డబ్బులకు కొదవలేదు: సీఎం కేసీఆర్‌

 సంగారెడ్డి: తెలంగాణ వ్యాప్తంగా ఆరోవిడత హరితహారం గురువారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్‌లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ కచ్చితంగా ధనిక రాష్ట్రమేనని, తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బులకు కొదవలేదని అన్నారు. కరోనా వల్ల ఉద్యోగులకు రెండు, మూడు నెలలు పూర్తిగా జీతాలు ఇవ్వలేకపోయామని, కొద్దిగా లాక్‌డౌన్‌కు మినహాయింపులు ఇవ్వగానే ఆదాయం పెరిగిందన్నారు. దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా మారిందని, మిషన్‌ భగీరథ వల్ల తాగునీటి కష్టాలు తొలగిపోయాయన్నారు. తెలంగాణలో విద్యుత్‌ కష్టాలు పునరావృతం కావని స్పష్టం చేశారు. ఏడాదిలో సంగారెడ్డికి కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. రోహిణి కార్తెలోనే వరి నాట్లు వేసుకునే పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.


రైతుబంధు ఇచ్చేందుకే ఉద్యోగులకు జీతాలు ఆపాం: కేసీఆర్ 

రైతుబంధు పథకం కోసమే ఉద్యోగులకు జీతాలు ఆపామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. రైతుల దగ్గర డబ్బులు ఉంటే సమాజం దగ్గర ఉన్నట్టేనన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తెలంగాణ రైతుల్లో ధైర్యం వచ్చిందని, పల్లెలన్నీ పచ్చబడుతున్నాయన్నారు. పట్టణాల నుంచి సొంతూళ్లకు వలసలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా గ్రామాలకు నిధులు ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. వర్షాల కోసం అడవులను పునరుద్ధరించాలని సూచించారు. మొక్కలు నాటాలని.. నాటిన వాటిని రక్షించాలని పిలుపు ఇచ్చారు. అడవుల్లో కలప దొంగలను ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2020-06-25T19:45:43+05:30 IST