1800 కోట్ల సంగతేంటి..?
ABN , First Publish Date - 2020-03-16T09:23:57+05:30 IST
మెరుగ్గా అమలవుతుందనుకున్న పథకం .. మొత్తానికే రద్దయింది. అభయహస్తం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ
అభయహస్తం సొమ్మును మహిళలకు తిరిగి చెల్లిస్తారా!
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): మెరుగ్గా అమలవుతుందనుకున్న పథకం .. మొత్తానికే రద్దయింది. అభయహస్తం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పథకం చట్టంగా ఉన్నందున.. ఆదివారం అసెంబ్లీలో రద్దు బిల్లును ప్రతిపాదించి ఆమోదించారు. దీంతో ఇన్నాళ్లుగా ఈ పథకానికి మహిళలు చెల్లించిన సొమ్ము ఏమవుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నా యి. మహిళా స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ) సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వం సమంగా వాటా చెల్లించే బీమా పథకంగా చేపట్టిన అభయహస్తం పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలో 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూపొందించారు. దీనిని చట్టంగా కూడా చేశారు. ఈ పథకంలో దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు.
ఇందులో చేరిన ప్రతి మహిళ రోజుకు ఒక రూపాయి చొప్పున ఏటా రూ.365 చెల్లించేలా, అంతే మొత్తంలో ప్రభుత్వం బీమా సంస్థకు చెల్లించేలా పథకాన్ని చేపట్టారు. సభ్యురాలైన మహిళకు 60 ఏళ్లు నిండిన తదుపరి ప్రతి నెలా రూ.500కు తగ్గకుండా గరిష్ఠంగా రూ.2200 వరకు పెన్షన్ వస్తుంది. దీంతోపాటు మరికొన్ని ఇతర ప్రయోజనాలు కూడా కల్పించారు. తెలంగాణ ఏర్పాటయ్యా క ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్వయించుకుంది. అభయహస్తం పథకాన్ని మెరుగ్గా అమలు చేస్తామని పేర్కొంది. ఈ మేరకు పథకంలో సభ్యులైన మహిళలు 2009నుంచి తమ వాటా చెల్లిస్తూ వచ్చారు. ఇలా సభ్యుల మొత్తం వాటాధనం రూ.467 కోట్లు బీమా సంస్థ వద్ద ఉన్నట్లు సమాచారం. దీనికితోడు ప్రభుత్వం వాటాగా చెల్లించిన మరో రూ.467 కోట్లు, ఇన్నాళ్లుగా ఈ మొత్తానికి బోనస్ కలిపి.. దాదాపు రూ.1800 కోట్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
మూడేళ్లుగా పక్కన పెట్టిన ప్రభుత్వం..
తెలంగాణ ప్రభుత్వం దాదాపు మూడేళ్లుగా అభయహస్తం పథకాన్ని పక్కన పెట్టేసింది. 2017-18 బడ్జెట్‌లో అభయహస్తం పెన్షన్ల కోసం రూ.161.65కోట్లు ప్రతిపాదించినప్పటికీ.. రూ.61.02 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపి, కేవలం రూ.9.15 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఆ తరువాత ఎలాంటి నిధులూ కేటాయించలేదు. రెండేళ్లుగా తమ వాటాధనాన్ని కూడా ప్రభుత్వం చెల్లించడంలేదు. అయితే సభ్యుల వాటాధనాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లింస్తుందని భావిస్తున్నారు. సభ్యులు చెల్లించిన మొత్తాన్నే తిరిగి ఇస్తారా? వడ్డీతో సహా ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
మెరుగైన ఆసరా పెన్షన్లు ఇస్తాం..
అభయహస్తం పథకంలో 60 ఏళ్లు నిండిన మహిళలు 1,33,415 మంది ఉన్నారని, వారికి ఆస రా పథకంలో భాగంగా వృద్ధాప్య పెన్షన్‌ను నెలకు రూ.2016 వంతున అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఏప్రిల్ నుంచి వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసు 57 ఏళ్లుగా నిర్ణయిస్తున్నందున.. అదనం గా మరో 80 వేల మంది వరకు అభయహస్తం సభ్యులు ఆసరా పెన్షన్‌కు అర్హత సాధిస్తారని ఒక అంచనా. అయితే అభయహస్తం సభ్యుల్లో 81,261 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా దాదాపు రెండున్నరేళ్లుగా వీరికి పెన్షన్ రావడంలేదు. నిబంధనల ప్రకారం మరో 1.21 లక్షల మందికి ఆసరా పెన్షన్ రావాల్సి ఉన్నా అందడంలేదు.
పైగా పథకం రద్దుతో తాము అనేక ప్రయోజనాలు కోల్పోతున్నామని అభయహస్తం సభ్యులు చెబుతున్నారు. అభయ హస్తం సభ్యుల పిల్లలు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే వారికి (ఇద్దరికి) ఏటా రూ.1200 ఉపకార వేతనం ఇచ్చేవారు. సభ్యురాలు సహజ మరణం పొందితే కుటుంబానికి రూ.30 వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75 వేలు అందించేవారు. అంత్యక్రియల ఖర్చులకు తక్షణమే రూ.5 వేలు కూడా ఇచ్చేవారు. ఈ పరిహారంతో పాటు అప్పటివరకు సభ్యురాలు చెల్లించిన మొత్తం, ప్రభుత్వం చెల్లించిన మొత్తం కూడా కుటుంబ సభ్యులకు అందించేవారు. వీటన్నిటినీ కోల్పోవాల్పి వస్తోంది. అభయహస్తం పథకాన్ని రద్దు చేయడంపై పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పెట్టుబడి పథకమైన అభయ హస్తం, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పొందే హక్కున్న ఆసరాను.. రెండింటినీ అమలు చేయాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.