తెలంగాణలో ఈ సంవత్సరం...

ABN , First Publish Date - 2020-12-31T03:26:55+05:30 IST

తెలంగాణలో ట్వంటీ ట్వంటీ యేడాది సాధారణ నేరాలు తగ్గాయి. సైబర్‌ క్రైమ్స్‌ పెరిగాయి. అలాగే, మహిళలపై దారుణాలు, అవినీతి కేసులు, ఆన్‌లైన్‌ కాల్‌మనీ కేసు..

తెలంగాణలో ఈ సంవత్సరం...

తెలంగాణలో ట్వంటీ ట్వంటీ యేడాది సాధారణ నేరాలు తగ్గాయి. సైబర్‌ క్రైమ్స్‌ పెరిగాయి. అలాగే, మహిళలపై దారుణాలు, అవినీతి కేసులు, ఆన్‌లైన్‌ కాల్‌మనీ కేసు కలకలం రేపాయి. రెండు కోట్ల రూపాయల లంచం కేసులో ఓ తహశీల్దార్‌ ఏసీబీకి పట్టుబడటం ప్రకంపనలు సృష్టించింది. సామాజిక సంస్థలు గిన్నిస్‌ రికార్డ్స్‌ ప్రతినిధులను సంప్రదించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తింది.


కొత్త రూపు సంతరించుకుంటున్న నేరాల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోబోతున్నారు తెలంగాణ పోలీసులు. ప్రధానంగా సైబర్‌ నేరాల సంఖ్య విపరీతంగా పెరగడంతో జోనల్‌ స్థాయిల్లోనూ సైబర్‌ క్రైమ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ కార్యాచరణ వచ్చే యేడాది అమలులోకి వస్తుందని చెబుతున్నారు. 


ఇక.. ఈ యేడాది సంచలనం సృష్టించిన పలు సంఘటనలు నమోదయ్యాయి. చైనా ఆన్‌లైన్‌ గేమ్స్‌ యాప్స్‌ ద్వారా జనాల బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టిన వ్యవహారం ఎందరినో మానసిక వేదనకు గురిచేసింది. హైదరాబాద్‌ శివార్లలో కల్తీసీడ్స్‌ దందా గుబులు పుట్టించింది. అమీన్‌పూర్‌లోని ఓ ఆశ్రమంలో ఈ యేడాది జూలైలో ఓ బాలికపై అత్యాచారం దేశవ్యాప్తంగా చర్చను లేవనెత్తింది. డాలర్‌ బాయ్‌ పేరుతో అమ్మాయిని ట్రాప్‌లో దింపిన ఓ మోసగాడి ఉదంతాన్ని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి బట్టబయలు చేసింది. టీవీ సీరియల్‌ నటి శ్రావణి ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ చివరకు ఆ అమ్మాయి ఉసురు తీసింది. పెద్దలను ఎదిరించి ప్రేమపెళ్లి చేసుకున్న హేమంత్‌ను భార్యముందే ఆమె తరపు బంధువులే కిడ్నాప్ చేసి అత్యంత ఘోరంగా హత్య చేశారు. షేక్‌పేట్‌ తహశీల్దార్‌ సుజాత అరెస్ట్‌ తీవ్ర మలుపులు తిరిగింది. ఇక.. కీసర తహశీల్దార్‌ నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన వ్యవహారం అంతర్జాతీయ స్థాయి వార్త అయ్యింది. ఇక ఇప్పుడు ఆన్‌లైన్‌ కాల్‌మనీ కేసు హాట్‌ టాపిక్‌గా ఉంది. పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. 


హైదరాబాద్‌ నగర శివారుల్లో కల్తీ విత్తనాల దందాకు రాచకొండ పోలీసులు చెక్‌ పెట్టారు. హయత్‌నగర్‌లోని బ్రాహ్మణపల్లిలో ఓ గోదాంపై దాడి చేసిన పోలీసులు.. పలు కంపెనీల బ్రాండ్‌లతో ముద్రించిన ఖాళీ సీడ్‌ కవర్లు, 50 లక్షల విలువ చేసే 2. 8 క్వింటాళ్ల పత్తి విత్తనాలు సీజ్ చేశారు. ప్రాసెసింగ్, ప్యాకింగ్‌ యంత్రాలను కూడా సీజ్ చేశారు. ఇలాంటి నకిలీ విత్తనాలతో రైతులు ఆరుగాలం శ్రమించి నష్టపోతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పోలీసులు ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. 


