తెలంగాణ.. కేసీఆర్ కుటుంబం కోసమేనా?
ABN , First Publish Date - 2020-12-10T10:16:37+05:30 IST
సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం దోచుకునేందుకే తెలంగాణ తెచ్చుకున్నట్లయిందని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాభవన్‌లో ‘డిసెంబర్ 9, ఒక చారిత్రక సందర్భం’ అన్న అంశంపై సదస్సు జరిగింది.

ప్రాజెక్టుల రీడిజైన్‌ల పేరుతో
రాష్ట్ర ఖజానా లూటీ: భట్టి
మళ్లీ ఉద్యమం చేపట్టాల్సిన
అవసరం ఉంది: కోదండరాం
హైదరాబాద్, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం దోచుకునేందుకే తెలంగాణ తెచ్చుకున్నట్లయిందని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాభవన్‌లో ‘డిసెంబర్ 9, ఒక చారిత్రక సందర్భం’ అన్న అంశంపై సదస్సు జరిగింది. దీనికి హాజరైన భట్టివిక్రమార్క మాట్లాడారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ల పేరుతో రాష్ట్ర ఖజానాను కేసీఆర్ లూటీ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావివర్గం మౌనంగా ఉండడానికి కారణం రాజ్యహింస పెరగడమేనని ఆయన అన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్.. దళితుడిని ప్రతిపక్ష నాయకుడిగా కూడా లేకుండా చేశారని మధుయాష్కీగౌడ్ మండిపడ్డారు. తెలంగాణ కోసం మంత్రులుగా మొదట రాజీనామా చేసింది తామేనని టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న నిర్భంధాన్ని ప్రొఫెసర్ జయశంకర్ ముందే గుర్తించారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఈ నిర్భంధాన్ని ఎదుర్కొనేందుకు మళ్లీ ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మన ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ప్రజాపక్షం ఎడిటర్ శ్రీనివా్‌సరెడ్డి, జర్నలిస్టు సంఘం నేతలు పల్లె రవికుమార్, కాసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సోనియా వల్లే తెలంగాణ రాష్ట్రం: ఉత్తమ్
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోనియా 74వ జన్మదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్‌లో పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్ తదితరులు పాల్గొన్నారు.