అదే జరిగితే పరిస్థితి ఏంటి?.. టి.కాంగ్రెస్ నేతల్లో హైటెన్షన్..

ABN , First Publish Date - 2020-10-13T16:39:29+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ గతానికి భిన్నంగా ప్రచార వ్యూహాలను అమలు చేస్తోంది. రాష్ట్ర నాయకులంతా దుబ్బాకలోనే మకాం వేసి గ్రామస్థాయి నుంచి క్యాంపెయిన్‌తో...

అదే జరిగితే పరిస్థితి ఏంటి?.. టి.కాంగ్రెస్ నేతల్లో హైటెన్షన్..

దుబ్బాక ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ గతానికి భిన్నంగా ప్రచార వ్యూహాలను అమలు చేస్తోంది. రాష్ట్ర నాయకులంతా దుబ్బాకలోనే మకాం వేసి గ్రామస్థాయి నుంచి క్యాంపెయిన్‌తో సందడి చేస్తున్నారు. అయినా హస్తం పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా ఎలాంటి ఆందోళన కనిపిస్తోంది? వరుస ఎన్నికల ముంగిట దుబ్బాకలో ఏం జరగకూడదని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు?


చాపకింద నీరులా...

అసలే వరుస ఓటములు.. మరోవైపు ముంచుకొస్తున్న వరుస ఎన్నికలు. దాంతో దుబ్బాక ఉప ఎన్నికలను తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ ఫలితాన్ని అనుకూలంగా రాబట్టి కొత్త ఉత్సాహంతో భవిష్యత్తు ఎన్నికలకు రెడీ కావాలని ఆ పార్టీ నేతలు తలపోస్తున్నారు. అయితే అసలే అధికార పార్టీ.. ఆ పైన సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఉన్న సానుభూతిని ఎదుర్కొని గెలవడం అంత సులభం ఏమీ కాదన్న భావన. దీనికితోడు తమ పొలిటికల్ ప్లేస్‌కు చాపకింద నీరులా గండి కొడుతున్న బీజేపీ దూకుడు. వీటన్నింటి నేపథ్యంలో ఇక్కడ చావోరేవో అన్నట్లుగా కష్టపడాలని హస్తం పార్టీ డిసైడ్ అయింది. కొత్త ఇన్‌చార్జి నియామకం తర్వాత వచ్చిన మొదటి ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ సరికొత్తగా ప్రచార ప్రణాళికలు అమలు చేస్తోంది.


హోరెత్తించేలా స్కెచ్...

ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఎవరి నియోజకవర్గాల్లో వారే గెలుపు కోసం కష్టపడే సంప్రదాయం కాంగ్రెస్‌లో కొనసాగుతూ వస్తోంది. కొన్నిచోట్ల స్థానిక అభ్యర్థి కోరితే ముఖ్యనాయకులు ప్రచారానికి వెళ్లి వచ్చేవారు. కానీ దుబ్బాక ఉప ఎన్నికల కోసం మాత్రం ఈసారి పాత సంప్రదాయానికి భిన్నంగా కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అధికార పార్టీకి దీటుగా గ్రామగ్రామాన ప్రచారంతో హోరెత్తించేలా స్కెచ్ గీసి అమలు చేస్తోంది. నియోజకవర్గంలోని 146 గ్రామాలకు టీపీసీసీలోని 146 మంది ముఖ్యనాయకులను ఇన్‌ఛార్జిలుగా నియమించింది. ఇక ఏడు మండలాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు కీలక నేతలకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. పీసీసీ నియమించిన విలేజ్ ఇన్‌ఛార్జిలు ఆ గ్రామ పార్టీ నాయకులతో ప్రచారం కోసం ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశారు. కమిటీలతో కలిసి వారు బూత్‌ల వారీగా ప్రచారం చేయాలి. వారిని మండల ఇన్‌చార్జిలు సమన్వయం చేసుకోవాలి. ఇక వారికయ్యే ఖర్చు అభ్యర్థి మీద ఆధారపడకుండా మండల బాధ్యులే భరించాలి. ఇన్‌ఛార్జిలు ఎవరూ.. వారికి అప్పగించిన గ్రామాలు, మండలాల నుంచి బయటకు రావొద్దని ఏఐసీసీ కొత్త ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ ఆదేశించారు. గ్రామాల వారీగా ఫలితాలను విశ్లేషించి మంచి ఫలితాలు తెచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. దాంతో కాంగ్రెస్ నేతలంతా దుబ్బాకకు మకాం మార్చారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం శ్రమిస్తున్నారు.