ఆన్‌లైన్‌ గేమ్స్‌ పేరుతో  భారీ మోసానికి తెర లేపిన అంతర్జాతీయ ముఠా గుట్టును గత ఆగస్టులో బట్టబయలు చేశారు హైదరాబాద్‌ పోలీసులు. తెలంగాణలో అసలు ఆన్‌లైన్‌ గేమ్‌లను ప్రభుత్వం నిషేధించినా.. కొందరు యువతను ఆకర్షించి... తప్పుడు మార్గాల్లో యాప్‌లను ఇన్‌స్టాల్ చేయిస్తూ బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయించారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ ద్వారా అప్పటికే 11 వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. కరోనా కల్లోలం, లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడం, సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ వినియోగం పెరగడంతో కొందరు అరాచకులు రూట్‌ మార్చారు. ఈ ఉచ్చులో చిక్కిన పలువురు బాధితులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. వరుసగా వచ్చిన ఫిర్యాదులతో ఈ దందాకు హైదరాబాద్‌ పోలీసులు చాకచక్యంగా అడ్డుకట్ట వేశారు. చైనా బేస్డ్‌గా రన్ అవుతున్న ఆన్ లైన్ గేమింగ్ నెట్వర్క్ కంపనీలైన గ్రోవింగ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, సిల్లీ కన్సల్టింగ్ సర్వీస్ , పాన్‌యన్ టెక్నాలజీ, లింగ్ క్యూ, డోకీ పే, స్పాట్‌ పే, డైసీలిక్ ఫైనాన్షియల్, హూవాహో ఫైనాన్సియల్ సంస్థలను గుర్తించారు. వీటికి డైరెక్టర్లుగా చైనీయులతో పాటు భారతీయులూ ఉన్నట్లు తేల్చారు.



హైదరాబాద్‌ శివారులోని అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అనాథాశ్రమంలో మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచారం కేసు అందరినీ కదిలించింది. ఆశ్రమంలో ఉండే బాలికపై నిర్వాహకుడే పలుమార్లు అత్యాచారం చేశాడు. అంతేకాకుండా బాలికపై భౌతిక దాడి కూడా జరిగింది. దీంతో.. బంధువుల ఇంటికి వెళ్లిన బాలిక.. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం కలిగించడంతో చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ రంగంలోకి దిగింది. సమగ్ర విచారణ చేపట్టింది. పోలీసులు అత్యాచారం, భౌతిక దాడికి సంబంధించి రెండు కేసులు నమోదు చేశారు. జూలై 31న బోయిన్‌పల్లి పీఎస్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, అదేరోజు కేసును అమీన్‌పూర్‌కు బదిలీ చేశారు. జూలై 31న బాలికను భరోసా కేంద్రానికి పంపించారు. ఆగష్టు 1న అమీన్‌పూర్‌ పోలీసులు కేసును రీ రిజిస్ట్రర్ చేసుకున్నారు. ఆగష్టు 6న నిలోఫర్‌ ఆసుపత్రిలో బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసుకున్నారు. ఆగష్టు 7న నిందితులను అరెస్టు చేశారు. అయితే, బాలిక నీలోఫర్‌లో చికిత్స పొందుతూ ఆగస్టు 12వ తేదీన మృతి చెందింది. అయితే, జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైన తర్వాత కేసు విచారణ మొదలు పెట్టేందుకు 5 రోజుల సమయం ఎందుకు పట్టిందన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. ఆ కేసులో హైపవర్‌ కమిటీకి అన్నీ చిక్కు ప్రశ్నలే ఎదురయ్యాయి. సాక్ష్యాధారాలు సేకరించడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారన్న ఆరోపణలు వచ్చాయి.  


