రాష్ట్రం వెలుపల ధరణి డేటా
ABN , First Publish Date - 2020-10-01T07:24:17+05:30 IST
భూముల రికార్డులన్నింటికీ ’ధరణి’ డేటా ప్రామాణికం కావడంతో ఎలకా్ట్రనిక్ రూపంలో ఉన్న ఆ రికార్డును సురక్షితంగా భద్రపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తుపానులు.....
ఒడిసా లేదా ఢిల్లీలో భద్రపరచాలని నిర్ణయం
ఏ కారణంగానైనా సర్వర్ దెబ్బతింటే బ్యాకప్ కోసమే
200 టీబీ సామర్థ్యం గల సర్వర్ కోసం టెండర్లు
25 లోగా తహసీల్దార్ ఆఫీసుల్లో కెమెరాల బిగింపు
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): భూముల రికార్డులన్నింటికీ ’ధరణి’ డేటా ప్రామాణికం కావడంతో ఎలకా్ట్రనిక్ రూపంలో ఉన్న ఆ రికార్డును సురక్షితంగా భద్రపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తుపానులు, భూంకపాలు వంటి విపత్తులు వచ్చినప్పుడు భూ రికార్డులు నిల్వ చేసిన ధరణి సర్వర్ దెబ్బతింటే, ఆ వెంటనే డేటాను బ్యాకప్ చేసుకోవడానికి వీలుగా రాష్ట్రం వెలుపల సురక్షిత ప్రదేశాల్లో అత్యంత అధునాతనమైన సాంకేతిక నైపుణ్యంతో కూడిన సర్వర్‌ను పెట్టాలని నిర్ణయించింది. జాతీయ సమాచార కేంద్రానికి(ఎన్‌ఐసీ)కి ఒడిసాలోని భువనేశ్వర్‌లో డిజాస్టర్ రికవరీ సెంటర్ ఉంది. ఢిల్లీలో మరొక సెంటర్ ఉంది. భువనేశ్వర్, ఢిల్లీలో ఎక్కడైనా ఓ చోట 200 టెరాబైట్ సామర్థ్యం కలిగిన సర్వర్‌ను పెట్టి, ధరణి డేటాను ప్రభుత్వం భద్రపరచాలని నిర్ణయించింది. ఆ సర్వర్ కోసం తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ టెండర్లను పిలిచింది. సోమవారం ఈ టెండర్లు తెరవనున్నారు.
ఇక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ధరణి వెబ్‌సైట్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు, ఆ వెంటనే మ్యుటేషన్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించ డంతో రిజిస్ట్రేషన్ల శాఖ కూడా ఏడు దాకా అప్లికేషన్ సర్వర్లు, మరో 7 డేటా బేస్ సర్వర్లు సమకూర్చుకోనుంది. వీటిని కూడా ఒడిసాలోని భువనేశ్వర్‌లో ఉన్న డిజాస్టర్ రికవరీ సెంటర్‌లో లేదా ఢిల్లీలో భద్రపరచనున్నారు. కాగా గ్రేటర్ హైదరాబాద్, పట్టణాలు, నగరాలు మినహా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 400లకు పైగా తహసీల్దార్ కార్యాలయాల్లో ఒక్కో సీసీ కెమెరాను బిగించాలని సర్కారు నిర్ణయించింది. తహసీల్దార్ ఆఫీసుల్లోనే రిజిస్ట్రేషన్లు, ఆ వెంటనే మ్యుటేషన్లు కూడా చేయాలని నిర్ణయించడంతో పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్న దృష్ట్యా సీసీ కెమెరాల ఏర్పాటు చేయడమే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ టెండర్లు పిలిచి.. కేటాయించింది. టెండర్లు దక్కించుకున్న సంస్థలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ నెల 25 నాటికి సీసీ కెమెరాలు బిగించేందుకు కసరత్తు చేస్తున్నాయి.