ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగోస్థానం
ABN , First Publish Date - 2020-09-21T01:24:40+05:30 IST
ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అశ్వినీ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతి లక్షమందిలో

హైదరాబాద్: ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతి లక్షమందిలో 20.6 మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆయన వెల్లడించారు. లోక్‌సభలో సభ్యులు ప్రభాత్‌బాయ్ పటేల్ అడిగిన ప్రశ్నకు మంత్రి అశ్వినీ కుమార్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. సిక్కింలో అత్యధికంగా ప్రతి లక్షమందిలో 33.1 మంది ఆత్యహత్యలు చేసుకుంటున్నారని వివరించారు. ఆ తర్వాత చత్తీస్‌ఘడ్‌లో 26.4, కేరళలో 24.3, తెలంగాణలో 20.6, త్రిపురలో 18.2 మంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. జాతీయ సగటు 10.4 మాత్రమే ఉందని తెలిపారు. జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్బీ) - 2019 నివేదిక ప్రకారం.. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వారు 35.06 శాతం మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. 18 ఏళ్లలోపువారు 6.91 శాతం, 30 నుంచి 45 ఏళ్ల మధ్యవారు 31.83 శాతం, 45 నుంచి 60 ఏళ్లవారు 18..28 శాతం, 60 ఏళ్లపైన వారు 7.92 శాతం మంది ఉన్నారని పేర్కొన్నారు. ఆత్మహత్యలకు సామాజిక, ఆర్థిక సమస్యలే కారణమని తెలిపారు. మద్యానికి బానిసై, ఉద్యోగం రాలేదని, పెళ్లికాలేదని మనస్తాపం చెంది బలవన్మరాలకు పాల్పడుతున్నారని మంత్రి అశ్వినీ కుమార్ పేర్కొన్నారు.