ముగ్గురు కలిసి ఒక అమ్మాయిని ప్రేమిస్తే చివరికి ఆ అమ్మాయే బలవుతుందన్నదానికి టీవీ సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసు నిదర్శనంగా నిలిచింది. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీలో మానసికంగా కుమిలిపోయిన శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఈ కేసు పోలీసులకు చుక్కలు చూపించింది. తల్లిదండ్రులు చెప్పిన వెర్షన్‌కు, శ్రావణి స్నేహితులు పోలీసులకు వెల్లడించిన సమాచారంతో ఒకరకంగా గందరగోళం నెలకొంది. ఎవరికి వారు తాము బాధ్యులం కాదంటే తాము కాదని కొన్నాళ్లపాటు సాగదీశారు. చివరకు పోలీసులు శ్రావణి ఆత్మహత్యకు ఆమె స్నేహితులు ముగ్గురూ కారణమని నిర్ధారించారు. శ్రావణి స్నేహితుడు సాయిరెడ్డి, నిర్మాత అశోక్‌రెడ్డి, శ్రావణి మరో స్నేహితుడు దేవరాజురెడ్డిని నిందితులుగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. శ్రావణి తనకే దక్కాలంటే తనకే దక్కాలంటూ ముగ్గురూ సాగించిన దురాగతం, వేధింపులు, వీటికి తోడు.. ఇంట్లో తల్లిదండ్రుల మందలింపులు శ్రావణి ఆత్మహత్యకు ఉసిగొల్పినట్లు తేల్చారు. 


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డాలర్‌బాయ్‌ వ్యవహారాన్ని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి బట్టబయలు చేసింది. 139 మంది తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ.. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వ్యవహారం ప్రకంపనలు సృష్టించింది. కొద్దిరోజుల పాటు పోలీసు ఉన్నతాధికారులను కూడా కలవర పరిచింది. 42 పేజీలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సీసీఎస్‌కు బదిలీ చేశారు. చివరకు తనపై అత్యాచారం చేసింది ఒక్కడే అని, ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేయడంతో తాను అలా ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. మహిళను బెదిరించి పోలీస్‌ కాంప్లెయింట్ ఇప్పించి డాలర్‌బాయ్ పలువురు ప్రముఖులను డబ్బులకోసం బ్లాక్‌మెయిల్‌ చేసిన వ్యవహారాన్ని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి రిపోర్ట్‌ చేసింది. అదంతా డ్రామా అంటూ పక్కా ఆధారాలతో వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాల ఆధారంగా దర్యాప్తు సాగించిన పోలీసులు గోవాలో తలదాచుకున్న డాలర్‌బాయ్‌ అలియాస్‌ రాజశ్రీకర్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడు రెండు పెళ్లిళ్లు చేసుకొని మోసం చేయడం తో పాటు, పదుల సంఖ్యలో అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడినట్లు తేల్చారు.


మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు తరువాత ఆ స్థాయిలో తీవ్ర సంచలనం సృష్టించింది హైదరాబాద్‌లో హేమంత్ పరువు హత్య కేసు. ప్రేమించిన అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్న హేమంత్‌ను భార్య తరపు బంధువులు కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్ల చెరనుంచి హేమంత్‌ భార్య తప్పించుకోగా.. హేమంత్‌నే టార్గెట్‌ చేసిన వాళ్లు.. సంగారెడ్డి జిల్లాకు తీసుకెళ్లి హేమంత్‌ను హత్య చేశారు. ఈ హత్యకోసం హేమంత్‌ భార్య అవంతి తండ్రి లక్ష్మారెడ్డి 10 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చాడు. అవంతి మేనమామ ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించాడు. సుపారీ గ్యాంగ్‌తో హేమంత్‌ను హత్య చేయించాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తం 25 మందిని నిందితులుగా గుర్తించారు.


హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో 50 కోట్ల రూపాయల విలువైన భూ వివాదం షేక్‌పేట్‌ రెవెన్యూ అధికారులను చుట్టుకుంది. భూ వివాదంలో 50 లక్షలు లంచంగా తీసుకుంటూ ఆర్‌ఐ నాగార్జునరెడ్డి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ ఈ వ్యవహారంపై తీగలాగితే తహశీల్దార్‌ సుజాత సహా పలువురు రెవెన్యూ అధికారుల బాగోతం బయటపడింది. తహశీల్దార్ సుజాత ఇంట్లో సోదాలు చేసి 30 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. చివరకు ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు తేలడంతో తహశీల్దార్‌ సుజాతను అరెస్ట్ చేశారు.


