యూనివర్సిటీలు, కాలేజీలను సెప్టెంబరులో ప్రారంభించండి

ABN , First Publish Date - 2020-04-26T09:51:02+05:30 IST

విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో సెప్టెంబరు నుంచి ..

యూనివర్సిటీలు, కాలేజీలను సెప్టెంబరులో ప్రారంభించండి

  • కేంద్రానికి యూజీసీ కమిటీ సిఫారసులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో సెప్టెంబరు నుంచి తరగతులు ప్రారంభించాలని, సాధ్యమైన చోట్ల ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలని యూజీసీ నియమించిన కమిటీలు సిఫారసు చేశాయి. కరోనా వల్ల కోల్పోయిన విద్యా సంవత్సరం, ఆన్‌లైన్‌ పరీక్షల సమస్యలను పరిశీలించడానికి యూజీసీ రెండు కమిటీలను నియమించింది. వర్సిటీల్లో పరీక్షలు నిర్వహించడానికి గల మార్గాలు, ప్రత్యామ్నాయ విద్యా సంవత్సరాన్ని ఏర్పాటు చేసే విషయాలను పరిశీలించడానికి హరియాణా వర్సిటీ వీసీ ఆర్‌సీ కుహాడ్‌ నేతృత్వంలోని ఒక కమిటీని, ఆన్‌లైన్‌ విద్యను మరింత మెరుగుపర్చేందుకు గల మార్గాలను సూచించడానికి ఇగ్నో వీసీ నాగేశ్వర్‌రావు నేతృత్వంలోని మరో కమిటీని నియమించింది.


ఈ రెండు కమిటీలు తమ నివేదికలను శుక్రవారం యూజీసీకి సమర్పించాయి. విద్యా సంవత్సరాన్ని సెప్టెంబరులో ప్రారంభించాలని ఓ కమిటీ సిఫారసు చేసింది. ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించడానికి వర్సిటీలకు మౌలిక సౌకర్యాలు ఉంటే పరీక్షలు నిర్వహించవచ్చని, లేదా లాక్‌డౌన్‌ తర్వాత పరీక్షల తేదీలు నిర్ణయించవచ్చని రెండో కమిటీ సిఫారసు చేసింది. ఈ కమిటీల నివేదికలను అధ్యయనం చేస్తామని, వచ్చే వారంలోపు మార్గదర్శకాలు జారీ చేస్తామని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. 29 సబ్జెక్టులకు మాత్రమే పెండింగ్‌లో ఉన్న బోర్డు పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ ఇప్పటికే ప్రకటించింది. 102ఏళ్ల క్రితం విలయతాండవం చేసిన స్పానిష్‌ ఫ్లూ(హెచ్‌1ఎన్‌1 వైర్‌స)ను భారత్‌ ఎలా ఎదుర్కొందనే దానిపై అధ్యయనం చేయాలని విశ్వవిద్యాలయాలకు హెచ్‌ఆర్‌డీ సూచించింది. 

Updated Date - 2020-04-26T09:51:02+05:30 IST