హరీష్ వర్సెస్ కాంగ్రెస్ నాయకులు...

ఇప్పటికే నాయకులంతా దుబ్బాకలో తిష్ట వేసి ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ, మరోవైపు మండలాల వారిగా జనాలను తరలిస్తూ సభలు నిర్వహిస్తున్నారు. అయితే నేతలంతా శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నా.. మరోవైపు ఫలితం ప్రతికూలంగా వస్తే ఎదురయ్యే ప్రమాదం ఊహించుకుని లోలోన గుబులు పడుతున్నారట. అందుకు కారణం లేకపోలేదు. అధికార పార్టీ అక్కడ బాధ్యతను మంత్రి హరీష్ రావుకు అప్పగించింది. టీఆర్ఎస్‌కు గోల్డెన్ లెగ్‌గా పేరున్న హరీశ్‌రావు.. అక్కడ అన్నీతానై వ్యవహరిస్తున్నారు. దీంతో దుబ్బాకలో హరీశ్ వర్సెస్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అన్నట్లుగా బైపోల్ వార్ మారింది. గెలుపు కోసం సమిష్టిగా కష్టపడుతున్నాం సరే కానీ ఫలితం ప్రతికూలమైతే పరిస్థితి ఏంటన్న గుబులు హస్తం పార్టీని పట్టిపీడిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కేసీఆర్‌కు దీటైన నాయకుడే లేడని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో దుబ్బాకలో ఇంత చేసినా ఫలితం అనుకూలంగా రాకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలందరి మీద అధికారపక్షం నేతలు మాటల దాడి పెంచడం ఖాయమనే కంగారు వ్యక్తమవుతోంది. హరీశ్‌రావుకు సైతం వారు సరితూగరనే ప్రచారం చేసే ప్రమాదమూ ఉందట. అసలే మున్ముందు వరుస ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికల ప్రభావం భవిష్యత్ ఎన్నికల మీద పడే అవకాశం ఉంది. వీటన్నింటి నేపథ్యంలో దుబ్బాకలో నేతల మకాంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.


కాంగ్రెస్ గెలిచి తీరాలి..

మరోవైపు బీజేపీ దూకుడు సైతం కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. రాష్ట్రంలో పరిణామాలు కూడా అందుకు కారణంగా చెప్పొచ్చు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అక్కడా కాంగ్రెస్ అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. ఇక అప్పటినుంచి తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ ఆ పార్టీ నాయకులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆ అపవాదును తొలగించుకోవాలంటే దుబ్బాకలో కాంగ్రెస్ గెలిచి తీరాలి. ఒకవేళ ఓడినా కనీసం రెండో స్థానంలోనైనా నిలవాలి. అలా కాకుండా బీజేపీ గెలిచినా, లేక రెండో స్థానానికి వచ్చినా.. రాష్ట్రంలో బీజేపీ మరింత దూకుడు పెంచే అవకాశం ఉంటుందని హస్తం నేతలు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కాంగ్రెస్‌కు తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని లెక్కలు కడుతున్నారు. అందువల్ల దుబ్బాకలో కచ్చితంగా గెలవాలి.. లేదంటే రెండో స్థానంలోనైనా నిలవాలి.. బీజేపీ గెలువొద్దు.. కనీసం రెండో స్థానంలో కూడా రావొద్దని కాంగ్రెస్ శ్రేణులు బలంగా కోరుకుంటున్నాయి. అలా జరగకపోతే మాత్రం కాంగ్రెస్ మనుగడకే ముప్పు కలుగుతుందన్న ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోంది. అయితే చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని చేర్చుకుని దుబ్బాక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత హస్తం పార్టీలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. మరి దుబ్బాక ఓటర్లు ఎవరి ఫ్యూచర్‌ను ఎలా డిసైడ్ చేస్తారో చూడాలి.

Updated Date - 2020-10-13T16:39:29+05:30 IST