ఇటు.. కీసర తహశీల్దార్‌ నాగరాజు.. ఓ భూ వివాదంలో కోటి పదిలక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటం దేశవ్యాప్తంగా ఓ కుదుపు కుదిపింది. అయితే, చంచల్‌గూడ జైలులో ఉన్న సమయంలోనే తహశీల్దార్‌ నాగరాజు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు తెలిపారు. అయితే, నాగరాజు ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని, దీని వెనుక ఏదో లోగుట్టు ఉందని కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు.  దీంతో.. తీవ్ర అలజడి చెలరేగింది. ఒక్క నాగరాజే ఇంత పెద్దమొత్తంలో లంచం డిమాండ్‌ చేసి ఉండడని, ఇంత భారీ కుంభకోణం వెనుక పెద్ద తలకాయలున్నాయన్న ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారం సాగుతున్నప్పుడే నాగరాజు మరణించడం అనుమానాలను బలపరిచింది. కేవలం తహశీల్దార్‌ నాగరాజును బలిచేసి, పై స్థాయి అధికారులు జారుకున్నారా ? అనే అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.


వాస్తవానికి నాగరాజు రెండు కోట్ల రూపాయలు లంచం డిమాండ్‌ చేసినట్లు బాధితులు ఏసీబీకి వెల్లడించారు. దీంతో, ఇంత పెద్దమొత్తంలో లంచం డిమాండ్‌ చేసిన వ్యవహారం ఎప్పుడూ చూడలేదంటూ కొందరు సామాజిక వేత్తలు గిన్నిస్‌ రికార్డ్స్‌ ప్రతినిధులను సంప్రదించారు. నాగరాజు భారీమొత్తంలో లంచం తీసుకున్న అంశాన్ని పరిశీలించాలని కోరారు. దానికి గిన్నిస్‌ ప్రతినిధులు కూడా ఈ అంశం ఇప్పటివరకు తమ పరిశీలనలో లేదని, ఇప్పుడు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. 


తహశీల్దార్‌ నాగరాజు మాత్రమే కాదు.. మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌ కోటి 12 లక్షల రూపాయలు లంచం డిమాండ్‌ చేసిన వ్యవహారం కూడా కలకలం సృష్టించింది. నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తిలోని 112 ఎకరాలకు ఎన్‌ఓసి ఇచ్చేందుకు అడిషనల్ కలెక్టర్ నగేశ్ భారీగా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎకరానికి లక్ష రూపాయల చొప్పున కోటి 12 లక్షలకు ఒప్పందం కుదిరింది. కొంత మొత్తం చెల్లించినా పని కాకపోవడంతో మూర్తి అనే రైతు.. ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో, నగేశ్ 40 లక్షలు లంచం  తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగేష్‌ ఇంటితో పాటు.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పలువురి ఇళ్లపైనా ఏసీబీ దాడులు చేసింది. భారీగా ఆస్తులు, నగదు స్వాధీనం చేసుకుంది. 


ఇక.. గడిచిన వారం రోజుల నుంచి ఆన్‌లైన్ కాల్‌మనీ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ పోలీసులు.. హైదరాబాద్‌, సైబరాబాద్‌ సహా.. ఢిల్లీ, గుర్గావ్‌లోనూ సోదాలు చేశారు. పదుల సంఖ్యలో యాప్‌ల ప్రతినిధులను అరెస్ట్‌లు చేశారు. 63  ఆన్‌లైన్‌ కాల్‌మనీ యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించాలంటూ గూగుల్‌ యాజమాన్యానికి లేఖ రాశారు. ఆర్‌బీఐ అనుమతులు లేకుండా మైక్రో ఫైనాన్స్‌ పేరుతో అధిక వడ్డీకి డబ్బులిస్తూ.. కార్పొరేట్‌ లుక్‌తో టెలికాలర్లను నియమించుకొని మరీ.. వేధిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ , ఢిల్లీలో కాల్ సెంటర్ల ఏర్పాటులో ఇండోనేషియా, చైనాకు కూడా లింక్ ఉన్నట్లు విచారణలో తేలింది. 11 వందల మంది టెలికాలర్లను నియమించుకున్న చైనా యాప్స్‌ ప్రతినిధులు.. హైదరాబాద్‌ కాల్‌ సెంటర్‌లో 600 మందిని, గుర్గావ్‌ కాల్‌సెంటర్‌లో 500 మందిని చేర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్‌సెంటర్లలో 700కు పైగా ల్యాప్‌ట్యాప్‌లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను, కోటి రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. టెక్నికల్‌ ఆధారాలతో విదేశీ లింకులపై ఆరా తీస్తున్నారు. ఈ పరిణామాలతో వందల సంఖ్యలో ఆన్‌లైన్‌ కాల్‌మనీ యాప్స్‌ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఫిర్యాదులు చేస్తున్నారు.


- సప్తగిరి గోపగోని, చీఫ్‌ సబ్‌ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2020-12-31T03:26:55+05:30 IST