నేతలపై కేసుల వివరాలతో ప్రత్యేక సైట్
ABN , First Publish Date - 2020-10-08T08:35:10+05:30 IST
ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న ఆర్థిక నేరాల కేసులు, క్రిమినల్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు

రూపకల్పనకు సన్నాహాలు చేస్తున్న హైకోర్టు
కోర్టుకు సహకరించేందుకు
నోడల్ అధికారిగా అదనపు ఎస్పీ ఎంఏ బారీ?
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న ఆర్థిక నేరాల కేసులు, క్రిమినల్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. నేతలపై పెండింగ్‌లో ఉన్న వివిధ కేసులు, అవి ఏ స్థితిలో ఉన్నాయి? ఆయా కేసుల్లోని మధ్యంతర ఆదేశాలు, స్టేలకు సంబంధించిన సమగ్ర వివరాలతో ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్టు తెలిసింది. నేతలపై పెండింగ్ కేసుల్లో హైకోర్టుకు సహకరించేందుకు అదనపు ఎస్పీ ఎం.ఏ. బారీని నోడల్ అధికారిగా నియమిస్తూ డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడినట్లు సమాచారం. అలాగే, కొవిడ్-19 కారణంగా దీర్ఘకాలం వాయిదా పడ్డ కేసుల తేదీలను ముందుకు మార్చి విచారణ చేపట్టడానికి హైకోర్టు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. నేతలపై కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలపై 118 కేసులు ఉన్నాయి. వీటిలో అధిక కేసులు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నమోదైనవే. కాగా ఏసీబీ, సీబీఐ ప్రత్యేక కోర్టులో మరో 25 కేసులు ఉన్నాయి. వీటిలో సింహభాగం ఏపీ సీఎం జగన్‌పై సీబీఐ, ఈడీ, పీఎంఎల్‌ఏ నమోదు చేసిన కేసులే. 14 కేసుల్లో స్టేలు ఉన్నాయి. స్టే ఆదేశాలు పొందిన కేసులపై.. సీజేఆర్‌ఎస్ చౌహాన్ ప్రత్యేకంగా వారాంతాల్లో విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.