మానుపురం నేతన్నలను ఆదుకోండి
ABN , First Publish Date - 2020-08-16T10:15:11+05:30 IST
‘నాకు ఏం చేయకున్నా సరే. మానుపురంలో చేనేత కార్మికులను ఆదుకోండి’ అని సిరిసిల్ల పట్టణానికి చెందిన దివ్యాంగురాలు పులి విజయ (60) పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను వేడుకుంది....

- దివ్యాంగురాలు విజయ వేడుకోలు.. చలించిన కేటీఆర్
- చేనేత కార్మికుల స్థితిగతులపై సర్వేకు ఆదేశం
- నేడు సూర్యాపేట జిల్లాకు చేనేత జౌళి శాఖ బృందం
సిరిసిల్ల, ఆగస్టు 15 (ఆంరఽధజ్యోతి): ‘నాకు ఏం చేయకున్నా సరే. మానుపురంలో చేనేత కార్మికులను ఆదుకోండి’ అని సిరిసిల్ల పట్టణానికి చెందిన దివ్యాంగురాలు పులి విజయ (60) పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను వేడుకుంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మానుపురం గ్రామంలో తన చెల్లెలి అల్లుడితోపాటు 25 కుటుంబాలు.. మగ్గాలపై తయారు చేసిన వస్ర్తాలు అమ్ముడుపోక ఇబ్బందులు పడుతున్న తీరును విజయ.. కేటీఆర్ దృష్టికి తీసుకురావడంతో ఆయన చలించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. మంత్రిని కవలడానికి విజయ కలెక్టరేట్‌కు రాగా.. లోపలికి ఎవరినీ అనుమతించలేదు. మంత్రి తన కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి వెళ్లే సమయంలో గేటు వద్ద ‘కేటీఆర్ సార్’ అంటూ విజయ గట్టిగా పిలిచింది. ఆ పిలుపును విన్న కేటీఆర్ విజయ వద్దకు వెళ్లి ‘పింఛన్ కావాలా.. ఇల్లు కావాలా’ అని అడిగారు.
తనకు ఏమీ వద్దని, తనకూ ఎవరూ లేరని, 3 వేల పింఛన్ వస్తోందని, అద్దె ఇంట్లో ఉంటున్నానని వివరించింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పక్కన ఉండే మానుపురంలో 25 పద్మశాలీల కుటుంబాలు ఉన్నాయని, చేనేత వస్త్రాలను ఎవరూ కొనడం లేదనీ, తన అల్లుడు బాధపడుతూ ఫోన్ చేశాడని చెప్పింది. సిరిసిల్లలో చేనేత కార్మికులకు కేటీఆర్ మంచిగ జేస్తుండని, తమకు కూడా చేస్తే బాగుండని అంటున్నారని తెలిపింది. తన అల్లుడి ఊరోళ్లకు ఏమైనా సాయం చేయాలని కోరింది. విజయ తన కోసం కాకుండా ఎక్కడో సూర్యాపేట జిల్లాలో తన వాళ్ల కోసం పడుతున్న తపనను చూసి కేటీఆర్ చలించారు. సూర్యాపేట కలెక్టర్ వినయ్‌కృష్ణరెడ్డితో మాట్లాడి చేనేత కార్మికుల స్థితిగతులపై నివేదిక పంపించాలని తన వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివా్‌సను ఆదేశించారు. మానుపురంతోపాటు సూర్యాపేట జిల్లాలోని చేనేత కార్మికుల స్థితిగతులపై సర్వే చేయించాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం చేనేత జౌళి శాఖ ప్రత్యేక బృందం సర్వేకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు.