గుండెలపై బ్లేడుతో నా పేరు రాసుకో

ABN , First Publish Date - 2020-06-11T09:07:05+05:30 IST

గుండెలపై బ్లేడుతో నా పేరు రాసుకో

గుండెలపై బ్లేడుతో  నా పేరు రాసుకో

గాట్లతో రక్తం కారుతుంటే వీడియోలో నేను చూడాలి

మహిళా టెకీకి నరకం చూపిన యువకుడు

స్నేహం పేరుతో చనువు.. ఫోన్లు, పార్టీలకు ఆహ్వానం

కలిసి దిగిన ఫొటోలను బయటపెడతానని వేధింపులు

హోటల్‌కు పిలిచి లైంగికదాడి.. వీడియోలో చిత్రీకరణ

వీడియో కాల్స్‌ చేసి తాను చెప్పినట్లు చేయాలని ఒత్తిడి

ఉద్యోగం నీది, జీతం నాదంటూ అకృత్యాలు

తాళలేని యువతి.. ఆత్మహత్య దిశగా ఆలోచన! 

నిందితుడి అరెస్ట్‌.. పీడీ యాక్ట్‌ నమోదుకు అవకాశం! 


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): స్నేహం పేరు చెప్పి అమ్మాయితో చనువు పెంచుకున్నాడతను. పార్టీలకు పిలిచి ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు తీశాడు. వాటిని ఆమె తల్లిదండ్రులకు చూపిస్తానని చెప్పి బెదిరించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అక్కడితో ఆగలేదు అతడి దుర్మార్గం. బ్లేడుతో గుండెల మీద తన పేరును రాసుకోవాలని, రక్తం కారుతుంటే తాను వీడియోలో చూస్తానని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. బ్లేడు గాట్లకు గుండెల నుంచి నెత్తురు కారుతుండగా ఆ బాధకు ఆమె రోదిస్తుంటే అదంతా వీడియోలో చూసి పైశాచిక ఆనందం పొందాడు. ఎప్పటికప్పుడు  వదిలేస్తానని నమ్మబలుకుతూనే వీడియో కాల్‌ చేస్తా.. ‘నేను చెప్పి నట్లు చెయ్‌’ అని శాసిస్తూ మూడు నెలలుగా ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి నిత్యనరకం చూపుతున్నాడా శాడిస్టు. సైబరాబాద్‌ పరిధిలోని కూకట్‌పల్లిలో వెలుగుచూసిన ఘటన, ఆ దుర్మార్గుడి చేతిలో ఆమె చవిచూసిన కష్టాలను తెలుసుకొని పోలీసులే దిగ్ర్భాంతికి గురయ్యారు. వాడిని కటకటాల్లోకి నెట్టిన పోలీసులు,  సీపీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు ఒకట్రెండు రోజుల్లో పీడీ యాక్ట్‌ నమోదు చేసే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కూకట్‌పల్లిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న ఏపీలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ యువతి లాక్‌డౌన్‌కు ముందు ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లింది. అక్కడ ఇంటర్వ్యూకే వచ్చిన రాయలసీమకు చెందిన ఓ యువకుడు, ఆమెకు పరిచయమయ్యాడు. మాటలు కలిపి ఆమె ఫోన్‌ నంబర్‌ తీసుకున్నాడు. వారం తర్వాత ఆ యువతికి ఆ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అతడికి రాలేదు. అయితే, స్నేహం పేరుతో ఏదో వంక పెట్టుకొని అతడు రోజూ యువతికి ఫోన్‌ చేసి మాట్లాడేవాడు.  ఆమె ఉంటున్న హాస్టల్‌వైపు వెళ్లేవాడు. కొన్నాళ్లకు ప్రేమిస్తున్నానని చెప్పాడు. తనకా ఉద్దేశం లేదని ఆ యువతి చెబితే స్నేహితులుగానే ఉందామని నమ్మబలికాడు. ఆమెను రెస్టారెంట్లకు, పార్టీలకు ఆహ్వానించేవాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు సెల్ఫీలు, వీడియోలు తీసుకునేవాడు. 


వదిలేయాలని వేడుకున్నా.. 

ఒక రోజు యువతిని హోటల్‌కు పిలిచి.. తన  కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడు. సహకరిస్తే ఇంకెప్పుడు జోలికి రానని, లేదంటే తనతో దిగిన ఫొటోలను ఆమె తల్లిదండ్రులకు పంపిస్తానని, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాన్నంతా వీడియో తీశాడు. తనను ఇక వదిలేయాలని వేడుకున్న ఆమెను, ఆ వీడియోతో బ్లాక్‌మెయిల్‌ చేస్తూ మరింత రెచ్చిపోయాడు. ఆమెకొచ్చే జీతమంతా తనకే దక్కాలనే ఉద్దేశంతో తనను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ‘ఉద్యోగం నీది.. జీతమంతా నాది.  లేదంటే నీకే నష్టం’ అంటూ హెచ్చరించాడు. లాక్‌డౌన్‌తో హాస్టల్‌ నుంచి సొంతూరుకు వెళ్లిపోయినా ఆమెకు వేధింపులు ఆగలేదు. వాట్సా్‌ప్‌లో అసభ్య సందేశాలు పంపేవాడు. తనకిక చావే శరణ్యమకొన్న ఆ యువతి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఒకరోజు ఏడుస్తున్న ఆమెను అన్నయ్య  చూసి ఆరా తీయగా..  విషయం చెప్పుకొని భోరుమంది. ఘటనపై అతడు సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ ప్రొటక్షన్‌ సెల్‌ డీసీపీ అనసూయ బాధిత యువతితో మాట్లాడింది. ఆ యువకుడి అకృత్యాలు విని చలించిపోయిన ఆమె, జరిగిన దారుణాన్ని సీపీ సజ్జనార్‌ దృష్టికి తీసుకెళ్లింది. సీపీ ఆదేశాల మేరకు నిందితుడిని పోలీసులు పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు. 


వేధింపులను మౌనంగా భరించొద్దు 

లాక్‌డౌన్‌లోనూ మహిళలపై కొందరు వేధింపులకు పాల్పడ్డారు. ఏప్రిల్‌, మేలో 225 ఫిర్యాదులు అందాయి. అన్నింటినీ పరిష్కరించాం. మాట వినని వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశాం. మృగాళ్ల వేధింపులను మౌనంగా భరించొద్దు. మీకు అండగా సైబరాబాద్‌ పోలీసులు ఉన్నారని గుర్తుంచుకోవాలి. బాధితులు.. డయల్‌-100, సైబరాబాద్‌ షీటీమ్స్‌ వాట్సప్‌ 9490617444.లో సంప్రదించాలి.

- అనసూయ, డీసీపీ ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ ప్రొటక్షన్‌ సెల్‌, సైబరాబాద్‌

Updated Date - 2020-06-11T09:07:05+05:30 IST