మళ్లీ రొటేషన్‌

ABN , First Publish Date - 2020-06-11T09:18:35+05:30 IST

మళ్లీ రొటేషన్‌

మళ్లీ రొటేషన్‌

సచివాలయంలో ఉద్యోగులు 

20ు దాటకూడదని మౌఖిక ఆదేశాలు

ఆర్థిక, మహిళా శిశుసంక్షేమ శాఖల్లో ముగ్గురికి కరోనా

3 రోజులుగా 2 ఫ్లోర్లు ఖాళీ.. వారంతా ఇంటి నుంచే పని


హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు వెలుగుచూడటంతో సచివాలయం ప్రమాదకర వలయంలోకి వెళ్లిపోయింది. దీంతో ఆయా శాఖల ఉన్నతాధికారులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. అనధికారికంగా వంతులవారీ (రొటేషన్‌) పద్ధతిని అమలు చేస్తున్నారు. ప్రతీ శాఖలో 20 శాతానికి మించి ఉద్యోగులు ఉండరాదని మౌఖిక ఆదేశాలను జారీ చేశారు.  దాంతో మూడు రోజులుగా ఉద్యోగులు పరిమిత సంఖ్యలోనే విధులకు హాజరవుతున్నారు. ప్రధానంగా ఆర్థిక, మహిళా శిశు సంక్షేమ శాఖల్లో ముగ్గురికి కరోనా నిర్ధారణ అయింది. వీరిలో ఇద్దరు ఆర్థిక శాఖ సిబ్బందే. దీంతో  సచివాలయంలో ఆర్థిక శాఖతో పాటు హోంశాఖ ఉన్న 7, 8 అంతస్తులు మూడురోజులుగా ఖాళీగానే ఉన్నాయి. ఈ రెండు శాఖల సిబ్బంది అంతా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. పాత సచివాలయంలో ఐదు బ్లాకుల్లో ఉన్న సచివాలయాన్ని ఒకే బ్లాకుగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌(బీఆర్‌కేఆర్‌)లోకి తరలించారు. కరోనా వ్యాప్తితో రెండు గజాలు లేదా ఆరడుగుల దాకా మనిషికి మనిషికి మధ్య దూరం పాటించాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు ఉన్నాయి. సచివాలయంలో నాలుగైదు సెక్షన్లు కేవలం ఆరడుగుల లోపే ఉంటాయి. ఇరుకు ఇరుకుగా ఉన్న భవనంలో ఊపిరి ఆడే పరిస్థితి ఉండదని, శానిటైజేషన్‌ కూడా సరిగ్గా ఉండదని పలు దఫాలుగా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  భవనంలో మొత్తంగా తొమ్మిది అంతస్తులు ఉండగా ఒక్క అంతస్తులోనే నిరంతరం శానిటైజ్‌ చేస్తుంటారని, మిగతా శాఖలన్నీ  ప్రమాదకర వలయంలోనే ఉంటున్నాయని అంటున్నారు. ఈ కారణంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నాటినుంచి ఉద్యోగులు, అధికారులంతా క్రమంగా విధులకు దూరంగానే ఉంటున్నారు. దస్త్రాల కదలిక పూర్తిస్థాయిలో ఆగిపోవడం, అడపాదడపా తప్ప, క్రమం తప్పకుండా  దస్త్రాలేవీ సచివాలయానికి రాకపోవడంతో ఉద్యోగులు పరిమిత సంఖ్యలోనే హాజరుకావాలని వివిధ శాఖల ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ముగ్గురు ఉద్యోగులకు కరోనా నిర్ధారణ కాగా, వారు ఎవరితో కలిశారనే సమాచారం కూడా యంత్రాంగం సేకరించ కపోవడంతో మరిన్ని కేసులు పెరుగుతాయనే ఆందోళన ఉద్యోగులు, అధికారుల్లో ఉంది. దాంతో అనధికారికంగా వంతులవారీ పద్ధతిని యంత్రాంగం అమలు చేస్తోంది. 

Updated Date - 2020-06-11T09:18:35+05:30 IST